పిల్లల కోసం పరేషాన్‌?

ABN , First Publish Date - 2021-05-11T16:41:09+05:30 IST

కొవిడ్‌ కాలంలో పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? ఈ కోవకు చెందిన దంపతులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా... లేదా? ఐ.వి.ఎఫ్‌ లాంటి ఫెర్టిలిటీ చికిత్సలకు ఇది అనువైన సమయమేనా? పిల్లల కోసం ఆగే వీలు లేని వాళ్లకు ప్రత్నామ్నాయం ఏంటి? తల్లితండ్రులు కావాలనుకునే దంపతులను వేధిస్తున్న

పిల్లల కోసం పరేషాన్‌?

ఆంధ్రజ్యోతి(11-05-2021)

కొవిడ్‌ కాలంలో పిల్లల కోసం ప్రయత్నించవచ్చా? ఈ కోవకు చెందిన దంపతులు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చా... లేదా? ఐ.వి.ఎఫ్‌ లాంటి ఫెర్టిలిటీ చికిత్సలకు ఇది అనువైన సమయమేనా? పిల్లల కోసం ఆగే వీలు లేని వాళ్లకు ప్రత్నామ్నాయం ఏంటి? తల్లితండ్రులు కావాలనుకునే దంపతులను వేధిస్తున్న ప్రశ్నలివి!


కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉన్న ప్రస్తుత సమయం పిల్లల కోసం ప్రయత్నాలకు అనువైనదేనా? ఓ పక్క వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే కొవిడ్‌ సోకుతుందనే భయం, వేయించుకుంటే వ్యాక్సిన్‌ ప్రభావం కడుపులో పెరిగే బిడ్డ మీద పడుతుందేమోననే ఆందోళనలు కూడా దంపతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అన్ని జాగ్రత్తలూ పాటించి గర్భం దాల్చినా, కొవిడ్‌ కాలంలో బిడ్డను కనడం ఎంతవరకూ క్షేమం? అనే సమాధానం దొరకని చిక్కు ప్రశ్నలు సైతం దంపతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరి కొవిడ్‌ కాలం పిల్లలను కనాలనుకునే దంపతులకు ఎంత మేరకు సురక్షితం?


వాయిదా వేయగలిగితే...

మహిళల్లో గర్భం దాల్చే అవకాశాలు పెరిగే వయసుతో పాటు తరిగిపోతూ ఉంటాయి. కాబట్టి 30 ఏళ్లకు చేరుకున్న మహిళలు పిల్లల ప్రయత్నాలను వాయిదా వేయడం సరి కాదు. అయితే అంతకంటే తక్కువ వయస్కులు ఈ ఏడాది పిల్లల ప్రయత్నాలు మానుకోవడమే శ్రేయస్కరం. గర్భిణులకు కొవిడ్‌ సోకితే, భవిష్యత్తులో ఆ బిడ్డ ఎదుగుదల మీద పడే ప్రభావం గురించిన అధ్యయనాలు విస్తృతంగా జరగలేదు. పైగా ప్రసవ సమయానికి కొవిడ్‌ పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఊహించడం కష్టం. పైగా ఇప్పుడు విస్తరించి ఉన్న కొత్త కొవిడ్‌ వేరియెంట్ల ప్రభావం దంపతుల ఫెర్టిలిటీ మీద ఏ మేరకు ఉంటుందనే అంశం మీద కూడా స్పష్టత లేదు. కాబట్టి 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మహిళలు గర్భధారణను వాయిదా వేసుకోవడమే మేలు. అయితే ఆరోగ్యపరంగా, వయసు రీత్యా గర్భధారణను వేసుకోలేని దంపతులు వైద్యుల పర్యవేక్షణలో మెలుగుతూ, అన్ని జాగ్రత్తలు పాటిస్తూ గర్భం దాల్చవచ్చు. గర్భధారణకు సంబంధించినంతవరకూ దంపతులు ఇద్దరూ స్పష్టతతో, కొవిడ్‌ పట్ల పూర్తి అవగాహనతో వైద్యుల సూచనలను కచ్చితంగా పాటించాలి.


ఫెర్టిలిటీ చికిత్సలు!

ఐ.యు.ఐ, ఐ.వి.ఎఫ్‌ మొదలైన ఫెర్టిలిటీ చికిత్సలు ఖర్చుతో, శ్రమతో కూడుకున్నవి. ఈ చికిత్సలతో గర్భం దాల్చిన తర్వాత గర్భిణికి కొవిడ్‌ సోకే వీలు లేకపోలేదు. అలాగే ప్రసవ సమయానికి కొవిడ్‌ పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేం! ఆ సమయానికి ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి చోటుచేసుకుంటే, ప్రసవం క్లిష్టంగా పరిణమించే వీలుంది. కాబట్టి ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఫెర్టిలిటీ చికిత్సలను ఆశ్రయించాలి. లేదంటే కొవిడ్‌ సోకకుండా దంపతులిద్దరూ వ్యాక్సిన్‌ వేయించుకుని, ఆ తర్వాతే ఈ చికిత్సలు ప్రయత్నించవచ్చు. అయితే వ్యాక్సిన్‌ రెండు డోసులు వేయించుకున్న రెండు నెలల తర్వాతే ఫెర్టిలిటీ చికిత్సలు మొదలుపెట్టుకోవాలి. 


వ్యాక్సిన్‌ ప్రభావం ఏ మేరకు?

వ్యాక్సిన్‌ ప్రభావం కడుపులో పెరిగే బిడ్డ మీద ఉంటుంది. కాబట్టే గర్భిణులు వ్యాక్సిన్‌కు అనర్హులు. వ్యాక్సిన్‌ ప్రభావం పురుషుల వీర్యకణాల మీద ఏ మేరకు ఉంటుందనే అంశం గురించి పూర్తి స్థాయిలో అధ్యయనాలు జరగలేదు. అయితే వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు సోకినా, వ్యాక్సిన్‌ తీసుకున్నా... ఆ ప్రభావాలు పురుషుల వీర్యాన్ని కచ్చితంగా ప్రభావం చేస్తాయి. వీర్యకణాల డి.ఎన్‌.ఎలో లోపాలు తలెత్తుతాయి. అలాంటి వీర్యకణాలతో గర్భం దాల్చడం వల్ల, ఆ ప్రభావం పుట్టబోయే పిల్లల మీద పడుతుంది. పిల్లలు జన్యులోపాలతో పుట్టవచ్చు. పిల్లల్లో ఎదుగుదల లోపాలు కూడా తలెత్తవచ్చు. అలాగే కరోనా వైరస్‌ ప్రభావం కూడా వీర్యాన్ని కొంతమేరకు దెబ్బతీస్తుంది. గత ఏడాది కొవిడ్‌ సోకి, లక్షణాలు కనిపించని కొందరు పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గుదల కనిపించింది. కాబట్టి పిల్లల కావాలనుకునే పురుషులు వ్యాక్సిన్‌ వేయించుకోవడం అత్యవసరం. అయితే వ్యాక్సిన్‌ విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. 


రెండు నెలల తర్వాతే...

వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు ఆ సమయంలో తయారయ్యే వీర్యం మీద పరిమిత కాలం పాటు మాత్రమే వ్యాక్సిన్‌ ప్రభావం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తర్వాత, రెండు నుంచి మూడు నెలల పాటు పిల్లల ప్రయత్నాలు మానుకోవాలి. ఆ సమయంలోగా వీర్యం మీద వ్యాక్సిన్‌ ప్రభావం తగ్గి, ఆరోగ్యవంతమైన వీర్యం తయారవుతుంది. ఈ నియమం సహజసిద్ధ గర్భధారణ, ఐ.వి.ఎఫ్‌ మొదలైన ఫెర్టిలిటీ చికిత్సలు రెండింటికీ వర్తిస్తుంది. 


బ్యాంకులో దాచుకోవచ్చు!

పిల్లల కోసం ప్రయత్నించాలనుకునే దంపతులకు వ్యాక్సిన్‌ ప్రభావం గురించిన భయాలు ఉండడం సహజం. ఇలాంటివాళ్లు భవిష్యత్తు అవసరాల కోసం అండాలు, స్పెర్మ్‌ను బ్యాంకులో నిల్వ చేసుకోవచ్చు. వ్యాక్సిన్‌కు ముందు మహిళలు తమ అండాలను, పురుషులు స్పెర్మ్‌ను ఫెర్టిలిటీ క్లినిక్స్‌లోని బ్యాంకుల్లో ఫ్రీజ్‌ చేయించుకుని, పరిస్థితులు అనుకూలించిన తర్వాత పిల్లల ప్రయత్నాలు కొనసాగించవచ్చు. వ్యాక్సిన్‌ వేయించుకున్న తర్వాత ఫెర్టిలిటీ సమస్యలు ఎదురైనా, లేదా కొత్త వేరియెంట్‌ విజృంభించి గర్భధారణను మళ్లీ వాయిదా వేసుకునే పరిస్థితి తలెత్తినా ఇలా దాచుకున్న అండాలు, వీర్యకణాలు అక్కరకొస్తాయి. పైగా స్పెర్మ్‌ ఫ్రీజింగ్‌కు అయ్యే ఖర్చు కూడా తక్కువే! ఆరు నెలల స్పెర్మ్‌ ఫ్రీజింగ్‌కు అయ్యే ఖర్చు మూడు నుంచి ఐదు వేల లోపే ఉంటుంది. కాబట్టి ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు.


మహిళలు - కొవిడ్‌ వ్యాక్సిన్‌!

18 ఏళ్లు పైబడిన పెళ్లి కాని అమ్మాయిలు నిరభ్యంతరంగా వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

తల్లి పాల మీద వ్యాక్సిన్‌ ప్రభావం ఉంటుంది. కాబట్టి పిల్లలకు పాలిచ్చినంత కాలం తల్లులు వ్యాక్సిన్‌ వేయించుకోకూడదు.

పెళ్లై పిల్లలున్న తల్లులు వ్యాక్సిన్‌ వేసుకోవచ్చు.

ఐ.వి.ఎఫ్‌, ఐ.యు.ఐ మొదలైన ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకుంటున్న మహిళలు వ్యాక్సిన్‌ వేయించుకోకూడదు.

సహజసిద్ధంగా గర్భం దాల్చాలనుకునే మహిళలు, వ్యాక్సిన్‌ రెండు డోసులు వేసుకున్న రెండు నుంచి మూడు నెలల తర్వాతే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాలి.

Updated Date - 2021-05-11T16:41:09+05:30 IST