పదోన్నతి దైవాధీనం!

ABN , First Publish Date - 2021-01-18T08:45:28+05:30 IST

దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశం మరో సారి తెరపైకి వచ్చింది. అన్ని విభాగాల్లో పదోన్నతులు కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో...

పదోన్నతి దైవాధీనం!

దేవాదాయ శాఖలో అర్హులకు అన్యాయం

ఏళ్ల తరబడి తూతూమంత్రంగా డీపీసీలు

కొందరి కోసం కోర్టు ఆదేశాలు బేఖాతరు

సామూహిక సెలవులో నలుగురు ఉద్యోగులు


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): దేవాదాయ శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల అంశం మరో సారి తెరపైకి వచ్చింది. అన్ని విభాగాల్లో పదోన్నతులు కల్పిస్తామంటూ సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో... ఈ సారైనా తమకు న్యాయం జరుగుతుందో? లేదో? అని అర్హులైన ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దేవాదాయ శాఖలో పదోన్నతుల వివాదం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. 2014నాటికి గ్రేడ్‌-1ఈవోలుగా ఉన్న కొందరికి 2016లో ఏకంగా డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించారు. వాస్తవానికి వారికి తొలుత అసిస్టెంట్‌ కమిషనర్లుగా, ఆ తర్వాత డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు ఇవ్వాలి. కానీ.. పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులు.. కొందరికి అనుకూలంగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ అర్హత ఉన్న అధికారులు 2017లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం న్యాయస్థానం రూల్‌-8ను అనుసరించి రెగ్యులర్‌ డీపీసీ నిర్వహించి అర్హత ఉన్నవారికి మాత్రమే పదోన్నతి కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.


కోర్టు ఆదేశాల ప్రకారం డీపీసీలు సక్రమంగా నిర్వహిస్తే గతంలో ఇచ్చిన పదోన్నతులను రద్దు చేయాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏళ్ల తరబడి తూతూమంత్రంగా డీపీసీలు నిర్వహిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ కొన్ని నెలలుగా నలుగురు అసిస్టెంట్‌ కమిషనర్లు సామూహిక సెలవుపై వెళ్లడం.. ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, పదోన్నతుల విషయంలో ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలంటూ ఇటీవల వారు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ఒక అధికారి కోసం దేవాదాయశాఖ కమిషనర్‌ అనుసరిస్తున్న తీరు వల్ల పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా అసిస్టెంట్‌ కమిషనర్లుగా నియమితులైన తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు బేఖాతారు చేయడం, నిర్ణయం తీసుకోకుండానే డీపీసీలు ముగించడంపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2021-01-18T08:45:28+05:30 IST