నాలుగున్నరేళ్ల కనిష్ఠానికి ద్రవ్యోల్బణం

ABN , First Publish Date - 2020-06-16T06:18:16+05:30 IST

భారత ఎగుమతి వాణిజ్యం వరుసగా మూడో నెలా క్షీణించింది. మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 36.47 శాతం పతనమై 1,905 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి

నాలుగున్నరేళ్ల  కనిష్ఠానికి ద్రవ్యోల్బణం

  • మే నెలలో మైనస్‌ 3.21 శాతంగా నమోదు
  • ఎగుమతుల్లో 36.47శాతం క్షీణత 

భారత ఎగుమతి వాణిజ్యం వరుసగా మూడో నెలా క్షీణించింది. మే నెలలో ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 36.47 శాతం పతనమై 1,905 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. పెట్రోలియం, టెక్స్‌టైల్‌, ఇంజనీరింగ్‌, జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎగుమతులు తగ్గడమే ఇందుకు కారణం. మే నెలకు దిగుమతులు సైతం 51 శాతం తగ్గి 2,220 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దాంతో వాణిజ్య లోటు 315 కోట్ల డాలర్లకు పరిమితమైంది. గత ఏడాది మే నెలలో వాణిజ్య లోటు 1,536 కోట్ల డాలర్లుగా నమోదైంది. ఎగుమతులపై వచ్చే ఆదాయం కంటే దిగుమతుల వ్యయం అధికంగా ఉండటాన్ని వాణిజ్య లోటు అంటారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ డేటా ప్రకారం.. ఏప్రిల్‌-మే నెలలకు ఎగుమతులు 47.54 శాతం తగ్గుదలతో 2,941 కోట్ల డాలర్లుగా, దిగుమతులు 5.67 శాతం తగ్గి 3,932 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. దాంతో ఈ రెండు నెలలకు వాణిజ్యలోటు 991 కోట్ల డాలర్లుగా ఉంది. గత నెలలో ముడి చమురు దిగుమతులు 71.98 శాతం తగ్గి 349 కోట్ల డాలర్లకు, బంగారం దిగుమతులు 98.4 శాతం తగ్గి 0.76 కోట్ల డాలర్లకు పరిమితం అయ్యాయి. 


న్యూఢిల్లీ : దేశంలో టోకు ధరలు నాలుగున్నరేళ్ల కనిష్ఠ స్థాయికి జారుకున్నాయి. దీంతో ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మైనస్‌ 3.21 శాతానికి పడిపోయింది. ఆహారోత్పత్తులు ప్రియమైనప్పటికీ ఇంధన, విద్యుత్‌ రేట్లు తగ్గడం ఇందుకు కారణమైంది. 2015 నవంబరులో -3.7 శాతంగా నమోదైన టోకు ద్రవ్యోల్బణానికి ఆ తర్వాత మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి. గత ఏడాది మే నెలలో డబ్ల్యూపీఐ 2.79 శాతంగా నమోదైందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. గత నెలలో ఆహారోత్పత్తుల టోకు ధరల వార్షిక పెరుగుదల 1.13 శాతం. ఏప్రిల్‌లో 2.55 శాతం
  2. పప్పు దినుసుల టోకు ద్రవ్యోల్బణం గత నెలలో 11.91 శాతం కాగా, ఏప్రిల్‌లో 12.31 శాతంగా ఉంది 
  3. మే నెలలో కూరగాయల టోకు ద్రవ్యోల్బణం మైనస్‌ 12.48 శాతానికి పడిపోయింది. బంగాళదుంపల రేటు మాత్రం 52.25 శాతం వార్షిక పెరుగుదలను నమోదు చేసుకుంది. కోడిగుడ్లు, మాంసం, చేపల ధర 1.94 శాతం పెరిగింది. 
  4. గత నెలలో విద్యుత్‌, ఇంధన ధరలు ద్రవ్యోల్బణం -19.83 శాతం. ఏప్రిల్‌లో -10.12 శాతంగా ఉంది. మాన్యుఫాక్చరింగ్‌ ఉత్పత్తుల రేట్లు సైతం మే లో 0.42 శాతం తగ్గాయి 
  5. మార్చి టోకు ద్రవ్యోల్బణాన్ని 0.42 శాతానికి సవరించింది. తొలుత 1 శాతంగా అంచనా వేసింది
  6. ప్రభుత్వం గతనెల రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణానికి సంబంధించి పాక్షిక గణాంకాలను మాత్రమే విడుదల చేసింది. మేలో ఆహారోత్పత్తుల రిటైల్‌ ధరల వార్షిక పెరుగుదల 9.28 శాతానికి ఎగబాకిందని తెలిపింది. పప్పులు, మాంసం, చేపలు, వంటనూనెల ధరలు పెరగడం ఇందుకు కారణమైంది. 


Updated Date - 2020-06-16T06:18:16+05:30 IST