అమానుషం అమానవీయం

ABN , First Publish Date - 2022-01-24T06:28:48+05:30 IST

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఒక యువకుడు 11 ఏళ్ల బాలికను బలవంతంగా తోటలోకి తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు అత్యాచారం చేశాడు. బాలిక అక్క, తల్లి స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి తనకు పంపాలని, లేకపోతే చంపేస్తానని బెదిరించాడు.

అమానుషం  అమానవీయం

కాటేస్తున్న కామాంధులు

ముక్కుపచ్చలారిని చిన్నారులపై అఘాయిత్యాలు

కన్నకూతుర్ని కూడా వదలని దుర్మార్గులు

బాలికల బలహీనతలు ఆసరాగా అకృత్యాలు

పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధిత కుటుంబాలు వెనకడుగు

నిందితుల్లో మైనర్‌ బాలురు ఉండడం ఆందోళనకరం

నేరాలను ప్రేరేపిస్తున్న స్మార్ట్‌ ఫోన్లు



తల్లిదండ్రులే బాధ్యులు

డాక్టర్‌ ఎన్‌ఎన్‌రాజు, జాతీయ మానసిక వైద్యనిపుణుల సంఘం అధ్యక్షుడు


భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే పిల్లలతో గడిపే సమయం వుండడంలేదు.  దీంతో పిల్లలు తమ బాధలు, ఆలోచనలు తల్లిదండ్రులతో పంచుకునే వీలులేకపోతున్నది. చిన్నపిల్లలకు స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చిన్నారులతో లైంగిక చర్యలకు ఆసక్తిచూపేవారిని వైద్యపరిభాషలో ‘ఫీడో ఫీలియాస్‌’ అంటారు. ఇలాంటివారికి చిన్నపిల్లలను చూడగానే మెదడులో సెక్స్‌ హార్మోన్ల ‘సిమ్యులేషన్‌’ పరిమితికి మంచి స్పందించడంతో వారి శరీరాన్ని తాకడానికి, లైంగికచర్య కోసం విచక్షణ కోల్పోతారు. ఇలాంటివారికి కొంతమంది తల్లిదండ్రుల వ్యవహారశైలి దోహదపడుతున్నది. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌ వినియోగంలో పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఒక యువకుడు 11 ఏళ్ల బాలికను బలవంతంగా తోటలోకి తీసుకెళ్లి, నోట్లో గుడ్డలు అత్యాచారం చేశాడు. బాలిక అక్క, తల్లి స్నానం చేస్తున్నప్పుడు వీడియో తీసి తనకు పంపాలని, లేకపోతే చంపేస్తానని  బెదిరించాడు.

చోడవరంలో 14 ఏళ్ల బాలుడు చాక్లెట్లు ఇస్తానని మాయమాటలు చెప్పి మూడేళ్లు, ఆరేళ్ల వయసున్న చిన్నారులను ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయగా స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

భీమిలి మండలం కాపులుప్పాడలో 12 ఏళ్ల బాలుడు అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి పోలీసులు ఫిర్యాదు చేయడంతో బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

ఆరిలోవకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి తన కన్నకూతురుపైనే ఏడాదిగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక తన తల్లి సహాయంతో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది.’

జిల్లాలో గత రెండు మూడు రోజుల్లో వెలుగు చూసిన అమానుష సంఘటనలు ఇవి. జిల్లాలో గత కొద్దిరోజులుగా మైనర్‌బాలికలు, యువతులపై కామాంధుల అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పిల్లలు ఒంటరిగా వుండడం, చిన్నారుల బలహీనతలను ఆసరాగా తీసుకుని కొంతమంది ప్రబుద్ధులు ఇటువంటి అమానవీయ దారుణాలకు పాల్పడుతున్నారు. నిందితుల్లో సొంత కుటుంబ సభ్యులతోపాటు మైనర్‌ అబ్బాయిలు వుండడం ఆందోళన కలిగిస్తున్నది. బాధితుల్లో కొంతమంది మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తుండగా, సమాజంలో చిన్నచూపుకి గురవుతామని, బాలికల భవిష్యత్తు దెబ్బతింటుందనే భయంతో చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడంలేదు. మరికొన్నిచోట్ల కుల పెద్దల పంచాయితీలో నిందితులకు జరిమానా విధించి వదిలేస్తున్నారు. 

ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనుషుల ప్రాధాన్యాలతోపాటు జీవనవిధానం మారిపోయింది. తప్పు చేస్తే ఎదుటివారి ముందు తలెత్తుకోలేమని భావన తొలగిపోయి, డబ్బు సంపాదిస్తే ఎలాంటి అవమానాలు ఎదురైనా పర్వాలేదనే భావన చాలామందిలో పెరిగిపోయింది. దీంతో మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోయాయి. తల్లిదండ్రులు కూడా తమ చిన్న పిల్లలను ఇంటి వద్దనో లేదంటే కేర్‌సెంటర్లలోనో వదిలేసి ఉద్యోగాలు/ కూలిపనులకు వెళ్లిపోతున్నారు. సాయంత్రం తిరిగి వచ్చిన తరువాత ఇంటి పనుల్లో తలమునకలై, పిల్లలతో సమయం గడిపే పరిస్థితి ఉండడంలేదు. దీంతో చిన్నారులు తమ ఆలోచనలు, బాధలు, సంతోషాలు, ఇష్టాలను తల్లిదండ్రులతో పంచుకునే అవకాశం ఉండడం లేదు. స్మార్ట్‌ఫోన్‌ చేతిలో పెట్టేస్తుండడంతో ఇంటర్నెట్‌లో తమకు నచ్చిన వీడియోలు, సినిమాలు చూసుకుంటూ వాటికి బానిసలైపోతున్నారు. పరిపక్వతలేని వయసు కావడంతో ఏది మంచి... ఏదో చెడు... అన్నది అర్థం చేసుకోలేకపోతున్నారు. మనస్సులో ఏదైనా భావన లేదా ఆలోచన కలిగితే వెంటనే దానిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి వాటిలో చిన్నారులపై లైంగికదాడులను ప్రధానంగా చెప్పాలి.  గతకొంతకాలంగా వెలుగుచూస్తున్న ఘటనల్లో అత్యధికం ఈ తరహావే కావడం గమనార్హం. నక్కపల్లి మండలం రాజయ్యపేట, భీమిలి మండలం కాపులుప్పాడ, చోడవరం పట్టణంలో మైనర్‌ బాలికలపై జరిగిన అత్యాచారాలు/ అత్యాచార యత్నాలు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. ముఖ్యంగా కాపులుప్పాడ, చోడవరం ప్రాంతాల్లో ఆరేళ్లు కూడా నిండని అభంశుభం తెలియని బాలికలపై 12-14 ఏళ్ల బాలురు అత్యాచారానికి యత్నించడం సమాజాన్ని తీవ్ర ఆందోళనపరుస్తున్నది. మైనర్లపై లైంగికదాడి, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే తీవ్రమైన శిక్షలు పడతాయని తెలిసినప్పటికీ కొంతమంది చట్టాల్లోని లొసుగులు, అవతలివారి బలహీనతలను ఆసరాగా చేసుకుని దారుణాలకు ఒడిగడుతున్నారు. 


పిల్లల కోసం సమయం కేటాయించాలి

డాక్టర్‌ ప్రేమ్‌కాజల్‌, దిశ పోలీస్‌స్టేషన్‌ ఏసీపీ


తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలకు గుడ్‌, బ్యాడ్‌ టచ్‌లతోపాటు ఎదుటివారితో ప్రవర్తించడం ఎలా? అనే వాటి గురించి వివరించాలి.  పిల్లలు తమ ఆలోచనలు, భావాలను పంచుకునే అవకాశం తల్లిదండ్రులు కల్పించాలి. వారికోసం కొంత సమయం కేటాయించాలి.  మైనర్లపై లైంగిక దాడికి యత్నించినా, దాడి చేసినా కనీసం మూడు సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.  


Updated Date - 2022-01-24T06:28:48+05:30 IST