Abn logo
Sep 27 2021 @ 01:04AM

పరి‘శ్రమే’ లేదు

మల్లవల్లిలోని ఇండస్ట్రియల్‌ పార్కు

కళావిహీనంగా ఇండస్ర్టియల్‌ పార్కులు

ఐటీ సెక్టార్‌కు ప్రోత్సాహకాలు కరవు 

అసంపూర్తిగా రెండో టవర్‌ నిర్మాణ పనులు 

మల్లవల్లిలో భూ కేటాయింపులు రద్దు 

మినీ ఐపీలపైనా దృష్టి సారించని పరిస్థితి


ఇండస్ర్టియల్‌ పార్క్‌ (ఐపీ)లు కళతప్పాయి. జిల్లాలో వీటి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవకాశాలు ఉన్నా, వాటి పట్ల శ్రద్ధ చూపకపోవటంతో ఉన్నవి కూడా అలంకారప్రాయంగా మారిపోతున్నాయి. పారిశ్రామిక యూనిట్లు పెట్టేందుకు ఔత్సాహికులకు రాయితీలు లేవు. భూముల ధరలు అందుబాటులో లేవు. అగ్రిమెంట్‌ల రద్దు మీద ఉన్న ఆసక్తి పాలకులకు పరిశ్రమల అభివృద్ధిపై కనిపించడం లేదు. ఫలితంగా జిల్లాలో ఐటీ సెజ్‌, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లకు ఆదరణ లభించడం లేదు.


ఆంధ్రజ్యోతి, విజయవాడ : పారిశ్రామిక పార్కులను కొత్తగా ఏర్పాటు చేయటం మాటేమోగానీ, ఉన్న పార్కులనైనా యూనిట్లతో నింపే దిశగా అడుగులే పడటం లేదు. జిల్లాలో కేసరపల్లి ఐటీ సెజ్‌ మొదలు మల్లవల్లిలోని మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌, మెగా ఫుడ్‌ పార్క్‌, స్టేట్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ల వరకు వేటిని చూస్తున్నా జాలేస్తోంది. పారిశ్రామికంగా కళకళలాడాల్సిన ఇండస్ర్టియల్‌ పార్క్‌లు ఔత్సాహికుల ఆదరణకు దూరమై కళావిహీనంగా తయారయ్యాయి. ఇండస్ర్టియల్‌ పార్కుల్లో ప్లాట్లు అందుబాటులో ఉన్నా, వాటిలో పారిశ్రామిక యూనిట్లు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. 


ఐటీ సెజ్‌ మరీ దారుణం 

ఐటీకి తలమానికంగా ఉన్న కేసరపల్లి ఐటీ సెజ్‌లో ఏస్‌ అర్బన్‌ చేపట్టిన రెండో టవర్‌ నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీనికి కారణం మొదటి టవర్‌ ‘మేథ’లో చాలా వరకు కంపెనీలు ఖాళీ కావటమే. ప్రభుత్వం నుంచి రాయితీల ఉపసంహరణ జరిగిన సమయంలోనే ‘మేథ’ నుంచి పలు ఐటీ యూనిట్లు ఖాళీ అయిపోయాయి. ఈ ప్రభావం రెండో టవర్‌ నిర్మాణంపై పడింది. ఈ టవర్‌ నిర్మాణ పనులను ఏస్‌ అర్బన్‌ సంస్థ అసంపూర్తిగా వదిలేసింది. వాస్తవానికి కొన్ని ఐటీ కంపెనీలు వెళ్లిపోయినప్పటికీ.. పలు ఔత్సాహిక ఐటీ యూనిట్లు ముందుకు వచ్చి ఆసక్తి కనబరుస్తున్నాయి. వాటికి తగిన స్పేస్‌ కల్పించే విషయంలో అంతులేని నిర్లక్ష్యం నడుస్తోంది. ఇలా ముందుకొచ్చిన ఔత్సాహిక కంపెనీలకు మేథలో చోటు కల్పిస్తే ఐటీ కళకళలాడుతుంది. రెండో టవర్‌ నిర్మాణంలోనూ పురోగతికి అవకాశం ఉంటుంది. ప్రోత్సాహకర ఐటీ పాలసీ లేకపోవటంతో కొత్తగా ఐటీ యూనిట్లు ఇటు వైపు ఆసక్తి చూపించటం లేదు. దీంతో జిల్లాలో ఐటీ వృద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.


200 యూనిట్లకు భూ కేటాయింపులు రద్దు 

మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో ఇప్పటి వరకు 200 యూనిట్లకు భూ కేటాయింపులు రద్దు చేశారు. వీరంతా భూములు తీసుకుని పరిశ్రమలను ఏర్పాటు చేయటం లేదనే కారణంతోనే కేటాయింపులు రద్దు చేసినట్టు ఏపీఐఐసీ చెబుతోంది. కొందరు ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. అవి విచారణ దశలో ఉన్నాయి. రెండు వందల పారిశ్రామిక యూనిట్లకు భూ కేటాయింపులు రద్దు చేయడంపై పెట్టిన శ్రద్ధ.. వారిని ప్రోత్సహించడంపై పెట్టి ఉంటే ప్రయోజనం ఉండేది. ఆయా యూనిట్ల నిర్వాహకులతో మాట్లాడి, వారి సమస్యలేమిటో గుర్తించి, వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసి ఉంటే వీటి కేటాయింపులు రద్దు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. వారంతా యూనిట్లను ఏర్పాటు చేసేవారు. ఒప్పందాలకు భిన్నంగా వ్యవహరించారని భూ కేటాయింపులు రద్దు చేస్తే భవిష్యత్‌లో ఆసక్తి చూపే పారిశ్రామిక యూనిట్లపైనా ఆ ప్రభావం పడుతుందని ప్రభుత్వం ఆలోచించలేదు. ప్రభుత్వ నిర్ణయం కారణంగానే అదనంగా ఒక్క కొత్త పారిశ్రామిక సంస్థ కూడా ఆసక్తి చూపించలేదు. 


మెగా ఫుడ్‌ పార్క్‌కు దూరం

మల్లవల్లిలోనే 102 ఎకరాల్లో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు స్థానం కల్పించాల్సి ఉంది. జిల్లాలో  ఉద్యాన పంటలెక్కువగా సాగవుతున్నాయి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు మంచి భవిష్యత్తుంది. కానీ ఈ పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి చుక్కలు కనపడుతున్నాయి. భూముల ధరలు రూ.70 లక్షల వరకు ఉంటున్నాయి. ఇంత ధరలు పెట్టి భూములను కొని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను పెట్టడం అసాధ్యమనే భావనతో మెగా ఫుడ్‌ పార్క్‌లో అడుగు పెట్టడానికి ఎవరూ సాహసించటం లేదు. పైగా ఇక్కడ కామన్‌ యూజ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిలో ప్యాకేజింగ్‌, టెట్రాప్యాకింగ్‌, పల్ప్‌ మేకింగ్‌, కోల్డ్‌ స్టోరేజ్‌ సదుపాయాలు ఉంటాయి. ఇప్పటి వరకు దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురాకపోవడంతో  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు జిల్లాకు రావటం లేదు. 


భూమి ధర పెంపు

భూ కేటాయింపుల రద్దు సందర్భంలోనే ప్లాట్ల ధర అమాంతం పెంచేశారు. ఎకరం భూమి ధర రూ.50 లక్షలకు పైనే ఉంది. ఈ ధర కారణంగా కొత్తగా ఆసక్తి చూపే సంస్థలు కూడా వెనుకడుగు వేస్తున్నాయి. పారిశ్రామిక సంస్థ తన డీపీఆర్‌ ప్రకారం భూమి ధర ఐదు శాతానికి మించి ఉండకూడదని భావిస్తుంది. అంతకంటే మించితే వయబిలిటీ ఉండదని భావిస్తుంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భూమి ధరపై ఉభయులకూ ప్రయోజనం కల్పించేలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మరోలా ఉండేది. 


మినీ ఐపీల భవిష్యత్తు ప్రశ్నార్థకం 

జిల్లాలో పలు మినీ ఇండస్ర్టియల్‌ పార్క్‌లకు గతంలో శ్రీకారం చుట్టారు. స్థానికంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వీటిని ఏర్పాటు చేశారు. వీటిలో ప్లాట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికీ అంతులేని జాప్యం జరుగుతోంది. చాలా తక్కువ ధరకు ప్లాట్లు కేటాయించటం వల్ల స్థానికంగా ఉపాధిని సృష్టించే అవకాశం ఉంటుంది. వీటిపై ఇప్పటి వరకు ఏపీఐఐసీ దృష్టి సారించటం లేదు. జిల్లాలో జి.కొండూరు మినీ ఐపీలో 43 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్లాట్ల ధరను నిర్ణయించ లేదు. దరఖాస్తులను కూడా ఆహ్వానించటం లేదు. భీమవరం ఐపీలో ఒక ప్లాట్‌  ఖాళీగా ఉంటే, దానికి ఇప్పటి వరకు ధరను నిర్ణయించలేదు. పెద్దవరం ఐపీలో 32 ప్లాట్లు ఉన్నాయి. ఇవి కూడా చాలా ఖరీదుగా మారాయి. చదరపు మీటరు రూ.44,250 ఉంది. గుడిమెట్ల ఐపీలో 85 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాట్లకు చదరపు మీటరు ధర 60 వేలు ఉంది. అలాగే పెద్దవరం-2 ఐటీ పార్కులో 199 ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్ల ధర చదరపు మీటరు రూ.70,271గా ఉంది. భూముల ధరలు ఇంత అధికంగా ఉన్నందునే ఔత్సాహికులు ఆసక్తి చూపడం లేదు.