ఇన్ఫీ .. భళా

ABN , First Publish Date - 2021-01-14T06:41:25+05:30 IST

ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌ లా భం రూ.5,197 కో ట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కా

ఇన్ఫీ .. భళా

రూ.5,197 కోట్లకు  క్యూ3 లాభం

రూ.25,927 కోట్లకు ఆదాయం 

ఆదాయ వృద్ధి అంచనా 4.5-5%కి పెంపు  


దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మురిపించాయి. గతవారంలో ఈ ఫలితాల సీజన్‌కు బోణీ కొట్టిన టీసీఎస్‌ ఆశాజనక పనితీరును కనబర్చగా.. తాజాగా విడుదలైన ఇన్ఫోసిస్‌, విప్రో గణాంకాలు విశ్లేషకుల అంచనాలను మించిపోయాయి.


ఈ ఆర్థిక సంవత్సరంలో మూడో  త్రైమాసికానికి ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్‌  లా భం రూ.5,197 కో ట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కా లానికి ఆర్జించిన రూ.4,457 కోట్ల లాభంతో పోలిస్తే 16.6 శాతం వృద్ధి నమోదైంది. జూలై-సెప్టెంబరు త్రైమాసికానికి(క్యూ2) గడించిన రూ.4,845 కోట్ల లాభంతో పోలిస్తే  7.3 శాతం వృద్ధి చెందింది. గడిచిన మూడు నెలల్లో ఇన్ఫీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 12.3 శాతం పెరిగి రూ.25,927 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఏడాదిలో ఇదే సమయానికి కంపెనీ రెవెన్యూ రూ.23,092 కోట్లుగా ఉంది. మరిన్ని ముఖ్యాంశాలు.. 


కంపెనీ మొత్తం ఆదాయంలో డిజిటల్‌ సేవల ద్వారా సమకూరిన వాటా 50.1 శాతానికి పెరిగింది. స్థిర కరెన్సీ ఆధారంగా డిజిటల్‌ సేవల రెవెన్యూ వార్షిక ప్రాతిపదికన 31.3 శాతం (త్రైమాసిక ప్రాతిపదికన 12.3 శాతం) వృద్ధి చెంది 176.1 కోట్ల డాలర్లకు చేరుకుంది. 


ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) కంపెనీ స్థిర కరెన్సీ ఆధారిత ఆదాయ వృద్ధిని 4.5-5 శాతంగా అంచనా వేసింది. అక్టోబరులో అంచనా వేసిన 2-3 శాతం వృద్ధితో పోలిస్తే గణనీయంగా పెం చింది. 2020-21కి కంపెనీ నిర్వహణ లాభాల మార్జిన్‌ అంచనాను సైతం 24-24.5 శాతానికి పెంచింది.  


2020-21లో ప్రాంగణ నియామకాల ద్వారా దాదాపు 17 వేలు, వచ్చే ఏడాది 24 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే అవకాశం ఉంది. గత ఏడాది డిసెంబరు చివరినాటికి కంపెనీలో మొత్తం 2,49,312 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల వలసల రేటు 10 శాతానికి తగ్గింది. 


మూడో త్రైమాసికంలో కంపెనీ కోటి డాలర్లకు పైగా విలువైన కాంట్రాక్టుల విభాగంలో కొత్తగా 4 క్లయింట్లను దక్కించుకుంది. 10 లక్షల డాలర్లకు పైగా విలువైన కాంట్రాక్టుల విభాగంలో 16 కొత్త క్లయింట్లను చేర్చుకుంది. 


కంపెనీ మరో అత్యుత్తమ త్రైమాసిక పనితీరును నమోదు చేసుకుంది. డిజిటల్‌ పరివర్తనంపై దృష్టిపెడుతూ, కస్టమర్ల అవసరాలకు తగిన వ్యూహాలతో ముందుకెళ్లడం ఐటీ ఇండస్ట్రీలో అందరికంటే అధిక వృద్ధి సాధనకు దోహదపడింది. వాన్గార్డ్‌, దైమ్లర్‌, రోల్స్‌ రాయిస్‌ వంటి ప్రపంచ దిగ్గజాల కాంట్రాక్టులు దక్కించుకోవడం కంపెనీ డిజిటల్‌, క్లౌడ్‌ సేవల సామర్థ్యాలకు నిదర్శనం. 


సలీల్‌ పరేఖ్‌, సీఈఓ

Updated Date - 2021-01-14T06:41:25+05:30 IST