సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 14 వారాల జైలు!

ABN , First Publish Date - 2021-03-30T16:07:40+05:30 IST

గతేడాది ఓ ఆస్పత్రిలో ఉద్దేశపూర్వకంగా పోలీస్ అధికారిపై దగ్గడంతో పాటు నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు సోమవారం 14 వారాల జైలు శిక్ష విధించింది.

సింగపూర్‌లో భారత సంతతి వ్యక్తికి 14 వారాల జైలు!

సింగపూర్ సిటీ: గతేడాది ఓ ఆస్పత్రిలో ఉద్దేశపూర్వకంగా పోలీస్ అధికారిపై దగ్గడంతో పాటు నోరుపారేసుకున్న భారత సంతతి వ్యక్తికి సింగపూర్ కోర్టు సోమవారం 14 వారాల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే... దేవరాజ్ తమిళ్ సెల్వన్ అనే భారత వ్యక్తిని గతేడాది సెప్టెంబర్ 13న మహిళను హింసించిన కేసులో సింగపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడ్ని స్టేషన్‌కు తరలించే క్రమంలో తనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని, తనను ఎంగ్ తెంగ్ ఫాంగ్ జనరల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని దేవరాజ్ పోలీసులకు చెప్పాడు. దాంతో పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో తాను ధరించిన మాస్కు తీసేసి.. ఆస్పత్రి వైద్యులతో దురుసుగా ప్రవర్తించిన దేవరాజ్‌ను వారించే ప్రయత్నం చేశారు పోలీసులు. వెంటనే మాస్కు ధరించాలని కోరిన పోలీస్ అధికారికి.. నా చేతులకు సంకేళ్లు ఉన్నాయి కనిపించడం లేదా అంటూ బూతులు తిట్టాడు. దగ్గరికి వచ్చిన పోలీస్ అధికారిపై కావాలనే దగ్గాడు. తాజాగా ఈ కేసు సింగపూర్ కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో జడ్జి ఎంగ్ చెంగ్ థియామ్.. దేవరాజ్‌కు 14 వారాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.      

Updated Date - 2021-03-30T16:07:40+05:30 IST