Abn logo
Nov 12 2020 @ 04:17AM

హిట్టు..ఫ్లాపు

Kaakateeya

కరోనా కష్టకాలంలో ఎన్నో అవరోధాలు అధిగమించి యూఏఈ వేదికగా నిర్వహించిన ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) విజయవంతమైంది. గతానికి భిన్నంగా  ప్రేక్షకుల సందడి లేకుండా బయో బబుల్‌ వాతావరణంలో ఆటగాళ్లు, అధికారుల సమక్షంలో జరిగినా.. ఈసారి లీగ్‌ అందరినీ అలరించింది. సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌ మరింత సూపర్‌గా జరగడం, వర్ధమాన ఆటగాళ్లెందరో సత్తా చాటడం, గతంలో ఏ కెప్టెన్‌కూ సాధ్యంకాని రీతిలో రోహిత్‌ శర్మ ఐదోసారి జట్టుకు ట్రోఫీ అందించడం.. ఇక, ఎవరూ ఊహించని రీతిలో ధోనీసేన ప్లేఆఫ్స్‌కు ముందే నిష్క్రమించడం, యువ కెరటం సూర్యకుమార్‌ యాదవ్‌ లీగ్‌లో అద్భుతఫామ్‌తో ఆకట్టుకున్నా జాతీయ జట్టుకు ఎంపికవకపోవడం.. ఇలా తీపి, చేదు కలయికగా మిశ్రమ అనుభూతులను పంచిన ఈమారు ఐపీఎల్‌లో కొన్ని విశేషాలపై ఓ లుక్కేద్దాం.


ముంబై ‘విన్‌’డియన్స్‌

ఇన్నాళ్లూ లీగ్‌లో సమర్ధవంతమైన జట్టుగా చెన్నై సూపర్‌కింగ్స్‌ పేరిటనున్న రికార్డును ఇప్పుడు రోహిత్‌ శర్మ బృందం బ్రేక్‌ చేసింది. ఐదో టైటిల్‌తో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్‌ తమకు తిరుగులేదని నిరూపించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు పూర్తి న్యాయం చేస్తూ.. ఈసారి లీగ్‌ ఆరంభం నుంచి చివరిదాకా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. లీగ్‌ దశలో 18 పాయింట్లతో టాపర్‌గా నిలిచి ప్లేఆఫ్స్‌ చేరిన తొలి జట్టుగా నిలిచిన రోహిత్‌ సేన.. క్వాలిఫయర్‌-1లో ఢిల్లీని చిత్తుచేసి నేరుగా ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. అదే జోష్‌తో తుదిపోరులోనూ ఢిల్లీపై విజృంభించి సిసలైన చాంపియన్‌ అనిపించుకుంది. 


రేసు రసవత్తరం.. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ రేసు చాలా రంజుగా సాగింది. మొత్తం ఎనిమిది జట్లలో ముంబై ఇండియన్స్‌ 18 పాయింట్లతో టాపర్‌గా ప్లేఆఫ్స్‌కు చేరినా.. మిగతా మూడు స్థానాల కోసం లీగ్‌ దశ చివరిమ్యాచ్‌ దాకా వేచిచూడాల్సి రావడం ఈమారు విశేషం. పాయింట్ల వేటలో వెనుకబడిన కింగ్స్‌ పంజాబ్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ముందే నిష్క్రమించగా.. 2,3,4 స్థానాల కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఓ దశలో ఢిల్లీ 16 పాయింట్లతో రెండో స్థానం ఖరారు చేసుకోగా.. ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై గెలవడంతో హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. దీంతో బెంగళూరు నాలుగోస్థానంతో టాప్‌ఫోర్‌లో నిలవగా, అప్పటిదాకా ప్లేఆఫ్స్‌పై ఆశలు పెట్టుకున్న కోల్‌కతా నిరాశగా లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

చెన్నై.. ‘సూపర్‌ఫ్లాప్‌’

ఈ లీగ్‌లో అత్యంత నిరాశపరిచిన జట్టు అంటే ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్‌ అని చెప్పాలి. భారీ అంచనాలతో అడుగుపెట్టిన ధోనీసేన.. ఊహకందని రీతిలో ఆరంభం నుంచే వరుస పరాజయాలతో సూపర్‌ఫ్లాప్‌ జట్టుగా అప్రతిష్ఠ మూటగట్టుకుంది. లీగ్‌ దశలో మొత్తం 14 మ్యాచ్‌లాడి కేవలం ఆరు మ్యాచ్‌లే గెలిచిన సీఎస్‌కే.. పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండోస్థానంలో నిలిచి పదకొండేళ్లలో తొలిసారిగా ప్లేఆఫ్స్‌ బెర్త్‌ అందుకోలేకపోయింది. ఇక, వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తుతూ, భారీ షాట్లు కొడుతూ గతంలో ఒంటిచేత్తో సీఎస్‌కేకు విజయాలందించిన కెప్టెన్‌ ధోనీ ఈమారు అత్యంత పేలవ ఆటతో అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. మరోవైపు.. ఈమారు తాము ప్లేఆఫ్స్‌కు చేరకపోయినా, వచ్చే ఏడాది కూడా ధోనీ తమతోనే ఉంటాడనీ, అతని ఆధ్వర్యంలోనే జట్టు ముందుకెళ్తుందని సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించడం విశేషం. కాగా.. సీఎస్‌కే విజయాల్లో ఎన్నోసార్లు కీలకపాత్ర పోషించిన ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ ఈ ఐపీఎల్‌ తనకు చివరిదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 


వెలుగులోకి యువ‘సత్తా’

ఈ ఐపీఎల్‌ ద్వారా యువసత్తా వెలుగులోకి రావడం అతిపెద్ద సానుకూలాంశం. అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లయిన ఇషాన్‌ కిషన్‌, దేవ్‌దత్‌ పడిక్కళ్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, నటరాజన్‌, హర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌లాంటి యువ క్రికెటర్లు తమ ప్రతిభ చాటుకున్నారు. వీరిలో నటరాజన్‌ త్వరలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనకు నెట్‌బౌలర్‌గా ఎంపికయ్యాడు. కాగా.. సూర్యకుమార్‌లాంటి ఆటగాడిని సెలెక్టర్లు అస్సలు పరిగణనలోకి తీసుకోకపోవడం చర్చకు తెరలేపింది. ఈసారి ముంబై ఫైనల్‌ చేరడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు సూర్య. ఈ సీజన్‌లో అతను మొత్తం 16 మ్యాచుల్లో కలిపి 480 పరుగులు సాధించాడు. నిరుడు సీజన్‌లో 424 పరుగులు చేసిన సూర్య.. 2018లో 512 పరుగులతో అదరగొట్టాడు. ఇలా ప్రతి ఏటా భీకరఫామ్‌తో ఆకట్టుకుంటున్నా, అతడిని సెలెక్టర్లు జాతీయ జట్టుకు ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. ఇదే విషయమై టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్ర్తిని ప్రశ్నిస్తే.. ‘అతను  మానసికంగా బలంగా ఉండాలి.. ఓపిక వహించాలి’ అని సమాధానమివ్వడం 

గమనార్హం. 

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Advertisement
Advertisement