అమానుషం

ABN , First Publish Date - 2021-10-05T06:26:32+05:30 IST

రైతుఉద్యమాలు, నిరసనలు ఈ దేశానికి కొత్తేమీకాదు కానీ, ఆదివారం నాడు ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటన మాత్రం చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతుంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన వెలిబుచ్చుతున్న...

అమానుషం

రైతుఉద్యమాలు, నిరసనలు ఈ దేశానికి కొత్తేమీకాదు కానీ, ఆదివారం నాడు ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకున్న అమానవీయ ఘటన మాత్రం చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతుంది. సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన వెలిబుచ్చుతున్న అన్నదాతలపైకి బీజేపీ నాయకుడు, కేంద్రహోంశాఖ సహాయమంత్రి అజయ్‌మిశ్రాకు చెందిన వాహనాలు దూసుకుపోవడంతో నలుగురు రైతులు వాటికిందపడి మరణించారు. ఈ పరిణామానికి నిర్ఘాంతపోయిన రైతులు ఆగ్రహంతో ఊగిపోతూ ఆ వాహనాల్లో ఉన్న బీజేపీ కార్యకర్తలను, డ్రైవర్లను అక్కడిక్కడే కొట్టిచంపేశారు. ఈ హింసలో తొమ్మిదిమంది మరణించగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. రైతులగోడు పట్టించుకోని పాలకులు చివరకు నిరసనలను సైతం సహించలేని దశకు చేరుకున్నారనడానికి లఖింపూర్‌ ఖేరీ ఘటన మరో ఉదాహరణ.


కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఈ బీభత్సకాండకు కారకుడనీ, ఆయన ఆదేశాలమేరకే డ్రైవర్లు ఆ వాహనాలను తమమీదకు పోనిచ్చారని రైతులు అంటున్నారు. నుజ్జయిన శరీరాలు, బాధితుల హాహాకారాలు, రక్తసిక్తమయిన రహదారితో ఘటనాస్థలం భీతావహంగా మారింది. కేంద్రమంత్రి స్వగ్రామంలో జరగబోయే ఓ కార్యక్రమానికి యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్‌ మౌర్య కూడా హాజరవుతున్నందున ఆయనకు నల్లజెండాలతో నిరసన తెలియచేయాలన్న ఉద్దేశంతో  రైతులు రహదారిపైకి చేరుకున్నారు. ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి కేంద్రమంత్రి కుమారుడు పలువాహనాల్లో అటుగా రావడంతో రైతులు నల్లజెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. వారిని చూడగానే ఆశిష్‌ ఆగ్రహంతో రగిలిపోయాడనీ, కాల్పులు కూడా జరిపాడనీ అంటున్నారు. ఒక్కసారిగా కార్లు వేగం పుంజుకొని రైతులను తొక్కుకుంటూపోవడమన్నది ఊహకు కూడా అందని అమానవీయమైన దృశ్యం. తానూ తన కుమారుడు అక్కడ లేమనీ, కార్యక్రమ వేదికవద్దనే ఉదయం నుంచీ ఉన్నామనీ, రైతులే ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించి ఈ హింస చేశారని కేంద్రమంత్రి అంటున్నారు. ఈ ఘటనను దేశవ్యాప్తంగా రైతుసంఘాలు నిరసించాయి, విపక్షనేతలు లఖింపూర్‌లో కాలూనకుండా యోగి ప్రభుత్వం బాగా కట్టడి చేసింది.


లఖింపూర్‌ ఘటన హఠాత్తుగా జరిగిపోయినదేమీ కాదు. రైతుల నిరసనలను, ఆందోళనలను బీజేపీ నాయకులు, దేశ పాలకులు ఏ విధంగా చూస్తున్నారో ఇది తెలియచెబుతున్నది. ఉద్యమిస్తున్న రైతులను ఉగ్రవాదులుగానూ, వారి ఆందోళనను ద్రోహంగానూ అధికారపక్షం నేతలు చిత్రీకరించడం ఎంతోకాలంగా జరుగుతోంది. రైతులను ప్రమాదకారులుగా, సంఘవిద్రోహులుగా అభివర్ణిస్తున్నారు. రైతు ఉద్యమాన్ని బలహీనపరచడానికీ, అవమానించడానికి పాలకులు చేయని ప్రయత్నం లేదు. ఈ ఘటనకు వారం ముందు ఇదే కేంద్రమంత్రి ఉద్యమిస్తున్న రైతులు తమ వైఖరి వెంటనే మార్చుకోకపోతే, కేవలం రెండునిముషాల్లో వారిని ఎలా దారికి తేవాలో తనకు తెలుసునని ఓ వ్యాఖ్యచేశారు. ఆయన ప్రసంగించిన విడియోల్లో రైతులను తన్నడం, తరిమికొట్టడం వంటి భాష విరివిగా ఉంది. ఈ ఘటన జరిగిన రోజే హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్‌ బీజేపీ కిసాన్‌మోర్చా సదస్సులో మాట్లాడుతూ ఉద్యమిస్తున్న రైతులను కర్రలతో చావగొట్టమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ప్రతీ వెయ్యిమందితో ఒక స్వచ్ఛంద సేవక బృందం ఏర్పడి, రైతులకు లాఠీ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలి. కేసులు, బెయిళ్ళు, జైళ్ళ గురించి ఆలోచించద్దు, అన్నీ మేం చూసుకుంటాం’ అని ఆయన భరోసా ఇచ్చారు. తమ ముఖ్యమంత్రి మనసెరిగినందునే, కర్ణాల్‌ సబ్‌డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ఆయుష్‌ సిన్హా ఇటీవల ఉద్యమిస్తున్న రైతుల తలలు బద్దలు కొట్టమని పోలీసులను ఆదేశించారు. పోలీసులు రెచ్చిపోయి పాతికమంది రైతులను చావగొట్టారు, ఒకరిని చంపేశారు. బీజేపీ పెద్దలు రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ, వారి నిరసనను ఉగ్రవాదుల, మావోయిస్టుల ఉద్యమంగా అభివర్ణిస్తూ, తమ కిందివారిని దాడికి ఉసిగొలుపుతూంటే లఖింపూర్‌ ఘటనల వంటివి జరగకుండా ఎలా ఉంటాయి? ఎన్నిమాసాలైనా అదే పట్టుదలతో రైతులు ఉద్యమాన్ని కొనసాగించడం పాలకులకు మింగుడుపడటం లేదు. నిరసనదీక్షలో ఉన్న రైతులను శత్రువుగా చూసినంత కాలం ఈ సమస్యకు పరిష్కారం దక్కదు.

Updated Date - 2021-10-05T06:26:32+05:30 IST