కజకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. సాయం చేయాలని విదేశాంగ శాఖకు ఢిల్లీ కోర్టు సూచన

ABN , First Publish Date - 2020-03-26T18:17:34+05:30 IST

కరోనా వైరస్(కొవిడ్-19) నేపథ్యంలో కజకిస్థాన్‌లోని అల్మట్టి విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల బాగోగులు చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.

కజకిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు.. సాయం చేయాలని విదేశాంగ శాఖకు ఢిల్లీ కోర్టు సూచన

న్యూఢిల్లీ: కరోనా వైరస్(కొవిడ్-19) నేపథ్యంలో కజకిస్థాన్‌లోని అల్మట్టి విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల బాగోగులు చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. "కజకిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయం నుండి వెంటనే నోడల్ అధికారిని నియమించండి", అలాగే "వైద్య సంరక్షణ, వసతి(ఆహారం) పరంగా విద్యార్థులకు అన్ని ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, తల్వంత్ సింగ్ ల ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ప్రత్యేక విచారణలో ధర్మాసనం “రాయబార కార్యాలయంచే నియమించబడిన నోడల్ ఆఫీసర్ వివరాలు... అతని పేరు, మొబైల్ నంబర్‌ లను అల్మట్టి విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు తెలియజేయాలని సూచించింది.


షెహ్లా సైరా చేసిన విజ్ఞప్తిపై కోర్టు ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. “కజకిస్థాన్‌లోని సెమీ మెడికల్ యూనివర్శిటీలో రెగ్యులర్ విద్యార్థులుగా ఏంబీబీఎస్‌తో సహా ఉన్నత చదువుల కోసం చేరిన భారతీయ పౌరులు అధిక సంఖ్యలో ఉన్నారు. గత రెండు మూడు రోజులుగా వారు తినడానికి తిండి, తాగటానికి నీరు, రవాణా, వైద్య సహాయం లేకుండా కజకిస్థాన్‌లోని అల్మట్టి విమానాశ్రయంలో బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని ” షెహ్లా సైరా కోర్టుకు చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ జాస్మీత్ సింగ్... విదేశాంగ మంత్రిత్వ శాఖ తరపున నోటీసును స్వీకరించిన తరువాత తమకు దీనిపై సమాధానం ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. దీంతో ధర్మాసనం మార్చి 27 వరకు సమయం ఇచ్చింది.

Updated Date - 2020-03-26T18:17:34+05:30 IST