పాకిస్తానీ మ‌హిళను ఆదుకున్న భారతీయ వాలంటీర్లు.. యూఏఈలో..

ABN , First Publish Date - 2020-05-30T15:30:22+05:30 IST

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డం.. ట్ర‌క్కు డ్రైవ‌రైనా భ‌ర్త దేశ స‌రిహ‌ద్దును మూసివేయ‌డంతో ఒమ‌న్‌లో చిక్కుకుపోయాడు. దీంతో యూఏఈలో ఒంట‌రిగా ఉన్న పాకిస్తానీ మ‌హిళ రెండు నెల‌లుగా దిక్కుదోచ‌ని ప‌రిస్థితిలో పడిపోయింది.

పాకిస్తానీ మ‌హిళను ఆదుకున్న భారతీయ వాలంటీర్లు.. యూఏఈలో..

యూఏఈ: క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధించ‌డం.. ట్ర‌క్కు డ్రైవ‌రైనా భ‌ర్త దేశ స‌రిహ‌ద్దును మూసివేయ‌డంతో ఒమ‌న్‌లో చిక్కుకుపోయాడు. దీంతో యూఏఈలో ఒంట‌రిగా ఉన్న పాకిస్తానీ మ‌హిళ రెండు నెల‌లుగా దిక్కుదోచ‌ని ప‌రిస్థితిలో పడిపోయింది. స‌మ‌యానికి భ‌ర్త కూడా లేక‌పోవ‌డంతో ఆమెకు గర్భస్రావం కూడా అయింది. ఆమె గురించి తెలుసుకున్న భార‌తీయ వాలంటీర్లు వెంట‌నే నిత్యావ‌స‌రాలు, కొంత ఆర్థిక స‌హాయం చేసి ఆదుకున్నారు. పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన తెహ్మీనా అనే వివాహిత ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ఆమె ప‌రిస్థితి గురించి తెలుసుకున్న‌ కేర‌ళ ముస్లిం క‌ల్చ‌ర్ సెంట‌ర్‌(కేఎంసీసీ) వాలంటీర్లు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. 


"క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న నాకు వారు ఎంతో సహాయపడ్డారు. నా జీవితాంతం నేను దానిని మరచిపోలేను" అని తెహ్మీనా అన్నారు. తెహ్మీనా భ‌ర్త ఖావర్ అష్రఫ్ ట్ర‌క్కు డ్రైవ‌ర్ కావ‌డంతో దూర ప్రాంతాల‌కు వెళ్తుంటాడు. ఈ క్రమంలో క‌రోనా లాక్‌డౌన్‌కు ముందు అత‌ను ఒమ‌న్ వెళ్లాడు. ఆ స‌మ‌యంలో క‌రోనా విస్త‌ర‌ణ మొద‌లు కావ‌డంతో ఒమ‌న్ త‌న స‌రిహ‌ద్దును మూసివేసింది. దాంతో అష్ర‌ఫ్ అక్క‌డే చిక్కుకుపోయాడు. గ‌ర్భ‌వ‌తైన తెహ్మీనా ఇంట్లో ఒంట‌రిగానే ఉంటోంది. చూస్తుండ‌గానే రెండు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ క్ర‌మంలో ఆరోగ్య‌స‌మ‌స్య‌లు తలెత్త‌డంతో ఆమెకు గర్భస్రావం కూడా అయిపోయింది. నా అనే వాళ్లు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ఆమె విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంది. ఈ విష‌యం కాస్తా కేఎంసీసీ వారికి తెలియ‌డంతో వెంట‌నే స్పందించి తెహ్మీనాకు అండ‌గా నిలిచారు. వాలంటీర్లు వెంట‌నే ఆమెకు నిత్యావ‌స‌రాలు, కొంత ఆర్థిక స‌హాయం చేసి ఆదుకున్నారు. ప్ర‌స్తుతం అష్ర‌ఫ్ ఇంటికి చేరుకున్నాడు. కాగా, క్లిష్ట‌ప‌రిస్థితుల్లో ఉన్న స‌మ‌యంలో వాలంటీర్లు నాకు ఎంతో సహాయపడ్డారు. నా జీవితాంతం నేను దానిని మరచిపోలేను అని తెహ్మీనా ఉద్వేగానికి లోన‌య్యారు. 

Updated Date - 2020-05-30T15:30:22+05:30 IST