ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు ప్రైవేటు వైపు రైల్వేల చూపు

ABN , First Publish Date - 2020-09-23T23:38:41+05:30 IST

సమర్థత పెంపు, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన కోసం భారతీయ రైల్వేలు ప్రైవేటు మదుపరులవైపు చూస్తున్నాయి.

ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు ప్రైవేటు వైపు రైల్వేల చూపు

న్యూఢిల్లీ : సమర్థత పెంపు, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పన కోసం భారతీయ రైల్వేలు ప్రైవేటు మదుపరులవైపు చూస్తున్నాయి. ఎంపిక చేసిన మార్గాల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించాయి. 


ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సేవలందించేందుకు తగిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు భాగస్వాములను రైల్వే మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాల కల్పనకు పెట్టుబడులు పెట్టగలిగేవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. 


12 ‘రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’లను ఈ ఏడాది జూలై 1న జారీ చేసినట్లు తెలిపింది. 109 ప్రారంభ-గమ్యస్థానాల ప్యాసింజర్ రైళ్ళ నిర్వహణకు వీటిని జారీ చేసినట్లు పేర్కొంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ పద్ధతిలో భాగస్వాములు కావాలని ప్రైవేటు రంగాన్ని కోరినట్లు పేర్కొంది. 


రైళ్ళ కార్యకలాపాల నిర్వహణ, భద్రతాపరమైన ధ్రువపత్రాల జారీ వంటి బాధ్యతలన్నీ భారతీయ రైల్వేలకు మాత్రమే ఉంటాయి. 


రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో బుధవారం ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం క్రింద నడిపే రైళ్ళకు అవసరమైన డ్రైవర్లు, గార్డులు వంటి సిబ్బందిని భారతీయ రైల్వేలు సమకూర్చుతాయని చెప్పారు. 


భారతీయ రైల్వేల నెట్‌వర్క్ విస్తరణకు 2030 వరకు రూ.50 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా. నెట్‌వర్క్ విస్తరణ, సామర్థ్య వృద్ధి, రోలింగ్ స్టాక్ ఇండక్షన్, ఇతర ఆధునికీకరణ పనుల కోసం ఈ పెట్టుబడులు అవసరమని అంచనా.


Updated Date - 2020-09-23T23:38:41+05:30 IST