నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ

ABN , First Publish Date - 2021-01-12T21:51:03+05:30 IST

ఆస్ట్రేలియాలో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలబారిన పడి ఇప్పటికే కీలక

నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాలో టీమిండియాకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గాయాలబారిన పడి ఇప్పటికే కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా, తాజాగా టీమిండియా నంబర్ వన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా బ్రిస్బేన్‌లో జరగనున్న చివరి టెస్టులో ఆడడం అనుమానంగానే ఉంది. పొత్తి కడుపు కండరగాయంతో బాధపడుతున్న బుమ్రాను నాలుగో టెస్టులో దింపడం భావ్యం కాదని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 


సిడ్నీలో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్సింగ్స్ సమయంలో బుమ్రా పొత్తి కడుపు సమస్యతో మైదానంలో ఇబ్బంది పడుతూ కనిపించాడు. కాసేపు మైదానాన్ని వీడాడు. ఫిజియోతో చికిత్స తీసుకున్న అనంతరం తిరిగి మైదానంలోకి వచ్చి బౌలింగ్ వేశాడు. భారత బౌలర్లు మొత్తం 87 ఓవర్లు బౌలింగ్ వేస్తే అందులో ఒక్క బుమ్రానే 25 ఓవర్లు వేయడం గమనార్హం. 


సిరీస్ నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టుకు ముందు భారత్‌కు ఇది భారీ ఎదురుదెబ్బే కానుంది. ఇప్పటికే పేసర్ షమీ దూరం కావడంతో ఇండియా పేస్ దళాన్ని బుమ్రా మోస్తున్నాడు. ఇప్పుడు అతడు కూడా దూరమైతే భారత్‌కు ఇబ్బందులు తప్పనట్టే. అనభవం లేని బౌలర్లతో బరిలోకి దిగి ఏమేరకు రాణిస్తుందన్నది అభిమానుల ఆందోళన.  


బుమ్రా కనుక నాలుగో టెస్టుకు దూరమైతే అతడి స్థానంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని నటరాజన్, శార్దూల్ ఠాకూర్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ అశ్విన్ కూడా జట్టుకు దూరమైతే అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. కాగా, తొలి టెస్టులో పేసర్ మహ్మద్ షమీ గాయపడగా, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. మూడో టెస్టులో రవీంద్ర జడేజా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఇప్పుడు, హనుమ విహారి, అశ్విన్, బుమ్రాలు కూడా గాయాలపాలడం అభిమానులను కలవరుస్తోంది.


Updated Date - 2021-01-12T21:51:03+05:30 IST