Abn logo
Jul 15 2021 @ 15:18PM

భారత యువత అమెరికాను కాదని.. కెనడాకు తరలిపోవడానికి కారణం అదేనట!

వాషింగ్టన్: కాలం చెల్లిన వీసా విధానాల కారణంగానే భారీ సంఖ్యలో ప్రతిభావంతులైన భారతీయ యువత అగ్రరాజ్యం అమెరికాను కాదని.. కెనడావైపు తరలిపోతున్నారని ఇమ్మిగ్రేషన్ అండ్ పాలసీ నిపుణులు ఆ దేశ చట్టసభ్యులకు తెలిపారు. హెచ్-​1బీ వీసా విధానంపై యూఎస్ అనుసరిస్తున్న తీరు, శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్​ కార్డుల జారీలో దేశాల వారీ కోటా(కంట్రీ క్యాప్) కూడా భారతీయ యువత కెనడావైపు తరలిపోవడానికి కారణమవుతోందని నిపుణులు మంగళవారం ఆందోళన వ్యక్తం చేశారు. కనుక కాలం చెల్లిన అమెరికా వీసా విధానాలను సవరించాల్సిన సమయం ఆసన్నమైందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇండియన్ టాలెంట్ కెనడాకు తరలిపోకుండా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ను కోరారు. 

నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టువర్ట్ అండర్సన్ మాట్లాడుతూ.. మూడు ఉద్యోగ ఆధారిత విభాగాల బ్యాక్‌లాగుల్లో భారత ప్రవాసుల వాటా ప్రస్తుతం 9,15,497గా ఉందన్నారు. ఈ సంఖ్య 2030 నాటికి 21,95,795కు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అలాగే సుమారు 20 లక్షల మంది దశాబ్దం పాటు ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డు కోసం వేచిచూడాల్సి వస్తుందని వలసలు, పౌరసత్వానికి సంబంధించి హౌస్ జ్యుడిషియరీ కమిటీ ముందు అండర్సన్ తన వాదనలు వినిపించారు. ప్రస్తుతం అగ్రరాజ్యం అనుసరిస్తున్న కాలం చెల్లిన వీసా విధానాల వల్ల విదేశీయులు అమెరికాకు రావడానికి జంకుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో కెనడా.. విదేశీ విద్యార్థులు, నిపుణులకు వీసా విధానం సులభతరం చేయడం కూడా ఆ దేశానికి భారతీయ యువత తరలిపోవడానికి కారణమవుతోందని అండర్సన్ పేర్కొన్నారు.   

తాజా వార్తలుమరిన్ని...