train రద్దుతో విద్యార్థికి కారు రైడ్...భారతీయ రైల్వే bumper offer

ABN , First Publish Date - 2022-07-14T17:50:45+05:30 IST

గుజరాత్‌ రాష్ట్రంలో రైలు రద్దు చేసిన తర్వాత భారతీయ రైల్వే ఓ విద్యార్థికి కార్ రైడ్‌ను అందించిన ఘటన వడోదరలో తాజాగా వెలుగుచూసింది....

train రద్దుతో విద్యార్థికి కారు రైడ్...భారతీయ రైల్వే bumper offer

వడోదర(గుజరాత్): గుజరాత్‌ రాష్ట్రంలో రైలు రద్దు చేసిన తర్వాత భారతీయ రైల్వే ఓ విద్యార్థికి కార్ రైడ్‌ను అందించిన ఘటన వడోదరలో తాజాగా వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసును రద్దు చేసిన నేపథ్యంలో ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదరకు ఒక విద్యార్థి కోసం రైల్వేశాఖ అధికారులు కారులో ప్రయాణించడానికి ఏర్పాట్లు చేసి బంపర్ ఆఫర్ అందించారు.మద్రాస్‌ ఐఐటికి చెందిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థి సత్యం గధ్వి ఏక్తా నగర్ రైల్వే స్టేషన్ నుంచి వడోదర స్టేషన్‌కు రెండు గంటల ప్రయాణం చేయాల్సి ఉంది.దీని కోసం ఇతను ఏక్తా నగర్ నుంచి వడోదరకు ప్రయాణించడానికి రైలు టిక్కెట్‌ను బుక్ చేసుకున్నారు. వడోదర నుంచి సత్యం తన చివరి గమ్యస్థానం చెన్నైకి ప్రయాణం చేయాలి. అయితే భారీ వర్షాల కారణంగా ఏక్తా నగర్ నుంచి వడోదరను కలిపే రైల్వే ట్రాక్‌లలో కొన్ని భాగాలు కొట్టుకుపోయాయి. 






దీంతో ఈ మార్గంలో రైలు సర్వీసును చివరి క్షణంలో రద్దు చేశారు. దీంతో చెన్నై వెళ్లే రైలును పట్టుకోవడానికి రైల్వే అధికారులు విద్యార్థి సత్యంకు వడోదరకు తీసుకు రావడానికి ప్రత్యేకంగా కారును అద్దెకు తీసుకున్నారు. కారు డ్రైవరు సత్యం లగేజీ తీసుకొని అతన్ని వడోదరలో చెన్నై వెళ్లే రైలులో సకాలంలో ఎక్కించారు. భారతీయ రైల్వే అధికారులు అందించిన అనూహ్యమైన సేవలతో సత్యం అనే విద్యార్థికి చెన్నై రైలు ఎక్కగలిగారు. రైల్వేలోని ప్రతి ప్రయాణికుడికి అధికారులు ఇచ్చిన ప్రాధాన్యం చూసి సత్యం రైల్వేశాఖను ప్రశంసించారు. రైలు రద్దుతో కారు ఏర్పాటు చేసి తనను వడోదరకు తీసుకువచ్చిన రైల్వే అధికారులను సత్యం అభినందించారు.విద్యార్థి సత్యం మాట్లాడిన వీడియోను రైల్వే డీఆర్ఎం ట్విట్టరులో పంచుకున్నారు. 


Updated Date - 2022-07-14T17:50:45+05:30 IST