పారిశ్రామిక అభివృద్ధి పరుగు

ABN , First Publish Date - 2021-11-24T05:35:43+05:30 IST

గత ఆరేళ్ల కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ), పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొన్ని విభజిత జిల్లాలు ముందంజలో ఉన్నట్లు రాష్ట్ర గణాంకాల నివేదిక ద్వారా స్పష్టమైంది. అలాగే ఉపాధికల్పన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినట్టు పేర్కొన్నది.

పారిశ్రామిక అభివృద్ధి పరుగు

పెరుగుతున్న పెట్టుబడులు, యూనిట్ల ఏర్పాటు
రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో ‘వరంగల్‌ అర్బన్‌’ జిల్లా
ఉపాధి అవకాశాల్లో ‘వరంగల్‌ రూరల్‌’ ముందంజ
అడవుల విస్తీర్ణంలో అగ్రస్థానంలో ములుగు జిల్లా
రాష్ట్ర ప్రణాళిక సంఘం 2021 నివేదికలో వెల్లడి


హనుమకొండ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి):
గత ఆరేళ్ల కాలంలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ), పరిశ్రమల స్థాపన, పారిశ్రామిక రంగంలో పెట్టుబడుల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని కొన్ని విభజిత జిల్లాలు ముందంజలో ఉన్నట్లు రాష్ట్ర గణాంకాల నివేదిక ద్వారా స్పష్టమైంది. అలాగే ఉపాధికల్పన, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరిగినట్టు పేర్కొన్నది. ఆస్పత్రుల్లో ప్రసవాలు కూడా గణనీయంగా పెరిగాయని, అర్బనైజేషన్‌వల్ల పట్టణాల్లో నివసిస్తున్న జనాభా కూడా పెరిగిందని తెలుస్తోంది. 2021వ సంవత్సరానికి సంబంధించిన  నివేదికను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఈనెల 20న విడుదల చేశారు.

జీడీపీ

స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో హనుమకొండ జిల్లా రాష్ట్రస్థాయిలో 16వస్థానంలో ఉండగా ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా (ప్రస్తుతం హనుమకొండ) స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) 0.18 లక్షల కోట్లుగా ఉంది. 0.14 లక్షల కోట్లతో వరంగల్‌ రూరల్‌ (ప్రస్తుతం వరంగల్‌ )24 స్థానంలో ఉంది. ములుగు జిల్లా అతి తక్కువ జీడీపీ (0.06 కోట్లు)తో అట్టడుగు స్థానంలో ఉంది. మహబూబాబాద్‌ జిల్లా రూ.0.13లక్షల కోట్లతో 25వ స్థానం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రూ.0.12లక్షల కోట్లతో 26వస్థానం రూ.0.11లక్షల కోట్లతో జనగామ జిల్లా 27వ స్థానంలో ఉంది.  రాష్ట్ర సరాసరి జీడీపీ రూ.0.29లక్షల కోట్లుగా తెలిపింది.

పరిశ్రమలు
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి గణనీయంగా జరిగినట్టు నివేదికలో వివరించారు. 2015 నుంచి 2021 మధ్య కాలంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 608 పారిశ్రామిక యూనిట్లు కొత్తగా ఏర్పాటై రాష్ట్రంలో ఆరోస్థానంలో నిలిచింది. ములుగులో అతి తక్కువగా 15 యూనిట్ల స్థాపన జరిగింది. వరంగల్‌ రూరల్‌లో 323, మహబూబాబాద్‌లో 253, జనగామలో 229, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 122 యూనిట్లు ఏర్పాటయ్యాయి.
ఈ ఆరేళ్లలో పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు కూ డా పెరిగాయి. జనగామ జిల్లాలో అత్యధికంగా రూ.3,512 కోట్లు, జయశంకర్‌ జిల్లాలో రూ.2,049 కోట్లు వరంగల్‌ అ ర్బన్‌లో రూ.1005 కోట్లు వరంగల్‌ రూరల్‌లో రూ. 594 కో ట్లు, ములుగు జిల్లాలో రూ.3కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఉపాధి అవకాశాలు రూరల్‌ జిల్లాలో అత్యధికంగా 1,90,557 మందికి ఏర్పడ్డాయి. మెగాటెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటుతో పలు దేశీయ, విదేశీ కంపెనీలు యూనిట్ల స్థాపనకు ముందుకు వచ్చాయి. తద్వారా ఈ టెక్స్‌టైల్‌ పార్క్‌లో లక్ష మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. అర్బన్‌ జిల్లాలో 8,946, జనగామ జిల్లాలో 3,431, భూపాలపల్లి జిల్లాలో 3,213, మహబూబాబాద్‌లో 2,804 మంది, ములుగులో 94 మందికి ఉపాధి పొందేందుకు మార్గం ఏర్పడింది.

ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు..
ఉమ్మడి జిల్లాలో రెండేళ్ల నుంచి విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నట్టు నివేదిక వెల్లడించింది. రాష్ట్రస్థాయిలో సరాసరి 44 శాతం మేరకు ప్రవేశాలు పెరిగాయి. రాష్ట్రస్థాయిలో ములుగు జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. ములుగు జిల్లాలో మొత్తం విద్యార్థుల్లో 73.9శాతం మంది ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో 65.8శాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 62.5శాతం, జనగామ జిల్లా లో 59.7శాతం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 54.2శాతం, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 29.2శాతం మేరకు విద్యార్ధు లు సర్కారు బడుల్లో చేరారు.

బరువు తక్కువ
ఉమ్మడి జిల్లాలో పౌష్టికాహార లోపంవల్ల అత్యధిక శాతం పిల్లలు బరువు తక్కువగా ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం పిల్లల్లో 31.8 శాతం మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 36 శాతం, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 36,7 శాతం, వరంగల్‌ రూరల్‌  జిల్లాలో 37.9 శాతం మంది  పిల్లలు బరువు తక్కువ ఉన్నారు. జనగామ జిల్లాలో 30.9శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో ఉన్నారు. కాగా, మహబూబాబాద్‌ జిల్లాలో మాత్రం వీరి సంఖ్య తక్కువగానే ఉంది. 26.3 శాతం మంది పిల్లలు తక్కువ బరువుతో బాధపడుతున్నారు.

పట్టణ జనాభా
పట్టణ జనాభాలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా రాష్ట్రస్థాయిలో మూడోస్థానంలో ఉంది. రాష్ట్ర సరాసరి పట్టణ జనాభా 38.9శాతం కాగా, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 68.5 శాతం ఉంది. జనగామ జిల్లాలో పట్టణ జనాభా 13.3 శాతం, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 10.2 శాతం, మహబూబాబాద్‌ జిల్లాలో 9.9 శాతం వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 7.0 శాతం, రాష్ట్రంలో అతి తక్కువగా  ములుగు జిల్లాలో అతి తక్కువగా 3.9 శాతం పట్టణ జనాభా ఉంది.

అడవులు
రాష్ట్రంలో మొత్తం భూభాగంలో అడవుల విస్తీర్ణంలో ములుగు జిల్లా అగ్ర స్థానంలో ఉంది. రాష్ట్రంలో సరాసరి అటవీ విస్తీర్ణం 24 శాతం. ములుగు జిల్లాలో మొత్తం భూభాగంలో 71.8 శాతం అడవులు ఉన్నట్టు రాష్ట్ర గణాంకాల నివేదిక పేర్కొన్నది. 51.6 శాతం విస్తీర్ణంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా నాలుగో స్థానంలో నిలిచింది. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 6.8శాతం, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 2.3 శాతం, జనగామ జిల్లాలో మరీ తక్కువగా 1.2 శాతం మేర అటవీ ప్రాంతం ఉంది.

ప్రసవాలు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు కార్యక్రమాలు, అందచేస్తున్న ప్రోత్సాహకాల వల్ల ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆస్పత్రుల్లో ప్రసవాలు 3.3 శాతం పెరిగాయి. 2015-16 సంవ్సరంలో జిల్లాలో అస్పత్రుల్లో ప్రసవాలు 96శాతం ఉండగా 2019-20 సంవత్సరం నాటికి 99.3శాతానికి  పెరిగాయి. కేసీఆర్‌ కిట్ల పంపిణీ ఆస్పత్రుల్లో ప్రసవాలకు ఎక్కువ దోహదపడినట్టు నివేదిక వెల్లడించింది. పిల్లలకు ఇమ్యునైజేషన్‌ (టీకాలు) కూడా ఈ ఐదేళ్లలో 67 నుంచి 76.1 శాతం పెరిగింది.

పౌష్టికాహారం

6 నుంచి 23 నెలల మధ్య వయసు కలిగిన పిల్లల ఆరోగ్యం దృష్ట్యా వారికి పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో సరాసరి 9.2శాతం మంది పల్లలకు పూర్తి పౌష్టికాహారం అందుతోంది. ఇక జిల్లాల విషయానికి వస్తే  జయశంకర్‌ భూపాలపల్లిలో 12.6 శాతం, ములుగులో 12.6 శాతం, జనగామలో 10.7 శాతం,. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 9.3శాతం వరంగల్‌ రూరల్‌లో 5.1 శాతం, మహబూబాబాద్‌లో 3.4 శాతం పిల్లలకు పూర్తి పౌష్టికాహారం అందుతోంది.

కొవిడ్‌ కేసులు

కొవిడ్‌ పాజిటివ్‌ కేసుల విషయంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో ప్రతీ పది లక్షల మందిలో సరాసరి 11,162, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 5,373, జయశంకర్‌ జిల్లాలో 6,162, మహబూబాబాద్‌ జిల్లాలో 6,491, జనగామ జిల్లాలో 6,909 ములుగు జిల్లాలో 10262 పాజిటివ్‌ కేసులుగా నివేదిక పేర్కొన్నది.

Updated Date - 2021-11-24T05:35:43+05:30 IST