Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంద్రేశం గురుకులంలో..మరో 19 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో శుక్రవారం మరో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. గురువారం 27 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో పరీక్షలు చేయగా తాజా కేసులు బయటపడ్డాయి. మొత్తం 46 మంది విద్యార్థులను పాఠశాలలో ప్రత్యేక ఐసొలేషన్‌ గదుల్లో ఉంచారు. నెగెటివ్‌ వచ్చినవారిలో కొందరిని తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్తున్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లోని జ్యోతిబా ఫూలే బాలుర గురుకులంలో శుక్రవారం ఐదుగురు విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణయింది. మూడు రోజులుగా విద్యార్థులకు దగ్గు, జ్వరం ఉండడంతో ఉపాధ్యాయులు వైద్యసిబ్బందికి సమాచారం ఇచ్చారు. 175 మందికి పరీక్షలు చేయగా ఐదుగురికి వైరస్‌ సోకినట్లు తేలింది. కాగా, సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎ్‌స)లోని మోడల్‌ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థినులు, వంట మనిషికి శుక్రవారం వైరస్‌ నిర్ధారణ అయింది. హాస్టల్‌ భవన సముదాయంలో ఉంటున్న విద్యార్థినుల్లో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 65 మందికి పరీక్షలు చేయించగా ఇద్దరికి, వంట మహిళకు పాజిటివ్‌ వచ్చింది. మిగతా విద్యార్థులందరికీ శనివారం టెస్టులు చేయనున్నారు. మరోవైపు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది. ఇక నిజామాబాద్‌ కోటగల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకింది. దీంతో అధికారులు పాఠశాలతో పాటు  బాలికల బీసీ వసతి గృహంలోని 152 మందికి పరీక్షలు నిర్వహించారు. హాస్టల్‌లోని నాలుగో తరగతి విద్యార్థినికి పాజిటివ్‌గా తేలింది.


డీఎంహెచ్‌వో కాంటాక్టులకు టెస్టులు

కరోనా పాజిటివ్‌ వచ్చిన సూర్యాపేట డీఎంహెచ్‌వో కోటా చలం, ఆయన కుటుంబ సభ్యుల ప్రాథమిక కాంటాక్టులకు శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించారు. డీఎంహెచ్‌వోతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న సిబ్బందికి అందరికీ నెగెటివ్‌ వచ్చింది. డీఎంహెచ్‌వో అల్లుడి నర్సింగ్‌ హోం వైద్యులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు 12 మందికి కూడా నెగెటివ్‌గానే తేలింది.

Advertisement
Advertisement