ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం: విజయశాంతి

ABN , First Publish Date - 2021-12-16T02:02:45+05:30 IST

ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం: విజయశాంతి

ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం: విజయశాంతి

హైదరాబాద్: ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో తెలంగాణ సర్కారు తీరుపై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. పుండొక చోట ఉంటే... మందొక చోట రాసిన చందంగా రాష్ట్ర సర్కార్ తీరు ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో స్పష్టంగా కనిపిస్తోందని విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం జరుగుతోందని ఆమె అన్నారు. సోషల్ మీడియాలో రాములమ్మ పోస్టు యథాతథంగా...


''పుండొక చోట ఉంటే... మందొక చోట రాసిన చందంగా రాష్ట్ర సర్కార్ తీరు ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పోరుబాట పట్టి, సకల జనుల సమ్మె చేసి ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న ఉద్యోగులు, టీచర్లకు స్వరాష్ట్రంలోనే అన్యాయం జరుగుతోంది. వారి సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పీఆర్సీని అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు.పైగా వారికి న్యాయంగా రావాల్సిన ప్రమోషన్లు, బదిలీలు నిలిచిపోయేలా చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317 వల్ల ఉద్యోగులు, టీచర్ల స్థానికతకే ఇప్పుడు ప్రమాదం ఏర్పడింది. ఈ జీవో కారణంగా స్థానికులైన ఉద్యోగులు జోనల్ విధానంతో వేరే జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడగా... వీరు తట్టా బుట్టా సర్దుకుని తమ కుటుంబాన్ని, బంధువులను, కష్టపడి నిర్మించుకున్న ఇళ్ళను వదులుకుని కొత్త జిల్లాలో స్థానికులు కావడానికి బయలుదేరాల్సిన పరిస్థితిని రాష్ట్ర సర్కార్ తెచ్చింది.  జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాలోనైనా తక్కువగా పోస్టులుంటే, ఇతర జిల్లాల్లోని మిగులు ఖాళీలను ఆ జిల్లాలకు తరలించడం... లేదా సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించడం చేయాలి. అలా సాధ్యం కాకపోతే స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన దిశగా  కొత్త రిక్రూట్మెంట్ చేసి పోస్టులను భర్తీ చేయాలి. కానీ.. ఆరేళ్లలో రిటైర్ అయ్యేవాళ్ళని స్థానికత ఆధారంగా బదిలీ చేసి, జూనియర్ ఉద్యోగులకు అన్యాయం చేయడం ప్రభుత్వ అసమర్థ విధానానికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో 1975లో చేపట్టిన ప్రక్రియ మాదిరిగానే ఉద్యోగులు, టీచర్లను వారి స్థానికత ఆధారంగా ఆయా జిల్లా పోస్టుల్లో, జోనల్ పోస్టుల్లో, మల్టీ జోన్ పోస్టుల్లో ర్యాటిఫై చేసి రీటెయిన్ చేస్తే సరిపోయే అంశాన్ని... మరింత జటిలంగా మార్చాలని రాష్ట్ర సర్కార్ కుట్ర పన్నడం సిగ్గుచేటు. ఇప్పటికైనా జీవో 317ను వెంటనే వెనక్కి రాష్ట్ర సర్కార్ తీసుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి తగు పరిష్కారం చూపిస్తే మంచిది.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2021-12-16T02:02:45+05:30 IST