డల్లాస్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

ABN , First Publish Date - 2020-02-02T00:56:05+05:30 IST

అమెరికాలోని అతిపెద్ద గాంధీ మెమోరియల్.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారత 71

డల్లాస్‌లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

అమెరికాలోని అతిపెద్ద గాంధీ మెమోరియల్.. మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్(ఎంజీఎంఎన్‌టీ) ఆధ్వర్యంలో డల్లాస్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ వద్ద భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి 400 మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరయ్యారు. ఎంజీఎంఎన్‌టీ చైర్మన్ డా. ప్రసాద్ తోటకూర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. భారత జాతీయ గీతంతో పాటు యూఎస్ జాతీయ గీతాన్ని కూడా ఈ సంర్భంగా ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను వివరించారు. 70 ఏళ్ల క్రితం 1950, జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నట్లు ప్రసాద్ తెలియజేశారు. స్వాతంత్ర్యం అనంతరం భారతదేశం నిర్మాణంలో రాజ్యాంగానిది ప్రధాన పాత్ర అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 


మతం, ప్రాంతం, సమాజంతో సంబంధం లేకుండా దేశ పౌరులందరికీ సమానత్వం కల్పించిన రాజ్యాంగం రచనలో డా. బిఆర్. అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రు, డా. బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తదితర జాతీయ నాయకులు సుమారు మూడేళ్లు కష్ట పడ్డారని తెలిపారు. దేశ జనాభాలో సుమారు 60 కోట్ల మంది పాతికేళ్లలోపు వయసు  కలిగిన దేశం ఇండియా అని.. దేశ భవిష్యత్తు ఈ యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ప్రపంచంలోని మిగతా ఏ దేశాల్లో ఇంతమంది యువత లేరని తెలిపారు. 


ఎంజీఎంఎన్‌టీ సెక్రెటరీ రావు కల్వాల ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రవాస భారతీయులను ఆహ్వానించడంతో పాటు ఎంజీఎంఎన్‌టీ బోర్డు సభ్యులను వారికి పరిచయం చేశారు. భారత గణతంత్ర దినోత్సవం కోసం మెమోరియల్ వద్దకు ఇంతమంది ఒకచోట సమావేశం కావడం తనకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎంజీఎంఎన్‌టీ బోర్డు డైరెక్టర్ అభిజిత్ రాయిల్కర్ మాట్లాడుతూ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతియుత మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మ గాంధీ త్యాగాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 


ఆ తర్వాత మరో ఎంజీఎంఎన్‌టీ బోర్డు డైరెక్టర్ శైలేష్ షా ప్రసంగించారు. ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రధాన పాత్రం పోషించిన వాలంటీర్లు, కమ్యూనిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా మరోసారి అందరూ ఇక్కడికి వచ్చి జాతిపితకు నివాళి అర్పించాలని ఆయన ప్రవాసీయులను కోరారు. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ఎంజీఎంఎన్‌టీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసింది.


Updated Date - 2020-02-02T00:56:05+05:30 IST