ప్రమాదపుటంచున రొహింగ్యాల పడవ... ఆపై...

ABN , First Publish Date - 2021-12-29T22:31:21+05:30 IST

మలేసియా వెళ్తున్న రొహింగ్యా ముస్లింల పడవ మరమ్మతుకు

ప్రమాదపుటంచున రొహింగ్యాల పడవ...  ఆపై...

న్యూఢిల్లీ : మలేసియా వెళ్తున్న రొహింగ్యా ముస్లింల పడవ మరమ్మతుకు గురై, నిస్సహాయంగా సముద్రంపై తేలియాడుతున్నప్పటికీ ఇండోనేషియా అధికారులు కనికరించలేదు. 120 మంది ప్రయాణికులున్న ఈ పడవను తమ జలాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఐక్య రాజ్య సమితి శరణార్థి సంస్థ యూఎన్‌హెచ్‌సీఆర్ చేసిన విజ్ఞప్తిని కూడా బేఖాతరు చేశారు. 


ఈ పడవలో లీకేజీ ఉందని, ఓ ఇంజిన్ పాడైందని, ఇండోనేషియాలోని ఆసెహ్ ప్రావిన్స్ సమీపంలో, సముద్రంలో ప్రతికూల వాతావరణంలో నిస్సహాయంగా తేలియాడుతోందని యూఎన్‌హెచ్‌సీఆర్ మంగళవారం తెలిపింది. ఈ పడవలో ప్రయాణిస్తున్న 120 మంది భద్రతపట్ల ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే వీరిని తమ దేశంలోకి అనుమతించాలని ఇండోనేషియా ప్రభుత్వాన్ని కోరింది. 


ఇదిలావుండగా, ఇండోనేషియాలోని ఆసెహ్ ప్రావిన్స్, బిరెయూన్ జిల్లా మత్స్యకార సంఘం నేత బద్రుద్దీన్ యూనస్ మాట్లాడుతూ, స్థానికులు ఈ పడవను ఆదివారం గుర్తించారని చెప్పారు. ఆ పడవను ఒడ్డుకు చేర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలిపారు. అయితే ప్రయాణికులకు అవసరమైన ఆహారం, తాగునీరు, బట్టలను అందజేసినట్లు చెప్పారు. ఈ పడవలో 60 మంది మహిళలు, 51 మంది బాలలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని తెలిపారు. వీరు నీరసంగా కనిపిస్తున్నారని వివరించారు. 


జిల్లా అధికారి ముజకర్ గని మీడియాతో మాట్లాడుతూ, స్థానిక అధికారులు, పోలీసులు, నావికా దళం సంయుక్తంగా ఈ పడవను మరమ్మతు చేస్తాయన్నారు. ప్రయాణికులకు అవసరమైన ఆహారం, మందులు, కొత్త ఇంజిను అందజేసినట్లు తెలిపారు. దీనిని మరమ్మతు చేసేందుకు ఓ టెక్నీషియన్‌ను కూడా అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ పడవ మరమ్మతు పూర్తయితే, వెంటనే అంతర్జాతీయ జలాల్లోకి పంపుతామన్నారు. ప్రయాణికుల్లో కొందరికి కోవిడ్-19 సోకినట్లు అనుమానం ఉందని తెలిపారు. 


అసెహ్ పోలీసు శాఖ అధికార ప్రతినిధి వినర్డీ మాట్లాడుతూ, ఈ పడవను ఇండోనేషియా జలాలకు ఆవలివైపునకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పడవ మరమ్మతు పూర్తయిన తర్వాత ఫ్యూయల్ అందజేసి, మలేసియా వెళ్లిపోవడానికి సహాయపడతామని తెలిపారు. 


2017 ఆగస్టులో సుమారు 7 లక్షల మంది మయన్మార్ రొహింగ్యా ముస్లింలు దేశం విడిచి వెళ్లిపోయారు. తమ దేశంలో రెబెల్ గ్రూపులు, సైన్యం మధ్య ఘర్షణల నేపథ్యంలో వీరు దేశాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అప్పట్లో వీరు బంగ్లాదేశ్‌ చేరుకున్నారు. బంగ్లాదేశ్‌లో శిబిరాల్లో జీవనం కష్టతరం కావడంతో చాలా మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఇండోనేషియా సమీపంలో ఉన్న ఈ పడవలో ప్రయాణిస్తున్నవారు మలేసియా వెళ్ళేందుకు బయల్దేరారు. అక్కడ తమ జీవితాలు బాగుంటాయని వీరు ఆశిస్తున్నప్పటికీ, మలేసియా ప్రభుత్వం కూడా వీరిని నిర్బంధ శిబిరాల్లోనే ఉంచే అవకాశం కనిపిస్తోందని మానవ హక్కుల కార్యకర్తలు చెప్తున్నారు. 


 

Updated Date - 2021-12-29T22:31:21+05:30 IST