సీఎం 'బక్రీద్'కు సడలింపుల నిర్ణయంపై ఐఎంఏ అభ్యంతరం

ABN , First Publish Date - 2021-07-18T22:23:53+05:30 IST

'ఈద్' పండుగ సందర్భంగా కోవిడ్ ఆంక్షలను సడలించేందుకు పినరయి విజయన్..

సీఎం 'బక్రీద్'కు సడలింపుల నిర్ణయంపై ఐఎంఏ అభ్యంతరం

తిరువనంతపురం: 'ఈద్' పండుగ సందర్భంగా కోవిడ్ ఆంక్షలను సడలించేందుకు పినరయి విజయన్ సారథ్యంలోని కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. మెడికల్ ఎమర్జెన్సీ నెలకొన్న తరుణంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనుచితమని పేర్కొంది. తక్షణం ప్రభుత్వ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరింది. జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్ వంటి పలు రాష్ట్రాలు ఏటా జరిపే ప్రఖ్యాత తీర్ధయాత్రలను నిలిపేశాయని గుర్తు చేసింది. ఇలాంటి తరుణంలో పెద్దఎత్తున జనం గుమిగూడే బక్రీద్‌ పండుగకు అనుమతిస్తూ కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని పేర్కొంది.


''దేశం విస్తృత ప్రయోజనాల దృష్ట్యా కేరళ ప్రభుత్వం తక్షణం తన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని ఐఎంఏ బలంగా కోరుతోంది. కోవిడ్ నిబంధనల విషయంలో ఎంతమాత్రం రాజీపడకూడదు. రాష్ట్రంతో పాటు యావద్దేశ భద్రతకు పాటుపడాల్సిన విద్యుక్త బాధ్యతను ప్రభుత్వం విస్మరించరాదు'' అని ఐఎంఏ కోరింది.


అవసరమైతే సుప్రీంకు...

కోవిడ్ నిబంధనలను పాటించని పక్షంలో కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వస్తుందని ఐఎంఏ స్పష్టం చేసింది. కాగా, బక్రీద్‌కు ఆంక్షల సడలింపులపై బీజేపీ, కాంగ్రెస్ సైతం కేరళ ప్రభుత్వాన్ని తప్పుపట్టాయి. కోవిడ్‌ను నిరోధం లాక్‌డౌన్ విధింపులో శాస్త్రీయ విధానాన్ని పినరయి విజయన్ ప్రభుత్వం పాటించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ నేత వీ.మురళీధరన్ విమర్శించారు. ఆంక్షల సడలింపులు సరికాదని, చింతించాల్సిన విషయమని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-07-18T22:23:53+05:30 IST