వృద్ధి పాతాళానికి.. ధరలు ఆకాశానికి

ABN , First Publish Date - 2020-07-17T06:46:47+05:30 IST

కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. కొవిడ్‌-19ని అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం వల్ల ఈ ఏడాది వృద్ధిరేటును ఎప్పటికప్పుడు రేటింగ్‌ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు కుదిస్తూ వస్తున్నాయి...

వృద్ధి పాతాళానికి.. ధరలు ఆకాశానికి

  • ఈ ఏడాది -9.5శాతం, క్యూ1లో -25 శాతం: ఇక్రా


కరోనా మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. కొవిడ్‌-19ని అదుపు చేసేందుకు తీసుకున్న చర్యల ప్రభావం వల్ల ఈ ఏడాది వృద్ధిరేటును ఎప్పటికప్పుడు రేటింగ్‌ ఏజెన్సీలు, అంతర్జాతీయ సంస్థలు కుదిస్తూ వస్తున్నాయి. తాజాగా దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా వృద్ధిరేటు మైనస్‌ 9.5 శాతానికి దిగజారవచ్చని అంచనా వేసింది. కార్మిక శక్తి తగినంతగా అందుబాటులో లేని కారణంగా రిటైల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయని ఎస్‌బీఐ తెలిపింది. రాబోయే రోజుల్లో ధరలు  గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగడం ఖాయమని తెలిపింది. 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు -9.5 శాతానికి క్షీణించవచ్చని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. అలాగే జూన్‌ త్రైమాసికంలో వృద్ధిరేటులో క్షీణత -25 శాతం వరకు ఉండవచ్చునని కూడా హెచ్చరించింది. దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌లు కొనసాగుతుండటం వల్ల మే, జూన్‌ నెలల్లో కన్పించిన వృద్ధి  తెరమరుగైపోయిందని ఇక్రా తాజా నివేదికలో పేర్కొంది. ఇంతవరకు ఏ దేశీయ, అంతర్జాతీయ సంస్థ లేదా ఏజెన్సీ ప్రకటించనంత కనిష్ఠ స్థాయి ఇది. అలాగే ఇక్రా గతంలో ప్రకటించిన అంచనా -5 శాతంతో పోలిస్తే చాలా అధికం.


ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు - 5 శాతం నుంచి -6.5 శాతం మేర పతనాన్ని చూడవచ్చని పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. వృద్ధిరేటు రాబోయే త్రైమాసికాల్లో కూడా నిరాశావహంగానే ఉంటుందని పేర్కొంది. సెప్టెంబరుతో ముగియనున్న రెండో త్రైమాసికంలో -12.4 శాతం, అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో -2.3 శాతం క్షీణత నమోదుకావచ్చని అంటోంది. వచ్చే ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి మాత్రం 1.3 శాతం వృద్ధిని కనబర్చవచ్చని ఇక్రా పేర్కొంది. ‘‘లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులతో దేశంలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. దాంతో కొన్ని రాష్ట్రాలు స్థానికంగా లాక్‌డౌన్‌ విధిస్తుండటం వృద్ధి రికవరీకి అంతరాయంగా మారింది’ అ’ని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్‌ అన్నారు. కరోనా సంక్షోభ తీవ్రతతోపాటు మరింత కాలం భద్రత చర్యలు చేపట్టాల్సిన అవసరమున్న నేపథ్యంలో రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి క్షీణత భారీ స్థాయిలో ఉండన్నుట్టు భావిస్తున్నామని చెప్పారు. ఈసారి పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పనితీరు మెరుగ్గా ఉండవచ్చని ఇక్రా అంటోంది. వ్యవసాయ రంగం పనితీరు, గ్రామీణ మార్కెట్లో వినిమయం ఆశావహంగా ఉంది. ఈసారి వ్యవసాయ రంగ వృద్ధి (జీవీఏ) 3.5-4 శాతంగా నమోదుకావచ్చని అంచనా. 




దంచేస్తాయ్‌

మరికొద్ది నెలలపాటు మార్కెట్లో ధరలు గరిష్ఠ స్థాయిల్లోనే కొనసాగవచ్చని ఎస్‌బీఐ హెచ్చరించింది. కూలీల కొరత కారణంగా వస్తు సరఫరాకు ఏర్పడుతున్న అవాంతరాలే ఇందుకు కారణమని తాజా నివేదికలో  పేర్కొంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎ్‌సఓ) విడుదల చేసిన డేటా ప్రకారం.. జూన్‌ నెలకు మార్కెట్‌ ధరల ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.09 శాతానికి ఎగబాకింది. తమ గణనలో జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.98 శాతంగా నమోదైందని ఎస్‌బీఐ ఎకోరాప్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. అంటే, ఎన్‌ఎ్‌సఓ ప్రకటించిన దానికంటే 0.90 శాతం అధికం. కరోనా సంక్షోభ నేపథ్యంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా రూపొందించుకున్న కొత్త విధానంలో ఈ గణన జరిపినట్లు ఎస్‌బీఐ తెలిపింది. కరోనా సంక్షోభంతో ఆన్‌లైన్‌లో వస్తు కొనుగోళ్లు జరిపేవారు మరింత పెరిగారని, ఈ నేపథ్యంలో రిటైల్‌ ద్రవ్యోల్బణ గణనకు ఆన్‌లైన్‌ ధరలనూ పరిగణనలోకి తీసుకోవాలని గణాంకాల మంత్రిత్వ శాఖకు ఎస్‌బీఐ సూచించింది. ఎన్‌ఎ్‌సఓ ఆన్‌లైన్‌ ధరలనూ పరిగణనలోకి తీసుకొని ఉంటే గతనెల రిటైల్‌ ద్రవ్యోల్బణం మరో 0.10-0.15 శాతం మేర అధికంగా నమోదై ఉండేదని ఎస్‌బీఐ ఎకోరాప్‌ నివేదిక పేర్కొంది. 


మరిన్ని ముఖ్యాంశాలు..

  1. కొవిడ్‌ వ్యాప్తితో ప్రపంచంలో ప్రతిద్రవ్యోల్బణ పరిస్థితులు ఊపందుకున్నాయి. కానీ, భారత్‌తోపాటు చాలావరకు వర్ధమాన దేశాల్లో మాత్రం ధరలు ఎగబాకుతున్నాయి. 
  2. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలో ఉన్నందున ఆగస్టు 4-6 తేదీల్లో నిర్వహించబోయే పరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించేందుకు అవకాశాలు సన్నగిల్లాయి. 

Updated Date - 2020-07-17T06:46:47+05:30 IST