సందేహాలన్నీ తీరేనా?

ABN , First Publish Date - 2020-08-02T09:15:47+05:30 IST

యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 లేక 10 వరకు జరుగబోయే ఐపీఎల్‌లో అనుసరించాల్సిన సమగ్ర

సందేహాలన్నీ తీరేనా?

వేసవిలోనే జరగాల్సిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఎట్టకేలకు ఎప్పుడు జరిగేది.. ఎప్పుడు ముగిసేది ఖరారైంది. కానీ ఇంకా తుది షెడ్యూల్‌ మాత్రం పెండింగ్‌లోనే ఉంది. అసలు ప్రస్తుత కరోనా కాలంలో ఈ భారీ ఈవెంట్‌ను ఎలా విజయవంతం చేయాలనే దానిపై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతోంది. ఈనేపథ్యంలో నేడు జరగనున్న ఐపీఎల్‌ పాలక మండలి భేటీలో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. అభిమానులతో పాటు ఆయా ఫ్రాంచైజీల మదిలో ఉన్న సందేహాలకు కూడా బీసీసీఐ తెర దించనుంది.


నేడు ఐపీఎల్‌ పాలక మండలి సమావేశం

తుది షెడ్యూల్‌, ఎస్‌ఓపీపై చర్చ

ఇంకా లభించని ప్రభుత్వ అనుమతి


న్యూఢిల్లీ: యూఏఈలో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 8 లేక 10 వరకు జరుగబోయే ఐపీఎల్‌లో అనుసరించాల్సిన సమగ్ర విధి విధానాల (ఎస్‌ఓపీ)పై పాలక మండలి ఆదివారం సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోయినా బోర్డు అధికారులు ఈ లీగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తుది షెడ్యూల్‌ను ఈ సమావేశం ద్వారా ఫ్రాంచైజీలకు అందించనున్నారు. అంతేకాకుండా ఐపీఎల్‌ లోగో స్పాన్సరర్‌గా ఉన్న చైనా కంపెనీ వివోపై కూడా ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మీటింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధూమల్‌, సంయుక్త కార్యదర్శి జయేశ్‌ జార్జి హాజరవుతారు. ‘ఆదివారం పాలక మండలి సమావేశం జరుగబోతోంది. అయితే మేమంతా యూఏఈలో ఈ లీగ్‌ను జరిపేందుకు కేంద్ర హోం, విదేశాంగ శాఖల నుంచి అనుమతి కోసం చూస్తున్నాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

ఇదీ అజెండా..: ఇంతకుముందు జరిగిన మూడు పాలక మండలి సమావేశాల మినిట్స్‌ను ఆమోదించడం. అలాగే టోర్నీని 51 రోజుల పాటు జరపాలా? లేక దీపావళి సందర్భంగా మరో రెండు రోజులు ముందుకు జరిపి నవంబరు 10న ఫైనల్‌ను ఆడించాలా? అనేది తేల్చనున్నారు. టైటిల్‌ లోగో స్పాన్సరర్‌ వివో ఏడాదికి రూ.440 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు భారత్‌, చైనా మధ్య ఉద్రిక్త సంబంధాల నేపథ్యంలో వివోతో ఎలా ముందుకెళ్లాలో ఆలోచించనున్నారు. అయునా ఇప్పటికిప్పుడు మరో స్పాన్సరర్‌ రావడం కష్టమనే అభిప్రాయంలో ఐపీఎల్‌ ఉంది. ఇక ముఖ్యంగా ఎస్‌ఓపీపై 240 పేజీల డాక్యుమెంట్‌ను తయారుచేశారు. దీన్ని ఫ్రాంచైజీలతో పంచుకోవాల్సి ఉంది. దీంట్లో ఆటగాళ్ల ఆరోగ్య రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నిసార్లు కొవిడ్‌ టెస్టులు జరపాలి, బయో బబుల్‌ను ఎలా రూపొందించాలి? అనే ప్రశ్నలకు సమాధానం ఉంటుంది. అలాగే ఈ మ్యాచ్‌ల కోసం పాలక మండలి సభ్యులు వెళ్లడంపై కూడా చర్చించనున్నారు.

Updated Date - 2020-08-02T09:15:47+05:30 IST