Abn logo
Aug 4 2020 @ 20:53PM

దారుణ హత్యకు గురైన భారత సంతతి పరిశోధకురాలు.. అమెరికాలో..

ప్లానో, డాలస్: అమెరికాలో భారత సంతతి పరిశోధకురాలు సర్మిస్తా సేన్(43) దారుణ హత్యకు గురయ్యారు. డాలస్‌లోని ప్లానో ప్రాంతంలో సర్మిస్తా సేన్ జాగింగ్‌కు వెళ్లిన సమయంలో దుండగులు ఆమెను కిరాతకంగా హత్య చేశారు. ఆగస్ట్ 1న చిషోల్మ్ ట్రైల్ పార్క్‌లో ఈ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి బకారీ మాన్‌క్రీఫ్(29) అనే అనునాస్పద వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని.. తాము కేవలం అనుమానంతోనే బకారీ మాన్‌క్రీఫ్‌ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. తాము అరెస్ట్ చేసిన వ్యక్తి ఈ హత్యకు కారణమా లేదా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. హత్య జరిగిన సమయంలోనే సమీపంలోని ఓ ఇంట్లో దొంగలు పడ్డారని పోలీసులు చెప్పారు. సర్మిస్తా సేన్ పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే ఆమె హత్యకు గల కారణాలు తెలిసే అవకాశాలున్నాయి. సర్మిస్తా సేన్ మరణంతో కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎవరికి ఏ సహాయం అవసరమైనా సర్మిస్తా సేన్ తాను ఉన్నానంటూ భరోసానిచ్చేదని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. మంచి వాళ్లకే ఇలాంటివి ఎందుకు జరుగుతాయో అర్థం కావడం లేదని బంధువులు ఆవేదన వెల్లగక్కారు. కాగా.. సర్మిస్తా సేన్ మాలిక్యులర్ బయోలజీ చేసి ఫార్మసిస్ట్‌గా, పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. జార్ఖండ్‌లోని సింద్రి ఆమె స్వస్థలం. అరిందమ్ రాయ్ అనే వ్యక్తితో పెళ్లయ్యాక ఆమె అమెరికా వచ్చారు. సర్మిస్తా సేన్‌కు ఇద్దరు పిల్లలున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement
Advertisement