అంతరిక్ష ప్రయోగాల్లో భారత మహిళ

ABN , First Publish Date - 2021-06-09T05:30:00+05:30 IST

నాసా చేపట్టిన అర్టెమిస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపే బృహత్తర ప్రయత్నంలో కీలక భూమిక పోషిస్తోంది భారతీయ మహిళ సుభాషిణీ అయ్యర్‌.

అంతరిక్ష ప్రయోగాల్లో భారత మహిళ

నాసా చేపట్టిన అర్టెమిస్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపే బృహత్తర ప్రయత్నంలో కీలక భూమిక పోషిస్తోంది భారతీయ మహిళ సుభాషిణీ అయ్యర్‌. రాకెట్‌ కోర్‌ స్టేజ్‌ను పర్యవేక్షిస్తున్న సుభాషిణి, మున్ముందు చంద్రుడికీ, భూమికీ మధ్య మనుషుల రాకపోకలకు, చంద్రుడి మీద మానవ మనుగడకూ ఈ ప్రాజెక్ట్‌ తోడ్పడుతుందని అంటున్నారు. 


‘‘మానవుడు చంద్రుడి మీద కాలు మోపి 50 ఏళ్లు దాటింది. అప్పటితో పోల్చుకుంటే అంతరిక్ష విజ్ఞానంలో, ప్రయోగాల్లో ఎంతో సాంకేతిక ప్రగతిని సాధించాం. చంద్రుడి మీదకు మనుషులను చేరవేయడంతో పాటు, అక్కడి పరిస్థితులను బట్టి, మున్ముందు అంగారక గ్రహం మీదకు మనుషులను చేరవేసే విషయం మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవడమే ఈ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశం’’ అంటారు సుభాషిణీ అయ్యర్‌. తమిళనాడులోని కోయంబత్తూరులో పుట్టిన సుభాషిణి 1992లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. అప్పట్లో ఆ కాలేజీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన మొట్టమొదటి మహిళ సుభాషిణి కావడం ఓ విశేషం. 




కీలక బాధ్యతలు

నాసా... ‘అర్టెమిస్‌’ ప్రాజెక్ట్‌లో భాగంగా 2024లో వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపనుంది. ఈ ప్రాజెక్ట్‌లో పాలు పంచుకుంటున్న ప్రముఖుల్లో సుభాషిణి ఒకరు. అంతరిక్షంలోకి పయనించే రాకెట్‌ కోర్‌ స్టేజ్‌ పర్యవేక్షణ కోసం స్పేస్‌ లాంచ్‌ సిస్టం (ఎస్‌ఎల్‌ఎస్‌)తో గత రెండేళ్లుగా కలిసి పనిచేస్తున్నారీమె. చంద్రుడి మీద కీలకమైన ప్రయోగాల కోసం నాసాకు చెందిన అర్టెమిస్‌ ల్యూనార్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ ప్రోగ్రాం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం జరిగింది. నాసాకు చెందిన కొత్త రాకెట్‌, ఎస్‌ఎల్‌ఎస్‌, ఆరియన్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ ద్వారా చంద్రుడి మీదకు వ్యోమగాములను చేరవేస్తుంది. అయితే అర్టెమిస్‌ మిషన్‌ను నాసా మూడు దశలుగా విభజించుకుంది. మొదటి దశ అర్టెమిస్‌1లో సిబ్బంది లేకుండా, అర్టెమిస్‌2లో చంద్రుడిని చుట్టి వచ్చేలా డిజైన్‌ చేసుకుంది. 2024లో చేపట్టబోయే చివరి దశ అర్టెమిస్‌3లో మాత్రమే వ్యోమగాములు చంద్రమండలం మీదకు చేరుకుంటారు. ఆ తర్వాతి ఏడాది నుంచి వ్యోమగాములను క్రమం తప్పకుండా చంద్రమండలానికి పంపుతుంది నాసా. 

Updated Date - 2021-06-09T05:30:00+05:30 IST