నువ్వే నా భార్యవు.. ఫిక్స్ అయిపో.. అంటూ 100 పేజీల లేఖ.. ఓ ఎన్నారై కుర్రాడి ప్రేమ పైత్యం.. చివరకు..

ABN , First Publish Date - 2021-12-11T23:36:56+05:30 IST

‘నిన్ను నా భార్యను చేసుకుంటా.. నా పిల్లలకు తల్లిని చేస్తా.. నాతోనే ఉండిపోయేలా చేస్తా..’ ఇదీ బ్రిటన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ సంతతి యువకుడు ఓ విద్యార్థినికి పంపిన వాయిస్ మెయిల్. తన యూనివర్శిటీలోనే చదువుకుంటున్న ఆమెను ప్రేమ పేరుతో అతడు భయభ్రాంతులకు గురి చేశాడు. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగిన..

నువ్వే నా భార్యవు.. ఫిక్స్ అయిపో.. అంటూ 100 పేజీల లేఖ.. ఓ ఎన్నారై కుర్రాడి ప్రేమ పైత్యం.. చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: ‘నిన్ను నా భార్యను చేసుకుంటా.. నా పిల్లలకు తల్లిని చేస్తా.. నాతోనే ఉండిపోయేలా చేస్తా..’  ఇదీ బ్రిటన్‌లో చదువుకుంటున్న ఓ భారతీయ సంతతి యువకుడు ఓ విద్యార్థినికి పంపిన వాయిస్ మెయిల్. తన యూనివర్శిటీలోనే చదువుకుంటున్న ఆమెను ప్రేమ పేరుతో అతడు భయభ్రాంతులకు గురి చేశాడు. దాదాపు ఆరు నిమిషాల పాటు సాగిన మెసేజ్ అది. అంతకుమునుపు.. ఏకంగా 100 పేజీల ప్రేమ లేఖ పంపాడు. అందులో ఏవేవో రాసుకొచ్చాడు. గూగుల్‌లో దొరికిన పద్యాలు, కవితలను ప్రస్తావిస్తూ తన ప్రేమను అంగీకరించమని ఆమెను బెదిరించాడు.


బాధితురాలు మొదటి నుంచీ తనకు అతడి పట్ల ఎటువంటి ఆసక్తీ లేదని చెబుతూనే ఉంది. నిందితుడు మాత్రం తన వేధింపులు ఆపలేదు. అతడి వాలకం చూసి తనపై ఏ క్షణాన్నైనా దాడి చేయచ్చని భయపడిపోయిన ఆమె చివరికి ఫిర్యాదు చేసింది. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ బ్రూక్స్ యూనివర్శిటీలో ఇటీవల జరిగిన ఉదంతం ఇది. ఈ కేసులో అక్కడి న్యాయస్థానం తాజాగా నిందితుడు సాహిల్ భవ్నానీకి నాలుగు నెలల కారాగార శిక్ష విధించింది(సస్పెండెడ్ సెంటెన్స్).  


ఆక్స్‌ఫర్డ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి నైజెల్ డేలీ సాహిల్‌కు గురువారం శిక్ష ఖరారు చేశారు. వాస్తవానికి గత నెలలోనే అతడికి శిక్ష పడాల్సి ఉన్నప్పటికీ..నిందితుడిని బహిష్కరించాలా వద్దా అన్న విషయంలో యూనివర్శిటీ ఓ నిర్ణయానికి రాకపోవడంతో న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. అయితే.. సాహిల్ చేసిన నేరం తీవ్రత దృష్ట్యా అతడి ఇంజినీరింగ్ చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి, అతడిని విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించాలని యూనివర్శిటీ అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తేవడంతో జడ్జి కూడా తీర్పు వెలువరించారు. ‘‘ఇప్పటికైనా ఆమె జోలికి పోవనే ఆనుకుంటున్నా..’’ అంటూ న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా.. ఇటువంటి నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు యూనివర్శిటీ నిబంధనల్లోనూ మార్పు రావాలని బాధితురాలు పేర్కొంది. ఈ విషయాన్ని యూనివర్శిటీ అధికారులు కూడా అంగీకరించారు. తగిన మార్పులు చేస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అతడికి అత్యంత కఠినమైన శిక్షనే విధించామని పేర్కొన్నారు.


అయితే.. న్యాయమూర్తి నిందితుడికి సస్పెండెడ్ సెంటెన్స్ ఖరారు చేశారు. దీనితో పాటూ యూనివర్శిటీ దరిదాపుల్లోకి ఐదేళ్ల పాటు రావద్దని కూడా ఆదేశించారు. ఇక సస్పెండెడ్ సెంటెన్స్ అంటే.. శిక్ష ఖరారైనప్పటికీ అమలు మాత్రం కొన్నాళ్ల పాటు వాయిదా(ఈ కేసులో రెండేళ్లు) పడుతుంది. ఈ క్రమంలో నిందితుడు న్యాయమూర్తి సూచించిన విధంగా నడుచుకోవాల్సి ఉంటుంది. కోర్టు తీర్పును ఉల్లంఘిస్తే న్యాయమూర్తి నిందితుడికి మరింత కఠినమైన శిక్షను ఖరారు చేయవచ్చు. నిబంధనలన్నీ పాటిస్తే శిక్ష రద్దు కూడా కావచ్చు. అయితే.. ఈ శిక్ష విధించిన విషయం మాత్రం అతడి రికార్డుల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇది కూడా ఓ తరహా శిక్షేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. 

Updated Date - 2021-12-11T23:36:56+05:30 IST