క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన భార‌త వ్య‌క్తి.. దోషిగా తేల్చిన సింగ‌పూర్ కోర్టు

ABN , First Publish Date - 2021-05-15T23:26:06+05:30 IST

క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కేసులో భార‌త వ్య‌క్తిని సింగ‌పూర్ న్యాయ‌స్థానం శుక్ర‌వారం దోషిగా తేల్చింది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన భార‌తీయుడు అక్క‌డి చాంగీ విమానశ్ర‌యానికి వెళ్లి, నాలుగు గంట‌ల పాటు ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి విమానం కోసం వేచి చూశాడు.

క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన భార‌త వ్య‌క్తి.. దోషిగా తేల్చిన సింగ‌పూర్ కోర్టు

సింగ‌పూర్ సిటీ: క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన కేసులో భార‌త వ్య‌క్తిని సింగ‌పూర్ న్యాయ‌స్థానం శుక్ర‌వారం దోషిగా తేల్చింది. క‌రోనా పాజిటివ్‌గా తేలిన భార‌తీయుడు అక్క‌డి చాంగీ విమానశ్ర‌యానికి వెళ్లి, నాలుగు గంట‌ల పాటు ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి విమానం కోసం వేచి చూశాడు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో భార‌త వ్య‌క్తిని ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. క‌రోనా నివార‌ణ నిబంధ‌నులు ఉల్ల‌ఘించినందుకు అత‌నిపై కేసు న‌మోదు చేశారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పార్తీబ‌న్ బాలాచంద్ర‌న్(26) అనే భార‌తీయుడు ఇలా క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘించి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. గ‌తేడాది ఏప్రిల్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అక్క‌డి జురాంగ్ పెంజూర డార్మిట‌రీలో ఇత‌ర కార్మికుల‌తో క‌లిసి పార్తీబ‌న్ ఉండేవాడు. ఈ క్ర‌మంలో అత‌నికి జ్వ‌రం, గొంతులో నొప్పి వంటి క‌రోనా ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. దాంతో ఏప్రిల్ 20న కొవిడ్ టెస్టు కోసం సింగ‌పూర్ జ‌న‌ర‌ల్‌ ఆప్ప‌త్రికి త‌ర‌లించారు. 


పార్తీబ‌న్ నుంచి స్వాబ్ సేకరించిన ఆస్ప‌త్రి సిబ్బంది.. టెస్టు రిజ‌ల్ట్ రావ‌డానికి స‌మ‌యం పడుతుందని, ఇక్క‌డే ఉండాల‌ని సూచించారు. కానీ, వారి సూచ‌న‌లను బేఖాత‌రు చేస్తూ పార్తీబ‌న్ అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. ఓ టాక్సీలో చాంగీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాడు. అక్క‌డ స్వ‌దేశానికి రావ‌డానికి విమాన టికెట్ కోసం ప్ర‌య‌త్నించాడు. కానీ, టికెట్ దొర‌క‌లేదు. దాంతో ఇత‌ర ప్ర‌యాణికుల‌తో క‌లిసి నాలుగు గంట‌ల పాటు విమానాశ్ర‌యంలోనే ఉండిపోయాడు. ఈ లోపు అదే రోజు సాయంత్రం పార్తీబ‌న్ క‌రోనా రిజ‌ల్ట్ వ‌చ్చింది. ఆ రిపోర్టులో అత‌నికి పాజిటివ్‌గా తేలింది. అయితే పార్తీబ‌న్ ఆస్ప‌త్రిలో లేడ‌ని తెలుసుకున్న అక్క‌డి సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తున్న పార్తీబ‌న్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ప్ర‌త్యేక అంబులేన్స్‌లో మ‌ళ్లీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆస్ప‌త్రిలోనే ఐసోలేట్ చేశారు. 14 రోజుల త‌ర్వాత కోలుకున్న పార్తీబ‌న్‌ను తిరిగి జురాంగ్ పెంజూర డార్మిట‌రీకి త‌ర‌లించారు. 


మ‌రో 14 రోజుల పాటు అక్క‌డి నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని పోలీసులు చెప్పారు. అయితే, ఆ డార్మిట‌రీలో త‌న‌తో పాటు ఉండే ఇత‌ర కార్మికులు క‌రోనా బారిన ప‌డుతుండ‌డం చూసిన పార్తీబ‌న్ మ‌ళ్లీ అక్క‌డి నుంచి త‌ప్పించుకున్నాడు. మ‌రోసారి భార‌త్‌కు వ‌చ్చేందుకు చాంగీ ఎయిర్‌పోర్టుకు వెళ్లాడు. ఈసారి కూడా టికెట్ దొర‌క‌క‌పోవ‌డంతో త‌న‌కు తెలిసిన వారి ఇంటికి వెళ్లాడు. వారితో జ‌రిగిన విష‌యం చెప్పాడు. దాంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారి స‌మాచారంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు పార్తీబ‌న్‌ను అదుపులోకి తీసుకుని, క‌రోనా సెఫ్టీ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కింద కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసు సింగ‌పూర్ కోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చింది. పార్తీబ‌న్‌ను దోషిగా తేల్చిన న్యాయ‌స్థానం, త‌దుప‌రి విచార‌ణ‌ను జూన్‌కు వాయిదా వేసింది. ఇక దోషిగా తేలిన పార్తీబ‌న్‌కు ఆరు నెల‌ల జైలు, రూ. 5.50ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.     

Updated Date - 2021-05-15T23:26:06+05:30 IST