రూ.593కోట్ల భారీ మోసం.. Americaలో భారత సంతతి ప్రముఖుడిపై కేసు..!

ABN , First Publish Date - 2021-08-27T06:45:08+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. పెట్టుబడుల పేరుతో అధిక మొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశాడు. తాజాగా అతను చేసిన మోసాలు బయటపడ్డాయి.

రూ.593కోట్ల భారీ మోసం.. Americaలో భారత సంతతి ప్రముఖుడిపై కేసు..!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతికి చెందిన వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. పెట్టుబడుల పేరుతో అధిక మొత్తంలో ఇన్వెస్టర్ల నుంచి డబ్బులు వసూలు చేశాడు. తాజాగా అతను చేసిన మోసాలు బయటపడ్డాయి. దీంతో అధికారులు అతడిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన మనీష్ లచ్వానీ (45) హెడ్‌స్పిన్ సహ వ్యవస్థాపకుడు. గతంలో ఈయన హెడ్‌స్పిన్‌కు సీఈఓగా కూడా పని చేశాడు. కాగా.. మనీష్ 2015 - 2020 మార్చి మధ్య కాలంలో హెడ్‌స్పిన్‌కు సంబంధించిన మొబైల్ యాప్ టెస్టింగ్ ప్లాట్‌ఫాం కోసం ఇన్వెస్టర్ల నుంచి 100 మిలియన్ డాలర్లను పెట్టుబడుల రూపంలో సేకరించాడు. అంతేకాకుండా ఈ వ్యాపార లావాదేవీలకు సంబంధించి మనీష్.. పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం అందించాడు. దాదాపు 80 మిలియన్ డాలర్ల మేర మోసం చేశాడు.  దీంతోపాటు ఆదాయం పెరిగేలా చేయాలని ఉద్యోగులపై అనేక సందర్భాల్లో ఒత్తిడి తెచ్చాడు. 



దీంతో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కంపెనీకి సంబంధించిన ఆర్థిక నివేదికలను ఆడిటింగ్ సంస్థ పరిశీలించింది. ఈ నేపథ్యంలో మనీష్ మోసాలు బయటపడ్డాయి. కంపెనీ తన కార్యకాలాపాలను ప్రారంభించిన నాటి నుంచి 2020 ప్రథమార్థం వరకు హెడ్‌స్పిన్ మొత్తం ఆదాయం 26.3 మిలియన్ డాలర్లు మాత్రమే అన్న విషయాన్ని ఆడిటింగ్ సంస్థ బయటపెట్టింది. కంపెనీ తన నివేదికల్లో చూపిన విధంగా హెడ్‌స్పిన్ ఆదాయం 95.3 మిలియన్ డాలర్లు కాదని వెల్లడించింది. ఈ క్రమంలో అధిక ఆదాయం చూపించి.. ఇన్వెస్టర్ల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులను వసూలు చేసిన నేరంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన అధికారులు మనీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నేరం రుజువైతే మనీష్‌కు 20ఏళ్ల జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానా ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. హెడ్‌స్పిన్‌ను స్థాపించకముందు మనీష్.. అమెజాన్ టాబ్లెట్,కిండల్ కోసం మొదటి ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించి మంచి గుర్తింపు పొందాడు. 


Updated Date - 2021-08-27T06:45:08+05:30 IST