చేయూత పథకంలో అర్హులకు అన్యాయం

ABN , First Publish Date - 2021-06-24T05:45:52+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మహిళలు సుమారు కోటి మంది ఉంటే వైసీపీ ప్రభుత్వం 23 లక్షల మందికి మాత్రమే చేయూత పథకం వర్తింపజేయడం అన్యాయమని టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు.

చేయూత పథకంలో అర్హులకు అన్యాయం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగజగదీశ్‌

టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్‌


అనకాపల్లి, జూన్‌ 23: రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 60 ఏళ్ల మహిళలు సుమారు కోటి మంది ఉంటే వైసీపీ ప్రభుత్వం 23 లక్షల మందికి మాత్రమే చేయూత పథకం వర్తింపజేయడం అన్యాయమని టీడీపీ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ పట్టణ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 45  ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ మహిళలకు నెలకు రూ.3 వేలు పింఛన్‌ ఇస్తానని ఊరూరా తిరిగి ప్రచారం చేసుకున్న జగన్‌, అధికారం చేపట్టాక మడం తిప్పారని విమర్శించారు. చేయూత లబ్ధిదారుల వివరాలు పంచాయతీల వారీగా ఇస్తే అసలు బండారం బయట పడుతుందన్నారు. చేయూత పథకంలో రోజుకో రూలు ప్రవేశపెట్టి మహిళలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. ఆధార్‌కు ఫోన్‌ నంబర్‌ లింకు చేయాలని చెప్పడం వల్ల మహిళలు రోడ్లపైకి రావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చేయూత పేరుతో హడావుడి చేస్తూ మహిళలకు అందించే సాయంలోనూ చేతివాటం చూపడం జగన్‌రెడ్డికే చెల్లిందని విమర్శించారు. అలాగే అమూల్‌ సంస్థ ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్రంలో పాడి వ్యవస్థను నాశనం చేస్తున్నారని బుద్ద ఆరోపించారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్‌ కేకేవీఏ నారాయణరావు, విశాఖ అర్బన్‌ ఉపాధ్యక్షుడు మళ్ల సురేంద్ర, అర్బన్‌ కార్యదర్శి బీఎస్‌ఎంకే జోగినాయుడు, ఉపాధ్యక్షుడు కుప్పిలి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-06-24T05:45:52+05:30 IST