సీఎం వైఎస్ జగన్ రాకకు 15 నిమిషాల ముందు...

ABN , First Publish Date - 2020-10-22T08:59:37+05:30 IST

మరో పావు గంటలో సీఎం వస్తారనగా సరిగ్గా 2.45 గంటలకు..

సీఎం వైఎస్ జగన్ రాకకు 15 నిమిషాల ముందు...

కొండపై కలకలం

ఇంద్రకీలాద్రిపై పడిన కొండచరియలు

పరుగులు తీసిన భక్తులు.. తొక్కిసలాట

ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

బాధితుల్లో సిబ్బంది, పాత్రికేయులు


విజయవాడ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): బెజవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఐదోరోజైన బుధవారం అమ్మవారి జన్మనక్షతమైన మూలానక్షత్రం రోజు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనం పూర్తయిన భక్తులు శివాలయం మెట్ల మార్గం నుంచి కిందకి దిగుతున్నారు. మౌనస్వామి గుడి ఎదురుగానే మీడియా పాయింట్‌ ఏర్పాటు చేశారు. అక్కడే ప్రముఖులు మాట్లాడేందుకు పోడియం ఉంది. మూలా నక్షత్రం సందర్భంగా ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్‌ మధ్యాహ్నం 3 గంటలకు ఇంద్రకీలాద్రికి రావాల్సి ఉంది. మరో పావు గంటలో సీఎం వస్తారనగా సరిగ్గా 2.45 గంటలకు ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఏం జరిగిందో తెలియక అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీశారు. ఒకరినొకరు తోసుకుంటూ.. తొక్కుకుంటూ పరుగులు పెట్టారు. తేరుకుని చూసేసరికి కొండచరియలు జారిపడ్డాయని గుర్తించారు.


పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్‌ 


శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం రోజైన బుధవారం బెజవాడ కనకదుర్గమ్మకు సీఎం జగన్‌ ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రావాల్సి ఉం డగా.. దీనికి 15 నిమిషాల ముందే కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనతో సీఎంని లిఫ్టు మార్గంలో కొండపైకి తీసుకువచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని నిర్ధారణయ్యాక ఘాట్‌రోడ్డు మీ దుగానే 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు దు ర్గగుడికి వచ్చారు. ఆలయ మర్యాదలతో సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. చిన్నరాజగోపురం వద్ద వేదపండితులు శాస్త్రోక్తంగా పరివేష్టితం ధరింపజేశారు. అక్కడి నుంచి సీఎం జగన్‌ పట్టువస్త్రాలను శిరస్సుపై మోస్తూ ప్రధానాలయంలోకి వెళ్లి అమ్మవారికి సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు సీఎం తిరిగి వెళ్లారు. సీఎం రాకనేపథ్యంలో 4 గంటలకుపైగా భక్తులు క్యూలైన్లలోనే పడిగాపులు కాస్తూ అవస్థలు పడ్డారు.


ఆ శిథిలాల కింద చిక్కుకుని ఎవరైనా చనిపోయి ఉంటారనే ప్రచారం జరిగింది. అధికారులు భారీ క్రేన్‌ను రప్పించి సహాయ క చర్యలు చేపట్టారు. కూలిన షెడ్డును కొంత భాగం తొలగించారు. శిథిలాల కింద ఎవరూ మరణించలేదని నిర్ధారించుకు ని అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుర్గగుడి ఏఈ వి.సత్యసాయిచరణ్‌, దేవస్థానం సిబ్బంది కె.కిరణ్‌, బి.సుధాకర్‌ ప్రమాదంలో గాయపడ్డారు. మరో ఇద్దరు మీడియా ప్రతినిధులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌, పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2020-10-22T08:59:37+05:30 IST