జాతీయ గీతాలపానలో బద్దలైన రికార్డు

ABN , First Publish Date - 2021-08-15T17:27:07+05:30 IST

జాతీయ గీతాలాపనలో భారతీయులు సరికొత్త రికార్డు

జాతీయ గీతాలపానలో బద్దలైన రికార్డు

న్యూఢిల్లీ : జాతీయ గీతాలాపనలో భారతీయులు సరికొత్త రికార్డు సృష్టించారు. దేశ, విదేశాల్లోని 1.5 కోట్ల మందికి పైగా ‘జనగణమన’ పాడి, ఆ వీడియోలను అప్‌లోడ్ చేసినట్లు కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భారతీయులంతా ఆనందోత్సాహాలతో పాల్గొన్నట్లు తెలిపింది. భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఈ ఘనతను భారతీయులు దక్కించుకున్నట్లు వివరించింది. భారత దేశంలో ఉన్న సహజసిద్ధమైన సమైక్యత, బలం, సామరస్యాలకు ఇదే నిదర్శనమని తెలిపింది. 


జాతీయ గీతాన్ని కలిసికట్టుగా పాడాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూలై 25న పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ పిలుపు భారత దేశ ప్రజల మనసులు, హృదయాల్లో ఓ మంత్రంలా వ్యాపించిందని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రముఖ కళాకారులు, సుప్రసిద్ధ పండితులు, అగ్ర నేతలు, ఉన్నతాధికారులు, పరాక్రమవంతులైన సైనికులు, ప్రముఖ క్రీడాకారులు, రైతులు, కార్మికులు, కూలీలు, సాధారణ ప్రజలు, దివ్యాంగులు ‘జనగణమన’ను ఆలపించి రికార్డు సృష్టించారని తెలిపింది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుంచి కచ్ వరకు ‘జనగణమన’ అన్ని దిక్కుల నుంచి ప్రతిధ్వనించిందని పేర్కొంది. భారత దేశానికి వెలుపల నివసిస్తున్న భారతీయులు కూడా ఎంతో ఆర్తితో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. 


జాతీయ గీతం మనకు గర్వకారణమని తెలిపింది. ఈ కార్యక్రమం అందరిలోనూ ఉత్తేజాన్ని నింపడం మాత్రమే కాకుండా, భారత దేశ బలమైన సమైక్యతా సందేశం ప్రపంచానికి అందిందని పేర్కొంది.


2017 జనవరి 21న గుజరాత్‌లోని కగ్వాద్‌లో 5,09,261 మంది జాతీయ గీతాన్ని ఆలపించి, రికార్డు సృష్టించారు. శ్రీ కోదల్ ధామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 


Updated Date - 2021-08-15T17:27:07+05:30 IST