పరిశ్రమ స్థాపనకు అంతరాయం లేకుండా చూడండి

ABN , First Publish Date - 2021-01-17T04:58:04+05:30 IST

జిల్లాలోని కొడవలూరు మండలంలో నిర్మించనున్న ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ స్థాపనకు భూసేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

పరిశ్రమ స్థాపనకు అంతరాయం లేకుండా చూడండి
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

అధికారులకు మంత్రి మేకపాటి ఆదేశం


నెల్లూరు(జడ్పీ), జనవరి 16 : జిల్లాలోని  కొడవలూరు మండలంలో నిర్మించనున్న ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగమ్‌ లిమిటెడ్‌ పరిశ్రమ స్థాపనకు భూసేకరణలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం స్థానిక పరిశ్రమలశాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో పరిశ్రమ ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  భూ సేకరణలో నష్టపోయిన వారికి పరిహారాన్ని అందించాలని, అంతేగాక భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు లేకండా చూడాలని అన్నారు. అవసరమైతే అదనపు భూమి సేకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఎంత మందికి ఉపాధి అవకాశం ఉంటుందనే విషయాలను పరిశ్రమ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమతో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. ఏపీఐఐసీ బోర్డు ద్వారా  పరిశ్రమకు కావాల్సిన నీటి విషయమై చర్చించాలన్నారు. విద్యుత్తు తదితర మౌలిక వసతులను అందించాలని అధికారులను సూచించారు. భూ సమస్యలపై కోర్టు కేసులను ఏజీ ద్వారా పరిష్కరించేలా చూడాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు సూచించారు. డీఆర్‌డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఇరిగేషన్‌, విద్యుత్‌శాఖలతో ఎప్పటికప్పుడు చర్చించి పరిశ్రమ స్థాపనకు సహకారాన్ని అందించాలన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న వారికి వసతి  కల్పించాలని సూచించారు. ఒకవైపు పోర్టు, మరోవైపు జాతీయ రహదారి, అందుబాటులోకి రానున్న విమానాశ్రయం పరిశ్రమకు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జేసీ హరేందిర పసాద్‌, ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌, కొడవలూరు తహసీల్దారు లాజరస్‌,  విజయ డెయిరీ చైర్మన్‌ కొండ్రెడ్డి రంగారెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతి, మదారి గ్రూప్‌ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-17T04:58:04+05:30 IST