వారసత్వ భూమిని అత్తామామలు విక్రయించారని..

ABN , First Publish Date - 2021-10-22T05:19:32+05:30 IST

వారసత్వ భూమిని అత్తామామలు విక్రయించారని..

వారసత్వ భూమిని అత్తామామలు విక్రయించారని..
బాధితులతో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి

  • పెట్రోలు డబ్బాతో తోటి కోడళ్ల ఆందోళన


కులకచర్ల: వారసత్వ భూమిని అత్తా, మామలు విక్రయించారని తోటికోడళ్లు వారిపిల్లలతో కలిసి పెట్రోల్‌ డబ్బాతో రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటన చౌడాపూర్‌ మండల కేంద్రంలోని చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందిపాల్‌ గ్రామానికి చెందిన సుగంశెట్టి శ్రీశైలం, కళావతి దంపతులు. శ్రీశైలంకు గ్రామ పరిధిలో సర్వే నంబరు 260/అలో రెండెకరాల 20గుంటల భూమి ఉంది. వీరికి ఇద్దరు కుమారులు వీరభద్రప్ప, విజయ్‌కుమార్‌లు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు కాగా పెద్ద కుమారుడు వీరభద్రప్ప పరిగి డిపోలో డ్రైవర్‌గా పని చేస్తూ రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి భార్య మహేశ్వరి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.  రెండో కుమారుడు విజయ్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉంటూ కంపెనీలో పని చేస్తున్నాడు. అతనికి భార్య శైలజ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా శ్రీశైలం తనపేరుపై ఉన్న రెండెకరాల 20 గుంటల భూమిని కుటుంబ సభ్యులకు తెలియకుండా ఈనెల 10న తన భార్య కళావతి తమ్ముడు శంకర్‌ కుటుంబీకులైన భాగ్యవతికి రిజిస్ట్రేషన్‌ చేశాడు. విషయం తెలుసుకున్న పెద్ద కోడలు మహేశ్వరి, ఆమె ఇద్దరు కుమార్తెలు, చిన్న కుమారుడు విజయ్‌కుమార్‌, అతడి భార్య శైలజ ఇద్దరు కూతుళ్లతో పెట్రోలు డబ్బాతో చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.  వారసత్వ పెద్దల భూమి తమ పిల్లలకు చెందాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేయాలని లేదంటే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు. వారికి మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌ అశోక్‌కుమార్‌, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి అక్కడికి చేరుకొని వారికి నచ్చచెప్పి పంపించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి ఆందోళన చేస్తున్న శైలజ, మహేశ్వరి కుటుంబీకులకు న్యాయం జరిగేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. 

Updated Date - 2021-10-22T05:19:32+05:30 IST