ఇన్‌ఫ్లుయెంజా అటాక్‌.. తేమ వాతావరణంలో జర భద్రం

ABN , First Publish Date - 2020-08-07T14:49:20+05:30 IST

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభించడానికి అనువైన కాలం ఇది. ఇన్‌ఫెక్షన్లు కొద్ది కాలం తర్వాత బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లుగా రూపాంతరం చెందుతాయి. టైఫాయిడ్‌, మలేరియా జ్వరాల విజృంభణ కూడా వర్షాకాలంలో

ఇన్‌ఫ్లుయెంజా అటాక్‌.. తేమ వాతావరణంలో జర భద్రం

వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభించే అవకాశాలు

ఆస్తమా, న్యుమోనియా ఉంటే మరింత జాగ్రత్త

రోగ నిరోధక శక్తి తగ్గే కాలం


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు విజృంభించడానికి అనువైన కాలం ఇది. ఇన్‌ఫెక్షన్లు కొద్ది కాలం తర్వాత బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్లుగా రూపాంతరం చెందుతాయి. టైఫాయిడ్‌, మలేరియా జ్వరాల విజృంభణ కూడా వర్షాకాలంలో పెరుగుతుంది. వాతావరణ మార్పులతో శ్వాసకోస వ్యవస్థ దెబ్బతింటుంది. ఒకసారి వర్షం పడి ఆగిపోతే వైరస్‌ ప్రభావం అంతగా ఉండదు. కానీ ఒకే రోజు ఆగి ఆగి వర్షం పడడం, చల్లటి వాతావరణం చోటు చేసుకోవడం వల్ల వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ శక్తివంతమైతే జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోశ వ్యాధులు తీవ్రమవుతాయని వెల్లడిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, వ్యాధిగ్రస్తులను రిస్క్‌పాపులేషన్‌గా పరిగణిస్తామన్నారు. 


వాతావరణ కాలుష్యంతో

తేమ వాతావరణంలో ఆస్తమా, న్యుమోనియా, సీవోపీడీ తదితర శ్వాసకోశ వ్యాధులు విజృంభించే ప్రమాదముంది. ఈ జబ్బులు ఎక్కువగా  పిల్లలు, మహిళల్లో చోటు చేసుకుంటాయి. దగ్గు, ఆయాసం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వర్షంలో తడిసే వారికి ఈ సమస్యలు అధికం అవుతాయని వైద్యులు వివరించారు. వాతావరణ కాలుష్యం కారణంగా ఆస్తమా రోగుల సంఖ్య పెరుగుతోంది. చెస్ట్‌ ఆస్పత్రి ఓపీ విభాగంలో వర్షాకాలాల్లో ఈ సంఖ్య రోజూ 50 నుంచి 70 వరకు ఉంటుందని  వైద్యులు తెలిపారు. ఈ రోగుల్లో డస్ట్‌ ఎలర్జీ, లంగ్‌ఎలర్జీ, స్కిన్‌ ఎలర్జీ సమస్యలు ఉంటున్నాయని వైద్యులు వివంరించారు. 


నాలుగు దశలుగా ఆస్తమా  

జీనా గైడ్‌లైన్స్‌ ప్రకారం ఆస్తమా తీవ్రతను వైద్యులు నాలుగు దశలుగా గుర్తించి చికిత్సలు అందిస్తున్నారు. మొదటి దశలో లక్షణాలు పెద్దగా కనిపించవు సూచనలు ఉంటాయి. రెండో దశలో కొద్దిగా ఆస్తమా  లక్షణాలు బయటపడుతుంటాయి. మూడో దశలో  వారానికి రెండు, మూడు సార్లు రాత్రిపూట దగ్గు, ఆయాసం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. నాలుగో దశలో రోగి జబ్బుతో తీవ్ర అస్వస్థతకు గురవుతారు. మొదటి, రెండో దశలో మందులను వైద్యుల సలహా ప్రకారం కొద్ది రోజులు వాడితే సరిపోతుందని, మూడో, నాలుగో దశలలో దీర్ఘకాలంగా మందులను వినియోగించాల్సి ఉంటుందని వివరించారు. 


న్యుమోనియా ఇబ్బందే...

న్యుమోనియా లక్షణాలు పిల్లల్లోనే కాదు.. పెద్దవారిలో కూడా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండే మహిళలు, ఆరవై ఏళ్లుపైబడిన వారిలో న్యుమోనియా ఎక్కువగా కనిపిస్తుందన్నారు. కరోనా వంటి సమస్యలు ఎదుర్కొనే వారిలో న్యుమోనియా త్వరగా ప్రభావం చూపే అవకాశముందని వైద్యులు పేర్కొంటున్నారు. తక్కువ బరువుతో పుట్టే వారికి, పౌష్టికాహార లోపం ఉండే పిల్లలకు న్యుమోనియా జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. 


ఇతర వ్యాధులు ఉంటే... 

రక్తహీనత, హెచ్‌ఐవీ, మధుమేహం, ఆస్తమా, గుండె,  ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి వ్యాధులున్న వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్పారు. వీరు తరచూ వైద్యులను సంప్రందించాలని సూచించారు. పొగ, మద్యం తాగేవారికి న్యుమోనియా వచ్చే ప్రమాదముందన్నారు.


అప్రమత్తత అవసరం: డాక్టర్‌ డి. విద్యాసాగర్‌, ఈఎన్‌టీ సర్జన్‌, అపోలో ఆస్పత్రి 

అలర్జీ కారణంగా రినైటిస్‌, సైనసైటిస్‌ వంటి ఈఎన్‌టీ సమస్యలు ఈ సీజన్‌లో సాధారణంగా వస్తుంటాయి. వీటి కారణంగా ముక్కు కారడం, తలనొప్పి, కొన్ని సందర్భాల్లో జ్వరం, చెవి, ముక్కుకు సంబంధించిన ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు, గొంతునొప్పి వస్తుంటాయి. జలుబు, గొంతునొప్పితో బాధపడేవారికి దూరంగా ఉండాలి. ఇన్‌ఫెక్షన్లు ఏర్పడకుండా చెవులను పొడిగా ఉంచుకోవాలి. తడిసిన దుస్తులు ధరించకూడదు. ఇంటి గోడలు తడిగా మారితే ఫంగస్‌ ఏర్పడే అవకాశం ఉంది. దాని వల్ల అనారోగ్య సమస్యలు రావచ్చు. వేడి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. తాజా కూరగాయాలు, పండ్లు, పెరుగు వంటి రోగ నిరోధకతను పెంచే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో ఉండేందుకు ప్రయత్నించాలి. పొగతాగడం మానివేయాలి. 


జాగ్రత్తలు ఇలా..: డాక్టర్‌ రాకేష్‌, పల్మనాలజిస్టు, స్టార్‌ ఆస్పత్రి.

మందులు వాడినా మూడు రోజులకు లక్షణాలు తగ్గకపోతే వైద్యులను సంప్రందించాలి. దగ్గు, జలుబు తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా తీసుకోవాలి. దగ్గు వస్తే చేతిరుమాలని నోటికి అడ్డంగా పెట్టుకోవాలి. జ్వరం వచ్చి తగ్గుతుంటే రక్తపరీక్షలు చేయించుకోవాలి. అంటువ్యాధులు సోకిన వారికి చిన్నపిల్లలు, మహిళలు దూరంగా ఉండాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. వేడి ఆహారాన్ని అవసరం మేరకే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, పాలు, చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి. ఈగలు, దోమలు ముసిరే ప్రాంతాలను శుభ్రం చేయాలి.


ఈ లక్షణాలు కనిపిస్తే..: డాక్టర్‌ నరహరి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, నిలోఫర్‌ ఆస్పత్రి 

విడవకుండా పొడి దగ్గు, తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడం కష్టం కావడం, కఫం, రక్తం పడడం, చాతీనొప్పి, బలహీన పడడం, ఆహారం తీసుకోవడానికి ఇష్టం ఉండకపోవడం, మందకొడితనం వంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రందించాలి. దగ్గు, కఫం పడుతుంటుంటే ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోవాలి. శ్వాసకోశ వ్యాధులున్న వారు చల్లటి వాతావరణంలో ఎక్కువగా తిరగకూడదు. తరచూ జలుబు వచ్చే వారు న్యుమోనియా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి పౌష్టికాహారం తీసుకోవాలి. మధుమేహం, గుండె జబ్బులను నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యుల సలహా ప్రకారం ఆవిరి తీసుకోవాలి. ఫ్లూయిడ్స్‌ తీసుకోవాలి.

Updated Date - 2020-08-07T14:49:20+05:30 IST