ప్రజాక్షేమం కోసం ఇంద్రకీలాద్రిపై హోమాలు

ABN , First Publish Date - 2021-05-10T16:14:26+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ప్రజలు పిట్టల్లా..

ప్రజాక్షేమం కోసం ఇంద్రకీలాద్రిపై హోమాలు

ప్రతిరోజూ ధన్వంతరి, గణపతి, మృత్యుంజయ హోమాలు 

15న పూర్ణాహుతితో యాగం పరిసమాప్తం 


ఆంధ్రజ్యోతి-విజయవాడ: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న తరుణంలో కరోనా పీడతొలగి అందరూ ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో లోకకళ్యాణార్థం ఆదివారంనుంచి ఇంద్రకీలాద్రిపై వేదపండితులు, అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. దేవస్థానంలోని చండీయాగశాలలో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 11 గంటలవరకు ధన్వంతరి మహాహోమం, లక్ష్మీగణపతి, మృత్యుంజయ హోమం, శీతలదుర్గ మహామంత్ర హోమాలను నిర్వహించనున్నట్టు ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్‌శర్మ తెలిపారు. ఈనెల 15న మహా పూర్ణాహుతితో హోమాలు సమాప్తమవుతాయని చెప్పారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. భక్తులకు కొంగుబంగారమైన కనకదుర్గమ్మ సన్నిధిలోనూ కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిసోన్న సంగతి తెలిసిందే. గతనెల 24న దేవస్థానంలో అర్చకుడు రాచకొండ శివప్రసాద్‌ కరోనాకు బలైపోగా.. తర్వాత రెండురోజులకే మహళ (అటెండర్‌) కరోనా కారణంగా మరణించారు.


తాజాగా ఈనెల 5వ తేదీన అమ్మవారి ఆలయంలో తాత్కాలిక ఉద్యోగి (ఎన్‌ఎంఆర్‌) ఆకుల హరి (35) కరోనాకు బలైపోయారు. అదేరోజు ఆంజనేయస్వామి ఆలయంలో పనిచేస్తున్న మరో అర్చకుడు రాఘవయ్య (55) కరోనా వల్ల చనిపోయారని ఆలయవర్గాలు తెలిపాయి. గత మార్చి నుంచి ఇప్పటికి నలుగురు ఆలయ ఉద్యోగులు మృత్యువాత పడగా.. గతేడాది కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు దుర్గగుడిలో పనిచేసే మరోఅర్చకుడు, ఆలయంలో కౌంటర్లు నిర్వహించే ప్రైవేటు కాంట్రాక్టరు కరోనా కారణంగా చనిపోయారు. మొత్తంగా ఇప్పటివరకు అమ్మవారి సన్నిధిలో ఆరుగురు కరోనా మహమ్మారికి బలయ్యారు. ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో ఇప్పటికే దాదాపు 100 మందివరకు దుర్గగుడి ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు కరోనా బారినపడి మృత్యువుతో పోరాడుతున్నారు. కరోనాతో ఆలయసిబ్బంది పిట్టల్లా రాలిపోతుండటంతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఇంద్రకీలాద్రిపై కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.


ప్రభుత్వం ప్రతిరోజూ 12 గంటల నుంచి కర్ఫ్యూను అమలుచేస్తున్న నేపథ్యంలో ఉదయం 6.30 నుంచి 11 గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా భయంతో ఆలయ ఉద్యోగులు, సిబ్బంది దాదాపు మూడొంతుల వరకు సెలవులు పెట్టేశారు. అనారోగ్యకారణాలతో మరికొందరు విధులకు హాజరు కావడం లేదు. కారణాలతో దాదాపు పదిహేను రోజులుగా ఇంద్రకీలాద్రి నిర్మానుష్యంగా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆలయసిబ్బందిని, అమ్మవారి భక్తులను సంరక్షించాలని ఆకాంక్షిస్తూ దుర్గగుడి వైదిక కమిటీ సూచనల మేరకు ఆదివారం నుంచి వారం రోజులపాటు ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-05-10T16:14:26+05:30 IST