Abn logo
May 5 2021 @ 00:10AM

ఇందూరు అక్షర యోధుడు

నివాళి :

నిరంతరం పేదల పక్షపాతిగా బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి తన జీవితాంతం తపించిన ప్రజా రచయిత సిహెచ్‌. మధు ఏప్రిల్‌ 24న క్యాన్సర్‌తో పోరాడుతూ తనువు చాలించాడు.


భారత స్వాతంత్య్ర సమ వయస్కుడైన మధు చందుపట్ల విఠల్‌గా జీవితం ప్రారంభించి చివరి వరకు ప్రజల కోసం తన రచనను కొనసాగించడమేగాక ప్రతి ప్రజా ఉద్యమంలోనూ తన వంతు పాత్ర నిర్వహించిన కార్యశీలి.


మెదక్‌ జిల్లా రామాయంపేటలో నారాయణ, బాలవ్వ దంపతులకు జన్మించిన మధు చిన్నతనం నుంచి గ్రామంలో సాగే ఏ ప్రజావ్యతిరేక చర్యనైనా సహించేవాడు కాదు. బతుకుదెరువు కోసం నిజామాబాద్‌కు వచ్చి ఓ బట్టల దుకాణంలో గుమాస్తాగా చేరాడు. సంప్రదాయ చదువు పెద్దగా లేకపోయినా సమాజాన్ని, ప్రజల్ని దగ్గరగా చదివి లోతైన ఆలోచనలతో పందొమ్మిదేళ్లకే పద్య రచన చేశాడు. బట్టల షాపులో ఉంటున్నప్పుడు అక్కడికి శివారెడ్డి, బౌస రామదాసు, సూర్యప్రకాశ్‌, నాళేశ్వరం శంకరం లాంటివారు వచ్చి తరచుగా సాహితీ చర్చలు చేసేవారు. అలా వారి సాంగత్యం వల్ల మధుకు రచనాసక్తి పెరిగింది. మొదటి నుంచి బడుగు, బలహీనవర్గాల కోసం తపించినవాడు కాబట్టే వారి జీవితాలే తన కవితా, కథా వస్తువులుగా స్వీకరించి రచనలు చేశాడు.


చెదలు, గొర్రెలు, కులాల్లేవు, కెరటం, నాకు బెయిల్‌ దొరకలేదు మొదలైన 150కి పైగా కథలు ప్రచురించబడ్డాయి. వందలాది కవితలు, కథలు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ప్రజాసాహితి, నవతెలంగాణ, ప్రజాతంత్ర, అమృతకరణ్‌, అరుణతార మొదలైన దిన, వార పత్రికల్లో తరచుగా అచ్చయ్యాయి.


నాలుగు నవలలతో బాటు పదుల సంఖ్యలో కవులు, రచయితల పుస్తకాలకు ముందుమాటలు రాశాడు.


1969లో ఆంధ్రజ్యోతిలో మొదటి కథ ‘హెరిటేజ్‌ ఆఫ్‌ సారో’, 1977లో ప్రారంభ సంచిక ప్రజాసాహితిలో ‘చెదలు’ కథ, 2005లో విశాలాంధ్ర వారు 90 మంది కథలతో ప్రచురించిన ‘తెలంగాణ కథలు’లో మధు ‘చర్చల కథలు’ అచ్చయ్యాయి.


‘విరసం’ సభ్యుడుగా, పౌరహక్కుల నేతగా, ప్రత్యేక తెలంగాణ వాదిగా, సారా వ్యతిరేక పోరాటంలోనూ మధు పాత్ర చెప్పుకోదగ్గది.

1975 అత్యవసర పరిస్థితిలో అరెస్టు కాకుండా తప్పించుకున్నా ఆ పిదప ఒక కరపత్రం ముద్రించిన నేరారోపణతో తన చిన్నపాటి ప్రెస్‌పై పోలీసులు దాడి చేసి ధ్వంసం చేయడంతో జీవితం మరింత దుర్భరమైంది.


కవిత గానీ, కథ గానీ- మధు శైలి సరళంగా ఉండడమేగాక ప్రతి రచన పాఠకుణ్ణి చివరివరకూ చదివేట్లు చేయగల రచనాకౌశలం మధుకే సొంతం.


ఢక్కామొక్కీలు తినుకుంటూ ఒకవైపు పేదరికంతో పోరాటం, మరోవైపు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ గత 18 నెలలుగా బ్రెయిన్‌ క్యాన్సర్‌ బారినపడిన మధు కోలుకుంటూనే ఆ పోరాటంలో ఓడిపోయాడు.


సుమారు ఐదు దశాబ్దాలుగా సాగుతున్న మా సాహితీ స్నేహబంధం ఇలా దుఃఖమయంగా ముగియడం అత్యంత బాధాకరం.


సీనియర్‌ జర్నలిస్టుగా, ప్రజా రచయితగా, కవిగా, వక్తగా ప్రజా ఉద్యమాలకు చేదోడు వాదోడుగా ఉంటున్న మధు మరణం సాహితీలోకానికి తీరని లోటు.

ఐదు దశాబ్దాలుగా ప్రజల పక్షాన నిలబడిన కలం యోధుడు సిహెచ్‌. మధుకు మా అశ్రునివాళి.

ఎనిశెట్టి శంకర్‌, తుర్లపాటి లక్ష్మి


Advertisement
Advertisement
Advertisement