Abn logo
Sep 17 2021 @ 00:20AM

కక్షల కాలుష్యానికి ‘పారిశ్రామికం’ బలి

అభివృద్ధి పరుగులు తీయాలంటే పరిశ్రమలు రావాలి, మౌలిక వసతులు మెరుగుపడాలి. ఎక్కడైనా పరిశ్రమల స్థాపనకు పెట్టుబడిదారులు ముందుకు రావాలంటే అనువైన ప్రదేశంలో భూమి, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవవనరుల లభ్యత, శాంతిభద్రతలు, రాజకీయ ఒత్తిళ్లు లేని వాతావరణం ఉండాలి. ఔత్సాహిక పారిశ్రామిక ధోర‌ణుల‌ను ప్రోత్సహించడంలో ‘వ్యాపా రానుకూల వాతావరణ కల్పన’, నిలకడైన ప్రభుత్వ విధానాలు అత్యంత ప్రధానం. ఈ మౌలిక సూత్రాలను దృష్టిలో ఉంచుకునే 2014లో విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో శీఘ్ర అభివృద్ధి సాధించాలంటే పారిశ్రామికీకరణ కూడా ముఖ్యమని తలచి ఆ దిశలో చర్యలు చేపట్టారు. 


ఉన్న వనరులు, అనుకూలతలపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి’ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. పరిశ్రమలకు అవసరమైన అనుమతుల కోసం ఏకగవాక్ష విధానాన్ని అమలు చేశారు. ముఖ్యమంత్రి స్వయంగా చొరవ చూపుతుండటంతో పలు ప్రతిష్ఠాత్మక సంస్థలు ముందుకొచ్చాయి. మూడు అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా 15.45 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా వివిధ సంస్థలతో ఎంఓయు కుదుర్చుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం సింగపూర్, జపాన్, అమెరికా, దావోస్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాలలో పర్యటించి ఆయా ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలను ఒప్పించి పలు ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రంలో పలు పారిశ్రామికవాడలను అభివృద్ధి పరిచారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కియా మోటార్స్, ఇసుజి మోటార్స్, హీరో, బర్జర్ పెయింట్స్, రాంకో సిమెంట్స్ వంటి సంస్థలు, అనేక సెల్‌ఫోన్ తయారీ కంపెనీలు, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్ట్ సంస్థలు రాయలసీమలో పరిశ్రమలు స్థాపించాయి. టిడిపి హయాంలో రూ.5లక్షల కోట్ల విలువైన 39,450 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటై 5,13,351 ఉద్యోగాల కల్పన జరిగినట్లు అసెంబ్లీ సాక్షిగా పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి చేసిన ప్రకటనే చంద్రబాబు కృషికి నిదర్శనం. కరోనా సమయంలో మానవాళిని ఆదుకున్న హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ, విశాఖ మెడ్‌టెక్ జోన్ చంద్రబాబు దూరదృష్టి, దార్శనికతకు ప్రత్యక్ష నిదర్శనాలు. 


చంద్రబాబు అహోరాత్రులు కష్టపడి నిర్మించిన అభివృద్ధి పునాదులు అన్నిటిని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన అవినీతి, విధ్వంసకర విధానాలతో పెకలించి వేసింది. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న జెసిబి (విధ్వంసం), ఎసిబి (కేసులు), పిసిబి (కాలుష్య నియంత్రణ) విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలలో అభద్రతాభావం నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన భూకేటాయింపులను, ఒప్పందాలను సమీక్షించడం, ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలపై అధికార పక్ష ప్రజాప్రతినిధుల బెదిరింపులు, దాడుల వల్ల ‘వ్యాపార అనుకూల వాతావరణం’ దారుణంగా దెబ్బతింది. చంద్రబాబు కృషి ఫలితంగా విశాఖలో డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ (ఫార్ట్యూన్ -500 కంపెనీల్లో ఒకటి)ను బోగస్ సంస్థ అని, ఆ సంస్థకు భూకేటాయింపుల్లో భారీ కుంభకోణం జరిగిందని వైసిపి ఎంపీ మిధున్ రెడ్డి విమర్శించిన ఫలితంగా విశాఖలో క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనను ఆ సంస్థ విరమించుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం చేసిన భూకేటాయింపులు, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ హామీలు కొనసాగిస్తే ఆ గౌరవం చంద్రబాబుకే దక్కుతుందన్న అసూయో లేక స్థాపించిన పరిశ్రమలన్నీ తనకు కప్పం కట్టాలన్న ఫ్యాక్షనిస్ట్ భావజాలమో కానీ పారిశ్రామికవేత్తలను జెసిబి .. ఎసిబి .. పిసిబి విధానాలతో జగన్ ఇబ్బంది పెట్టారు. తత్ఫలితంగా రిలయన్స్, ట్రైటాన్, అదానీ డేటా సెంటర్, ఆసియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్, కియా అనుబంధ (17) పరిశ్రమలు, సింగపూర్ స్టార్టప్ సంస్థలు, లులు గ్రూప్, కింగ్స్ హాస్పిటల్, అమర్ రాజా వంటి అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపిస్తున్నాయి. కాలుష్యం వెదజల్లుతున్నాయన్న సాకుతో చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా బ్యాటరీస్‌కు చెందిన 2 యూనిట్లు, కడప జిల్లా ఎర్రగుంట్ల లోని దక్షిణ భారతంలోనే అతి పెద్దదైన జువారి సిమెంట్స్ పరిశ్రమలను మూసివేయిస్తూ పిసిబితో ఉత్తర్వులు జారీచేయించారు. వారికి హైకోర్టులో ఊరట లభించింది. మరి భారతీ సిమెంట్స్ ఆక్సిజన్ వెలువరిస్తోందేమో పిసిబి వారే చెప్పాలి.  ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తండ్రి వైఎస్ఆర్ స్వార్ధ ప్రయోజనాలతో స్వంత నియోజకవర్గం పులివెందులలో ఏర్పాటుకు సహకరించిన యురేనియం కర్మాగారం పరిసర గ్రామాలను విషతుల్యం చేస్తున్నా, ప్రజలకు మరణశాసనం రాస్తున్నా పిసిబి పట్టించుకోకపోవడం విచిత్రం. రెండున్నర ఏళ్లుగా జగన్‌రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర, నియంతృత్వ విధానాల కారణంగా రూ.10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. 


ప్రభుత్వం అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల పారిశ్రామిక ప్రగతి మందగించింది. వివిధ విధానాల ద్వారా పారిశ్రామికవేత్తల నుంచి బలవంతంగా ‘జె ట్యాక్స్’ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామిక రాయితీలకు సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోని బకాయిలు కూడా చెల్లించామని ప్రకటించారు. ఇది ప్రజలను తప్పుదారి పట్టించడమే. నిజానికి 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్చిన రూ.32వేల కోట్ల బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. విజ్ఞత కొరవడిన అరాచక విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను జగన్‌రెడ్డి అస్తవ్యస్తం చేశారు. ప్రభుత్వ అస్తవ్యస్త ఇసుక, సిమెంట్ పాలసీల వల్ల నిర్మాణరంగం కుదేలయింది. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. రాష్ట్ర ఆర్థిక మందగమనం కారణంగా దాదాపు 20 లక్షల మంది చిరు వ్యాపారులు ఉపాధి కోల్పోయి దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. సిఎఐఇ ఈ ఏడాది మే నెలలో వెలువరించిన నివేదిక ప్రకారం జాతీయ స్థాయిలో నిరుద్యోగిత 11.9 శాతం కాగా ఆంధ్రప్రదేశ్‌లో 13.5 శాతంగా ఉంది. చంద్రబాబు హయాం ఐదేళ్ళలో రాష్ట్రం రూ. 65,327 కోట్లు విదేశీ పెట్టుబడులు సాధించగా, జగన్ రెడ్డి కేవలం రూ. 2,753 కోట్లు మాత్రమే సాధించడం పాలకులు కోల్పోయిన విశ్వసనీయతకు నిదర్శనంగా భావించవచ్చు.


జగన్‌రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలలో గెలిచి అధికారం చేపట్టారు. గెలిచాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు విధ్వంసం చేస్తాను, గత ప్రభుత్వ ఒప్పందాలను గౌరవించను అంటే రాజ్యాంగం, న్యాయస్థానాలు అంగీకరించవు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారకూడదు అని దేశ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వారసత్వంగా వచ్చిన ఫ్యాక్షన్ మనస్తత్వం, ఫ్యూడల్ భావాలతో కూడిన విపరీత పోకడలు ప్రజా వేదికను కూలగొట్టి ఆ శకలాలను తరలించక పోవడంతోనే ప్రస్ఫుటం అవుతున్నాయి. ఇటువంటి మనస్తత్వాన్ని ప్రజాస్వామ్యవాదులు అంగీకరించరు, పెట్టుబడిదారులు అసలే సహించరు. అందుకే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, కొత్తపరిశ్రమలు రావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తన విధానాలు సవరించుకుని ముందుకు సాగక పొతే పారిశ్రామికాభివృద్ధి చతికిలబడటం ఖాయం, రాష్ట్రం ఆర్థిక అత్యవసర స్థితికి దిగజారడం ఖాయం. 

లింగమనేని శివరామప్రసాద్

ప్రత్యేకంమరిన్ని...