ఆస్పత్రి బయట పుట్టిన బిడ్డ మృతి

ABN , First Publish Date - 2021-05-15T09:34:16+05:30 IST

కొవిడ్‌ టెస్టు చేయించలేదని నిండు గర్భిణిని ఆస్పత్రి లోపలకు సిబ్బంది రానీయకపోతే, బయట బల్ల మీదే ఆమె జన్మనిచ్చిన మగబిడ్డ కన్నుమూశాడు. అదే సమయంలో..

ఆస్పత్రి బయట పుట్టిన బిడ్డ మృతి

పుట్టిన మరునాడే కన్నుమూత

ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు

అయినా, వారినే వెనకేసుకొచ్చిన మంత్రి

ఆళ్లనాని వ్యాఖ్యలపై బంధువుల ఆగ్రహం

విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ టెస్టు చేయించలేదని నిండు గర్భిణిని ఆస్పత్రి లోపలకు సిబ్బంది రానీయకపోతే, బయట బల్ల మీదే ఆమె జన్మనిచ్చిన మగబిడ్డ కన్నుమూశాడు. అదే సమయంలో ఆస్పత్రి సిబ్బందిని ప్రశంసిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటన చేశారు. ఈ రెండు ఉదంతాలపై బాధితురాలి బంధువులు, స్థానికులు శుక్రవారం మండిపడ్డారు. శిశువు మృతికి కారణమైన విశాఖజిల్లా సింహాచలం ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సింహాచలం ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆమె ఆరుబయట ప్రసవించింది. ‘పురుటిపాట్లు’ పేరిట ఆంధ్రజ్యోతి శుక్రవారం సంచికలో దీనిపై వార్త ప్రచురితమయింది. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమెను సిబ్బంది ఆస్పత్రి లోపలకు తీసుకువెళ్లి సపర్యలు చేసి, ఆటోలో కేజీహెచ్‌కు పంపించేశారు. ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గురువారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి, తల్లీబిడ్డను కాపాడారని ప్రశంసలు కురిపించారు. నిజానికి, వైద్య సిబ్బంది సకాలంలో స్పందించలేదని ఆర్‌డీవో కిశోర్‌ జరిపిన విచారణలో తేలింది. నెలరోజులుగా ఆ ఆస్పత్రిలో ఒక్క కేసు కూడా చూడలేదని, కరోనా కారణంగా ఎవరూ రావడం కలెక్టర్‌కు ఇచ్చిన తన నివేదికలో ఆయన తెలిపారు. అత్యవసర సమయాల్లో గర్భిణులకు కరోనా పరీక్షలు చేయడానికి ఒక్కో ఆరోగ్య కేంద్రానికి 50 యాంటీజెన్‌ కిట్లు ఇచ్చామని, వారు కరోనా పరీక్షకు వేరే దగ్గరకు ఎలా పంపారో తెలుసుకుంటామని విశాఖ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ కూడా పేర్కొన్నారు. ఇలా వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనపడుతుండగా, మీడియాలో ఆ వివరాలు వస్తున్నా సరే, మంత్రి అక్కడి వైద్యులను వెనకేసుకు వచ్చి, తిరిగి ప్రశంసించడం ఏమిటని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌ ప్రశ్నించారు. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయిందని, దానికి ఏమి సమాధానం చెబుతారన్నారు. వైద్య సిబ్బందిపై తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-15T09:34:16+05:30 IST