వద్దు బాబోయ్‌.. ఐపీఎల్‌!

ABN , First Publish Date - 2020-03-11T09:59:43+05:30 IST

భారత్‌లోనూ క్రమంగా వ్యాపిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది...

వద్దు బాబోయ్‌.. ఐపీఎల్‌!

మా దగ్గర మ్యాచ్‌లు వద్దన్న 

కర్ణాటక ప్రభుత్వం

లీగ్‌ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ


బెంగళూరు: భారత్‌లోనూ క్రమంగా వ్యాపిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ ఇప్పుడు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. మరో మూడు వారాల్లో మొదలవనున్న ఈ లీగ్‌పై ఇప్పటికే మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాజాగా కర్ణాటకలోనూ నిరసన కనిపిస్తోంది. ఎందుకంటే.. బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌లను అనుమతించబోమని కర్ణాటక ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాకుండా అసలు ఈ సీజన్‌లో మ్యాచ్‌లనే రద్దు చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసినట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... అమెరికా నుంచి సోమవారం భారత్‌ చేరుకున్న బెంగళూరు టెకీకి కరోనా వైరస్‌ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్‌ ప్రకటించారు. అంతేకాకుండా ఆ టెకీ యూఎస్‌ నుంచి తిరిగొచ్చాక ఏకంగా 2,666 మందిని కలిసినట్టు తేలింది. ఇదే ఇప్పుడు అందరినీ వణికిస్తోంది. ప్రస్తుతం అతడిని రాజీవ్‌ గాంధీ ఛాతీ ఆస్పత్రిలో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఐటీ కంపెనీలున్న ఏరియాలో అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.


స్థానిక చానెల్‌ కథనాల ప్రకారం.. కరోనా వైరస్‌ మరింత విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈసారికి ఐపీఎల్‌ను రద్దు చేయడమో లేక వాయిదా అయినా వేయాలని కర్ణాటక వైద్యవిద్య శాఖ మంత్రి కేంద్రానికి లేఖ రాశారు. తమ ప్రభుత్వం బెంగళూరులో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణకు సుముఖంగా లేదని ఆ లేఖలో మంత్రి వెల్లడించారు. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ మాత్రం ఎట్టి పరిస్థితిల్లోనూ లీగ్‌ను జరిపి తీరుతామని ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడి చిన్నస్వామి మైదానం విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టుకు హోం గ్రౌండ్‌గా ఉంటోంది. ఐపీఎల్‌పై ఆ రాష్ట్రం తమ వైఖరి మార్చుకోకపోతే ఆర్‌సీబీ తమ వేదికను ఇతర నగరానికి తరలించాల్సి ఉంటుంది. ఇక రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాలకు కూడా ఈ భయం పాకితే ఐపీఎల్‌-13వ సీజన్‌ ప్రశ్నార్థకమవుతుంది.

Updated Date - 2020-03-11T09:59:43+05:30 IST