ఇమ్మిగ్రేషన్ నేరంపై బ్రిటన్‌లో భారతీయుడి అరెస్ట్ !

ABN , First Publish Date - 2021-04-01T14:27:24+05:30 IST

అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు గాను ఇమ్మిగ్రేషన్ నేరం కింద మంగళవారం ఓ భారతీయుడిని బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ(ఎన్‌సీఏ) అదుపులోకి తీసుకుని విచారిస్తుంది.

ఇమ్మిగ్రేషన్ నేరంపై బ్రిటన్‌లో భారతీయుడి అరెస్ట్ !

లండన్: అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు గాను ఇమ్మిగ్రేషన్ నేరం కింద మంగళవారం ఓ భారతీయుడిని బ్రిటన్ నేషనల్ క్రైమ్ ఏజెన్సీ(ఎన్‌సీఏ) అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. 38 ఏళ్ల భారత వ్యక్తి మరో ముగ్గురు బంగ్లాదేశీయులతో కలిసి తూర్పు ఇంగ్లండ్‌లో లారీలో వెళ్తున్న సమయంలో పట్టుబడ్డారు. ఈ నలుగురు చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించినట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం భారత వ్యక్తితో సహా బంగ్లాదేశీయులు విచారణ ఎదుర్కొంటున్నారు. గతకొంత కాలంగా యూకే సరిహద్దులో కొందరు కేటుగాళ్లు వలసదారులను అక్రమమార్గంలో దేశంలోకి తీసుకువస్తున్నట్లు ఇటీవల ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. దాంతో అక్రమ వలసలను నివారించేందుకు దేశ సరిహద్దులో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బార్డర్ వద్ద సోదాలు నిర్వహిస్తున్న అధికారులకు ఈ నలుగురు ఓ లారీలో ప్రయాణిస్తూ దొరికారు. మంగళవారం ఉదయం ఎం25 హైవేపై వీరిని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎన్‌సీఏ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ నలుగురిని విచారిస్తున్నట్లు ఎన్‌సీఏ బ్రాంచ్ ఆపరేషన్స్ మేనేజర్ ఇయాన్ ట్రూబీ తెలిపారు. కాగా, అరెస్టైన భారత వ్యక్తి వివరాలను అధికారులు వెల్లడించలేదు.          

Updated Date - 2021-04-01T14:27:24+05:30 IST