విదేశాల నుంచి వచ్చి.. దర్జాగా బయటే..

ABN , First Publish Date - 2020-04-04T14:13:59+05:30 IST

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ గురించి ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో పూర్తి అవగాహన రావడంలేదు.

విదేశాల నుంచి వచ్చి.. దర్జాగా బయటే..

ఇంకా వెలుగులోకి రాని వేల మంది ప్రయాణికులు

హోం క్వారంటైన్‌లోనూ బరితెగిస్తున్న ముదురుగాళ్లు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ గురించి ప్రభుత్వాలు ఎంతగా ప్రచారం చేస్తున్నా.. ప్రజల్లో పూర్తి అవగాహన రావడంలేదు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. ఇక్కడికి రాగానే క్వారంటైన్‌లోకి వెళ్లాలనే కనీస జాగ్రత్తలు పాటించడంలేదు. దీంతో ఈ పరిణామాలు ప్రమాదకర  పరిస్థితులకు దారి తీస్తున్నాయి. తమకు తాము ప్రమాదంలోకి జారిపోవడమే కాకుండా.. తోటి వారిని, ఇరుగు పొరుగు వారిని సైతం ముప్పులోకి తీసుకెళ్తున్నారు. 10 రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ఆరుగురిని శుక్రవారం అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. ఇంకా ఎన్నో కుటుంబాలు విదేశీ ప్రయాణికులను దాచి పెడుతుండగా.. ప్రయాణికులు కూడా ముందుకురావడానికి ఇష్టపడటం లేదు.


స్థానికులు గుర్తించినా నేరుగా పోలీసులకు లేదా ఆరోగ్య శాఖాధికారులకు సమాచారం ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినా.. వారు పట్టించుకోవ డం లేదు. బస్తీల్లో ఎవరెవరు విదేశాల నుంచి వచ్చారు, ఎవరెవరి ఆరోగ్య పరిస్థితులెలా ఉన్నాయనే సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన నేతలు బాధ్యత మరిచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది ముదుర్లు.. విదేశాల నుంచి రాగానే ఇళ్లు వదిలి మరో బస్తీలో తాత్కాలిక నివాసముంటున్నట్లు తెలుస్తోంది. అవగాహన ఉన్నవారు, కుటుంబ సభ్యుల గురించి, ఇరుగు పొరుగువారి క్షేమం గురించి ఆలోచించేవారు.. భయపడాల్సిన అవసరమే లేదనే విషయాన్ని గుర్తించి నేరుగా ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ఒకవేళ ఆలస్యంగా వైరస్‌ వెలుగు చూస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని అందరూ గుర్తించి ముందుకు రావాలని వైద్యాధికారులు కోరుతున్నారు.


దర్జాగా బయటే..

మరోవైపు హోం క్వారంటైన్‌లో ఉన్నవారు కొంతమంది రోడ్లపై తిరుగుతున్నారనే ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఉదాహరణకు సురేష్‌ (పేరు మార్చాం) అనే యువకుడు ఇటీవల స్విట్జర్లాండ్‌ నుంచి వచ్చాడు. శంషాబాద్‌లో కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షలు జరిపిన వైద్యు లు అతణ్ని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దాంతో అతడు మియాపూర్‌ పరిధిలోని వారి అపార్టుమెంట్‌లో ఉంటున్నాడు. కానీ, అతడు రోజూ బయటకు వస్తూ.. పోలీసులు, స్థానికుల కంటపడకుండా అపార్టుమెంట్‌ ఆవరణలో తిరుగుతున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఆ యువకునికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అయినా మరోసారి నిబంధనలు ఉల్లంఘించడంతో ఆరోగ్యశాఖ అధికారులు అంబులెన్స్‌లో అతణ్ని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.


ఇటీవల అమెరికా వచ్చిన వ్యక్తి నార్సింగి పరిఽధిలోని ఓ టౌన్‌షి్‌ప లో ఉంటున్నాడు. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అతను మాటి మాటికీ బయటకు వస్తున్నాడు. స్థానికులు  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి ఆ వ్యక్తికి  కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇలా హోం క్వారంటైన్‌ ఉల్లంఘించమే కాదు.. ఢిల్లీ మర్కాజ్‌ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి వచ్చిన వారిపైనా స్థానికులు నజర్‌ పెంచారు. వెంటనే పోలీసులకు, కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తున్నారు.

Updated Date - 2020-04-04T14:13:59+05:30 IST