దోవల్ చొరవతో కాబూల్‌లోని భారతీయులకు ఊరట

ABN , First Publish Date - 2021-08-17T20:18:13+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై భారత దేశ భద్రతా

దోవల్ చొరవతో కాబూల్‌లోని భారతీయులకు ఊరట

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయులను సురక్షితంగా తీసుకురావడంపై భారత దేశ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, అమెరికా ఎన్ఎస్ఏ జేక్ సులివన్ సోమవారం రాత్రి చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, వీరిద్దరి చర్చల అనంతరం భారతీయులను కాబూల్ విమానాశ్రయంలోని అమెరికన్ సెక్యూరిటీ జోన్‌లోకి తీసుకున్నారు, అనంతరం వారంతా మంగళవారం ఉదయం బయల్దేరారు. క్షేత్ర స్థాయిలోని అమెరికన్ అధికారులతో సమన్వయం కుదుర్చుకుని, కాబూల్ విమానాశ్రయంలో భారత దేశ సీ-17 విమానాలు దిగడానికి అనుమతి పొందగలిగారు. కాబూల్‌లోని క్షేత్ర స్థాయి పరిస్థితుల వల్ల అక్కడి నుంచి భారతీయ అధికారులు బయల్దేరడానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, అయితే మొత్తం మీద అందుకు తగిన ఏర్పాట్లు చేయగలిగారు. 


సోమ, మంగళవారాల్లో రెండు సీ-17 విమానాలు కాబూల్ నుంచి బయల్దేరాయి. దాదాపు 46 మందితో ఓ విమానం సోమవారమే భారత దేశానికి చేరుకుంది. 120 మందితో మరొక విమానం మంగళవారం ఉదయం బయల్దేరింది. 


ఆఫ్ఘనిస్థాన్ అభివృద్ధి కోసం భారత్, అమెరికా కలిసి కృషి చేసిన సంగతి తెలిసిందే. తాలిబన్లు ఆదివారం కాబూల్‌లో ప్రవేశించి, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌ను స్వాధీనం చేసుకున్నారు. తాము కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ప్రకటించిన వెంటనే అనేక దేశాలు తమ దౌత్య సిబ్బందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెనుకకు తీసుకెళ్తున్నాయి. వందలాది మంది సాధారణ ప్రజలు కూడా ఆఫ్ఘనిస్థాన్ నుంచి వెళ్ళిపోవడం కోసం కాబూల్ విమానాశ్రయానికి ఆత్రుతగా వస్తున్నారు. 


Updated Date - 2021-08-17T20:18:13+05:30 IST