పరి‘శ్రమిస్తూ’..

ABN , First Publish Date - 2021-03-01T06:43:07+05:30 IST

మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో కొలువుతీరిన భారీ పరిశ్రమలు ఉత్పాదకతను ప్రారంభించాయి.

పరి‘శ్రమిస్తూ’..
మల్లవల్లిలోని మోహన్‌ స్పిన్‌టెక్స్‌

మల్లవల్లిలో పరిశ్రమల పరుగులు  

పెద్ద సంస్థల్లో ఉత్పాదకత ప్రారంభం 

గతంలోనే ఒప్పందాలు.. నేడు ఫలితాలు 

మోహన్‌ స్పిన్‌టెక్స్‌లో క్లాత్‌ మేకింగ్‌ 

అశోక్‌ లేల్యాండ్‌లో బస్‌ బాడీ బిల్డింగ్‌ 

హెరిటేజ్‌లో.. ఫీడ్‌ మేకింగ్‌ 

వెంకటేశ్వర పేపర్‌మిల్‌లో కాగితం తయారీ 

పార్లీ-జీ నిర్మాణ పనులు ప్రారంభం 

మధ్య తరహా సంస్థలు కూడా రంగంలోకి 


మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో కొలువుతీరిన భారీ పరిశ్రమలు ఉత్పాదకతను ప్రారంభించాయి. ఇటీవలే అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ తన బస్‌ బాడీ యూనిట్‌లో పనులు ప్రారంభించటంతో ఒప్పందం ప్రకారం దాదాపు మెజారీటీ భారీ పరిశ్రమలన్నీ కొలువుతీరినట్టు అయ్యాయి. కిందటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ భారీ పరిశ్రమలకు అంకురార్పణ జరిగింది. పెద్ద పరిశ్రమలు ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని, ఉపాధి అవకాశాలను విస్తృతం చేస్తాయన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మల్లవల్లిలో భారీ పరిశ్రమలకు అవకాశం కల్పించారు. ఆ పరిశ్రమలు నేడు ఉత్పాదకతను అందించటంతోపాటు ఉపాధి అవకాశాలకు బాట వేస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)

మల్లవల్లిలో భారీ పరిశ్రమల ఏర్పాటు కోసం ఒప్పందం చేసుకున్న సంస్థలలో ప్రధానమైనవి ఐదు. వీటిలో అశోక్‌ లేల్యాండ్‌, మోహన్‌ స్పిన్‌టెక్స్‌, హెరిటేజ్‌, వెంకటేశ్వర పేపర్‌, పార్లీ-జీ సంస్థలు ఉన్నాయి. ఈ ఐదింటిలో అశోక్‌ లేల్యాండ్‌, మోహన్‌ స్పిన్‌టెక్స్‌, హెరిటేజ్‌, వెంకటేశ్వర పేపర్‌ మిల్‌ సంస్థలు తమ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు ఉత్పాదకతను కూడా ప్రారంభించాయి. పార్లీ-జీ సంస్థ ఇప్పుడే నిర్మాణ పనులను ప్రారంభించింది. మరో అర్థ సంవత్సరంలో ఈ సంస్థ కూడా తన ఉత్పాదకతను ప్రారంభించటానికి రంగం సిద్ధం చేస్తోంది. మల్లవల్లి ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో భారీ పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆర్థికాభివృద్ధితో పాటు, ఉపాధి అవకాశాలకు కూడా బీజం పడింది. 


స్పిన్‌టెక్స్‌తో తొలి అడుగు

గత ప్రభుత్వం ముందు చూపు జిల్లాలో భారీ పరిశ్రమలు కొలువుతీరటానికి కారణమైంది. మల్లవల్లిలో గత ప్రభుత్వ హయాంలో అతి పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేయటానికి మోహన్‌ స్పిన్‌టెక్స్‌ ముందుకు వచ్చింది. ఈ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం 81 ఎకరాలను కేటాయించింది. స్వాధీనం చేసుకున్న భూముల్లో మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థ ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రెండు దశల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. మొదటి దశలో రూ.328.14 కోట్ల వ్యయంతో, రెండో దశలో రూ.275.85 కోట్ల వ్యయంతో పార్క్‌ను విస్తరించాలని నిర్ణయించింది. తొలి దశ విస్తరణ పనులు చేపట్టడంతో పాటు ఉత్పాదకతను కూడా ప్రారంభించింది. ఆవరణలో టెక్స్‌టైల్‌ పార్క్‌తో పాటు, క్లాత్‌ నాణ్యతను పరిశీలించే ల్యాబరేటరీ, డిజైన్‌ మిక్సింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేసింది. మొదటి దశలో 1547 మందికి, రెండో దశలో 553 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు మొదటి దశలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తీసుకుంది. ఉద్యోగుల కోసం ఏకంగా ఈ సంస్థ తమ ఆవరణలోనే క్వార్టర్స్‌ను కూడా నిర్మిచింది. భారీ యంత్రాలపై వస్త్ర తయారీ జరుగుతోంది. డిజైన్లు, ప్రింటింగ్‌ వంటివి ఇక్కడ జరుగుతున్నాయి. ఎగుమతులు కూడా ప్రారంభమయ్యాయి. 


చురుగ్గా అశోక్‌లేల్యాండ్‌

రెండో అతి పెద్ద పరిశ్రమగా అశోక్‌లేల్యాండ్‌ను చెప్పుకోవాలి. ఈ సంస్థ బస్‌ బాడీ బిల్డింగ్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థకు టీడీపీ ప్రభుత్వం నాడు 75 ఎకరాలను కేటాయించింది. రూ.135 కోట్ల వ్యయంతో ఈ సంస్థ బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను నెలకొల్పింది. తొలి దశలో 2,295 మందికి  ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పింది. ప్రస్తుతం బాడీ బిల్డింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. 


ఎగుమతులు ప్రారంభించిన సంస్థలు

హెరిటేజ్‌ సంస్థ ఫీడ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. వెంకటేశ్వర పేపర్‌ మిల్స్‌ పేపర్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు సంస్థలు కూడా మల్లవల్లి నుంచి ఎగుమతులు ప్రారంభించాయి. ప్రస్తుతం మల్లవల్లిలో పార్లే-జీ సంస్థ తనకు కేటాయించిన 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులను ప్రారంభించింది. 


పెద్ద పరిశ్రమల స్ఫూర్తితో.. 

పెద్ద పరిశ్రమలు చాలా వేగంగా ప్లాంట్లను ఏర్పాటు చేయటంతో గతంలోనే ఒప్పందం చేసుకున్న పలు మధ్య తరహా పరిశ్రమలు కూడా తమ యూనిట్లను దాదాపు ఏర్పాటు చేశాయి. వాటిలో కూడా ఉత్పాదకత ప్రారంభమైంది. స్టీల్స్‌, తయారీ రంగాలకు సంబంధించిన పలు మధ్య తరహా పరిశ్రమలు కూడా ఇక్కడ కొలువుతీరాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఇంకా పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాల్సి ఉంది. ఈ సంస్థలు కూడా త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. కొన్ని ఇప్పటికే నిర్మాణ పనులు ప్రారంభించాయి. 



Updated Date - 2021-03-01T06:43:07+05:30 IST