Abn logo
Sep 19 2020 @ 03:31AM

కాస్కో.. సరికొత్తగా చూస్కో!

Kaakateeya

ఐపీఎల్‌ వచ్చిందోచ్‌

నేటి నుంచే ధనాధన్‌ లీగ్‌

అబుధాబిలో తొలి మ్యాచ్‌.. రాత్రి 7.30కు ప్రారంభం


విరాట్‌ కోహ్లి వీరోచిత పోరాటాలు.. రోహిత్‌ శర్మ కళ్లు చెదిరే సిక్సర్లు.. జస్ర్పీత్‌ బుమ్రా బుల్లెట్‌ బంతులు.. హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండ్‌ మెరుపులు.. ఒకటా? రెండా? ఆర్నెల్లు దాటిపోయింది.. మైదానంలో మన క్రికెట్‌ హీరోలను చూసి..! అభిమానులందరిలోనూ ఇన్నాళ్లూ దిగులు.. ఉత్కంఠ రేపే మ్యాచ్‌లు మళ్లెప్పుడని ప్రశ్నలు.. ఆ బెంగ తీర్చేందుకు.. ఆటతో అలరించేందుకు.. వచ్చేసింది.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)..!  శనివారం నుంచే 13వ సీజన్‌ షురూ! ముంబై ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌ క్సింగ్‌ మధ్య అబుధాబిలో తొలి మ్యాచ్‌..! ఇక నవంబరు 10వ తేదీ వరకు 

53 రోజులు పండుగ కోలాహలమే..!


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌... దేశంలోని క్రికెట్‌ ఫ్యాన్స్‌ను దశాబ్ద  కాలానికిపైగా అలరిస్తున్న  క్రీడా వినోదం. ధన్‌ ధనాధన్‌ ఆటతీరుతో సిక్సర్లు, ఫోర్ల హోరుతో.. చీర్‌ లీడర్ల సొగసులతో.. వావ్‌, ఎవరైనా ఈ పొట్టి క్రికెట్‌ మాయలో పడిపోవాల్సిందే. కానీ ప్రతీ ఏడాదిలా కాకుండా ఈసారి సరి‘కొత్త’గా ముస్తాబైంది ఐపీఎల్‌.


ఎలాగంటే.. క్రికెటర్ల అద్భుత విన్యాసాలను ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియాల్లో ప్రేక్షకులు ఉండరు.. తారాజువ్వల్లా బంతి గాల్లోకి ఎగరగానే సందడి చేసే చీర్‌లీడర్లు కనిపించరు.


ఇది కరోనా కాలం బాసూ..!ఇప్పుడంతా సీన్‌ రివర్స్‌.. మ్యాచ్‌ల కోసం అంతా టీవీలకు అతుక్కుపోవాల్సిందే. అటు లీగ్‌లోనూ కొవిడ్‌ టెస్టులు.. శానిటైజర్లు.. పీపీఈ కిట్లు.. క్వారంటైన్‌లాంటి పదాలనే  వినాల్సి ఉంటుంది.


నేటి నుంచే యూఏఈలో ఐపీఎల్‌-13 సీజన్‌

బయోసెక్యూర్‌ జాగ్రత్తలతో లీగ్‌ నిర్వహణ


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

అడ్డంకులెన్ని ఎదురైనా ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులను అలరించేందుకు క్రేజీ.. క్రేజీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం ఆరు నెలల ఆలస్యంగానైనా రానే వచ్చింది. ఎడారి దేశమైన యూఏఈలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో శనివారం నుంచే 13వ సీజన్‌కు తెర లేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, రన్నరప్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడబోతున్నాయి. ఓవరాల్‌గా నేటి నుంచి నవంబరు 10 వరకు ఎనిమిది జట్ల మధ్య 53 రోజుల పాటు 60 మ్యాచ్‌లు జరుగబోతున్నాయి. గత ఆరు నెలలుగా భారత ఆటగాళ్ల క్రికెట్‌ విన్యాసాలు చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 29 నుంచి జరగాల్సిన ఈ లీగ్‌ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ చివరకు యూఏఈలో ఆడాల్సి వస్తోంది. టీ20 ప్రపంచకప్‌, వింబుల్డన్‌, ఒలింపిక్స్‌లాంటి మేజర్‌ ఈవెంట్స్‌లన్నీ ఈ ఏడాది నిర్వహించలేమని నిర్వాహకులు చేతులెత్తేసినా బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌పై ఆశలు వదులుకోలేదు. లీగ్‌ను రద్దు చేసుకుంటే బోర్డుకు రూ.4 వేల కోట్ల నష్టం రాబోతుండడమే దీనికి ప్రధాన కారణం. మధ్యలో టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో వైదొలిగి కాస్త ఆందోళన పెంచినా మరో స్పాన్సర్‌ డ్రీమ్‌-11 రూ.222 కోట్లతో బిడ్డింగ్‌ గెలుచుకుంది. ఎలాగైతేనేం.. టీ20 ప్రపంచకప్‌ విండో కూడా లభించడంతో కథ సుఖాంతమైనట్టయింది. 


పకడ్బందీ నిబంధనలు

యూఏఈలో అడుగుపెట్టినప్పటినుంచి ఎనిమిది జట్లూ బయో సెక్యూర్‌ బబుల్‌లో ఉంటున్నాయి. ప్రతి జట్లూ విడిగా హోటళ్లు, రిసార్టుల్లో తమ వసతిని ఏర్పాటు చేసుకున్నాయి. బయో సెక్యూర్‌లో ఉండే వీరిని ఎవరూ కలవడానికి వీల్లేదు. ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు జరిగిన రోజు స్టేడియాలకు, ఆ తర్వాత నేరుగా తమ బసకు చేరాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారి కారణంగా ఈసారి ఆరంభ వేడుకలు కూడా లేవు. లీగ్‌ ఆద్యంతం మొత్తం 20వేల కరోనా టెస్టులు జరుపనున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చెన్నై జట్టులో కరోనా కేసులు వెలుగు చూడడం కలకలం రేపింది. అటు రైనా, హర్భజన్‌ కూడా కరోనాకు భయపడి లీగ్‌కు దూరమయ్యారు. ఇక మ్యాచ్‌లన్నీ దుబాయ్‌ (24), షార్జా (12), అబుదాబి (20)లలో జరుగుతాయి. ప్లేఆఫ్‌ వేదికలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. మొత్తం 10 డబుల్‌ హెడర్‌ (మధ్యాహ్నం, రాత్రి) మ్యాచ్‌లుంటాయి. ప్రస్తుతానికైతే మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదు. స్టేడియాల్లో వ్యక్తుల సంఖ్యను తగ్గించేందుకు చీర్‌లీడర్లను కూడా పక్కనబెట్టారు. 


మీటింగులు లేవు..

  కొవిడ్‌ నిబంధనల కారణంగా ఈసారి ఐపీఎల్‌లో మీడియాకు అనుమతి లేదని బీసీసీఐ ప్రకటించింది. మామూలుగానైతే ఆయా జట్ల ప్రాక్టీ్‌సను కవర్‌ చేయడానికి.. ప్రెస్‌మీట్లకు మీడియా ప్రతినిధులకు నేరుగా అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ముందు జాగ్రత్తగా వారిని అనుమతించడం లేదని బోర్డు వెల్లడించింది. మ్యాచ్‌లకు ముందు ఆయా ఫ్రాంచైజీలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, మ్యాచ్‌ ముగిశాక మాత్రం వర్చువల్‌ మీడియా సమావేశాలుంటాయని తెలిపింది. ‘ఆటగాళ్ల ఆరోగ్య భద్రతా కారణాల రీత్యా మీడియా వ్యక్తులను స్టేడియాల్లోకి లేదా ప్రాక్టీస్‌ సెషన్ల కవరేజ్‌కు అనుమతించడం లేదు. యూఏఈ మీడియా మినహా మరే మీడియా రిజిస్ట్రేషన్లకు కూడా అనుమతి లేదు. మ్యాచ్‌లు ముగిశాక అప్‌డేట్స్‌ను ప్రెస్‌ నోట్స్‌ ద్వారా అందిస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది. 


అరగంట ముందుగానే..

ఇప్పటిదాకా ఐపీఎల్‌ మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేవి. అయితే, ఈసారి లీగ్‌ యూఏఈలో జరుగుతోంది కాబట్టి.. భారత అభిమానులను దృష్టిలో ఉంచుకుని మ్యాచ్‌లను అరగంట ముందుకు జరిపారు. దీంతో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కు.. రాత్రి 7.30కు మ్యాచ్‌లు ఆరంభమవుతాయి. 


Advertisement
Advertisement
Advertisement