భారతీయ యువకుడు.. పాకిస్థాన్ అమ్మాయి..11 ఏళ్లుగా నిరీక్షిస్తున్నా పెళ్లి కావడం లేదని..

ABN , First Publish Date - 2021-11-03T15:22:46+05:30 IST

ప్రేమికుల మధ్య సరిహద్దులు అడ్డురాలేవు అని నిరూపించడానికి ఒక జంట ఆన్‌లైన్ వివాహం చేసుకుంది. ఈ ఘటన భారత్, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, కరాచీ(పాకిస్తాన్)లో జరిగింది. అవును మీరు చదివినది నిజమే.. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు వదిలి ఉండలేక అన్‌లైన్ వివాహం చేసుకున్నారు....

భారతీయ యువకుడు.. పాకిస్థాన్ అమ్మాయి..11 ఏళ్లుగా నిరీక్షిస్తున్నా పెళ్లి కావడం లేదని..

ప్రేమికుల మధ్య సరిహద్దులు అడ్డురాలేవు అని నిరూపించడానికి ఒక జంట ఆన్‌లైన్ వివాహం చేసుకుంది. ఈ ఘటన భారత్, పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, కరాచీ(పాకిస్తాన్)లో జరిగింది. అవును మీరు చదివినది నిజమే.. ఆ ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు వదిలి ఉండలేక అన్‌లైన్ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగింది.


భారతీయుడైన మొహమ్మద్ హారిష్ పాకిస్తాన్ యువతి అయిన ఉస్రాను 11 ఏళ్ల క్రితం ఫేస్‌బుక్ ద్వారా కలుసుకున్నాడు.  హారిష్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తున్నాడు.  ఉస్రా పాకిస్తాన్ దేశంలోని కరాచీ నగరంలో ఉంటుంది. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారి తీసింది. అప్పుడప్పుడూ హారిష్ పాకిస్తాన్ కూడా వెళ్లాడు. అక్కడ ఉస్రా తల్లిదండ్రులను కలిసి తమ ప్రేమ విషయం చెప్పాడు. తాను ఒక పెద్ద సంస్థలో అకౌటెంట్‌గా పనిచేస్తున్నాని ఉస్రాని వివాహం చేసుకుంటానన్నాడు. అందుకు వారి అనుమతి కోరాడు.


ఉస్రా తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో తన ఇంట్లో కూడా ఒప్పించాడు. ఇక హారిష్, ఉస్రా పెళ్లి ఖాయమనుకుంటున్న సమయంలో కశ్మీర్ సమస్య మళ్లీ వచ్చిపడింది. దీంతో పాకిస్తాన్‌కు రాకపోకలను భారత్ నిలిపివేసింది. మోదీ ప్రభుత్వం వీసాలు జారిచేయడం నిలిపివేసింది. పరిస్థితులు చక్కబడేంత వరకు ఎదురు చూద్దామని వాళ్లు ఆగారు. కానీ ఆ తరువాత కరోనా మహమ్మారి విజృభించింది. విదేశీ ప్రయాణంపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. అలా గత మూడు సంవత్సరాలుగా వీసా లభించక తన పెళ్లిని హారిష్, ఉస్రా వాయిదా వేశారు.




కరోనా తగ్గినా వీసా దొరకడం లేదు. ఇక ప్రభుత్వాలు వీసా ఇచ్చేంత వరకూ ఆగడం కష్టమని భావించిన హారిష్, ఉస్రాలు ఆన్‌లైన్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిద్దరి కుటుంబాలు కూడా ఇందుకు అంగీకరించాయి. పెళ్లికి వధూవరులు తమ తమ దేశాలలో మస్తాబై కూర్చున్నారు. కంప్యూటర్‌లో వీడియో కాలింగ్ చేసి మత పెద్దల సమక్షంలో కుబూల్ హై, కుబూల్ హై అంటూ నికాహ్(ముస్లిం వివాహం) చేసుకున్నారు. ఆ వెంటనే ఇంట్లో బంధువులు, మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు. విందు భోజనం తిని పండుగ జరుపుకున్నారు.


వివాహం తరువాత మీడియాతో హారిష్ మాట్లాడుతూ.. చట్టపరంగా తన వివాహం చెల్లుబాటు అవుతుందని, ఇప్పుడైనా తమకు ప్రభుత్వ వీసా జారీ చేస్తుందని ఆశిస్తున్నానని అన్నాడు.  తన భార్య కేవలం 600 కిలోమీటర్ల అవతల తన కోసం ఎదురు చూస్తోందని ఆలోచించి ఆగలేకపోతున్నానని ఆనందం వ్యక్తం చేశాడు.


Updated Date - 2021-11-03T15:22:46+05:30 IST