ఇటలీకి ఇంకా ప్రారంభంకాని విమాన సర్వీసలు.. ఆందోళనలో విద్యార్థులు

ABN , First Publish Date - 2021-07-19T01:44:55+05:30 IST

కొవిడ్ నేపథ్యంలో విమాన సర్వీసులపై అమలవుతున్న ఆంక్షలతో విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటలీలో చదువుతున్న విద్యార్థులు త

ఇటలీకి ఇంకా ప్రారంభంకాని విమాన సర్వీసలు.. ఆందోళనలో విద్యార్థులు

న్యూఢిల్లీ: కొవిడ్ నేపథ్యంలో విమాన సర్వీసులపై అమలవుతున్న ఆంక్షలతో విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇటలీలో చదువుతున్న విద్యార్థులు తమ భవిష్యత్తుపట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రెండో వేవ్ రూపంలో భారత్‌పై కొవిడ్ పంజా విసరడంతో చాలా దేశాలు ఇండియాకు విమాన సర్వీసులను నిలిపివేశాయి. అంతేకాకుండా భారత విమానాలు తమ దేశాల్లోకి రాకుండా ఆంక్షలు విధించాయి. ఇలా ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో ఇటలీ కూడా ఉంది. ఏప్రిల్ 28న ఇటలీ భారత విమానాలపై ఆంక్షలు విధించింది. అయితే కొవిడ్ ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టడంతో చాలా దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించాయి. 



కానీ ఇటలీ మాత్రం ఈ విషయంపై అడుగు ముందుకు వేయలేదు. దీంతో ఇరు దేశాల మధ్య ఇప్పటికీ విమాన సర్వీసులు అందుబాటులోకి రాలేదు. ఈ క్రమంలో.. ఇటలీలోని విద్యా సంస్థల్లో చదువుతూ కొవిడ్ విజృంభణ సమయంలో స్వదేశానికి వచ్చిన భారతీయ విద్యార్థులు ఇక్కడే చిక్కుకున్నారు. ఇటలీలో పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో అక్కడి యూనివర్సిటీల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో స్వదేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు తమ భవిష్యత్తును తలచుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరగతులు ఆన్‌లైన్‌లో వింటున్నప్పటికీ.. ప్రాక్టికల్స్‌లో పాల్గొనలేకపోతున్నామని వాపోతున్నారు. తమ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-07-19T01:44:55+05:30 IST