శిక్షణ షెడ్యూల్‌ తయారు చేయాలి

ABN , First Publish Date - 2020-03-29T10:00:12+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ను.. పరిస్థితి చక్కపడగానే తిరిగి నిర్వహిస్తారని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) ...

శిక్షణ షెడ్యూల్‌ తయారు చేయాలి

క్రీడా సమాఖ్యలకు ఐఓఏ సూచన

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ను.. పరిస్థితి చక్కపడగానే తిరిగి నిర్వహిస్తారని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా పేర్కొన్నారు. తమ క్రీడాంశాలలో జరగాల్సిన ఒలింపిక్‌ అర్హత టోర్నీల వివరాలను తెలియజేయాలని అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలను ఆయన శనివారం కోరారు. అలాగే టోక్యో విశ్వ క్రీడలు 2021కి వాయిదా పడిన నేపథ్యంలో తమ అథ్లెట్ల శిక్షణ షెడ్యూల్‌ వివరాలను కూడా తెలియజేయాలని సూచించారు. ‘కొవిడ్‌-19 వైరస్‌ తగ్గుముఖం పట్టగానే క్వాలిఫికేషన్‌ టోర్నీలను మళ్లీ నిర్వహిస్తారు. వాటికి సంబంధించి తాత్కాలిక ముసాయిదా ప్రణాళికను తయారు చేసుకోవాలి. అలాగే మీ క్రీడాంశాలలో జరగాల్సిన అర్హత టోర్నమెంట్ల వివరాలను ఐఓఏకి పంపండి’అని అన్ని క్రీడా సమాఖ్యల అధ్యక్షులు, కార్యదర్శులకు రాసిన లేఖలో బాత్రా కోరారు. ఈ లేఖను క్రీడా మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాఽథికార సంస్థ (సాయ్‌)కు కూడా పంపారు. కాంట్రాక్టు ముగిసే కోచ్‌లకు పొడిగింపు ఇవ్వాలని సూచించారు. విదేశాలతోపాటు స్వదేశానికి చెందిన చాలామంది కోచ్‌ల కాంట్రాక్టు గడువు ఈ ఆగస్టుతో ముగియనుంది. అయితే ఒలింపిక్స్‌ వాయిదా పడడంతో వారి కాంట్రాక్టును పొడిగించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఏడు క్రీడాంశాలు.. అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బాక్సింగ్‌, ఈక్వెస్ట్రియన్‌, హాకీ, షూటింగ్‌, రెజ్లింగ్‌లో కలిపి దాదాపు 80 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు.

Updated Date - 2020-03-29T10:00:12+05:30 IST