ఇంకొల్లు, పర్చూరు టూ పేట

ABN , First Publish Date - 2020-12-02T05:57:17+05:30 IST

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దందా మళ్లీ రెక్కలు..

ఇంకొల్లు, పర్చూరు టూ పేట
బియ్యం లోడుతో ఉన్న లారీ

జోరుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

పట్టించుకోని రెవెన్యూ అధికారులు

ముచ్చటగా మూడు రూట్‌లలో తరలింపు

ఆ మార్గాల్లో పోలీస్‌ స్టేషన్లకు మామూళ్ల చెల్లింపునకు రాయబేరాలు..!

ఒప్పందం కుదిరినట్లు ప్రచారం

మిగిలిన శాఖల అధికారులకూ  మామూళ్లు 


చీరాల : రేషన్‌ బియ్యం అక్రమ రవాణా దందా మళ్లీ రెక్కలు తొడిగింది. ఇంకొల్లు, కారంచేడు, పర్చూరు మండలాల నుంచి  ఏకంగా టర్బో లారీల ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీన్ని నిలువరించాల్సిన రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తిచూడటం లేదు. దీంతోపాటు ఇంకొల్లు సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌ అసెంబ్లీ  బందోబస్తులో ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న రేషన్‌ మాఫియా నాలుగు రోజుల నుంచి అక్రమ రవాణాకు తెరలేపారు. వారు సరుకు రవాణా చేసే మార్గాల్లోని పోలీస్‌ స్టేషన్లకు మామూళ్లు ఇచ్చేందుకు ఒప్పందం కోసం ముందస్తుగా రాయబేరాలు నడిపారని, అవి ఫలించాయని ప్రచారం జరుగుతోంది. రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చీరాల ప్రాం తంలో మళ్లీ ఊపందుకుంది. ఆ దందాలో సిద్ధహస్తులుగా పేరుపొందిన వారు ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆదేశాలతో అక్టోబరులో జిల్లావ్యాప్తంగా జరిగిన దాడుల్లో పలు రైస్‌మిల్లుల్లో రేషన్‌ బియ్యం భారీస్థాయిలో  పట్టుబడ్డాయి. ఆ క్రమంలో కొంతమేర అక్రమ వ్యాపారం ఆగింది. దీంతో రేషన్‌ దుకాణాల్లో ఎప్పటి మాదిరిగానే డీలర్లు మిగిల్చే బియ్యం, వారు తక్కువ ధరకు కార్డుదారుల నుంచి కొనుగోలు చే సేవి పెద్దమొత్తంలో నిల్వలు పేరుకుపోయాయి. ఇంకొల్లు, కారంచేడు, పర్చూరు మండలాల పరిధిలో ఆ పరిస్థితి ఎక్కువగా ఉంది. రేషన్‌ అక్ర మార్కులకు, డీలర్లకు, రెవెన్యూ అధికారులకు, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లకు, ఎం ఎల్‌ఎస్‌ పాయింట్‌ అధికారులకు మధ్య ఉన్న అవగాహనతో ఎలాంటి తనిఖీలు నిర్వహించలేదు. ఈక్రమంలో తాజాగా మూడు, నాలుగు రోజుల నుంచి ఈ మూడు మండలాల పరిధిలో రేషన్‌ బియ్యంను అక్రమంగా చిలకలూరిపేటకు తరలించి విక్రయిస్తున్నారు.


అక్రమార్కులు ఎవరెవరు 

రేషన్‌ అక్రమ రవాణాలో ఇంకొల్లు మండలం ఇడుపులపాడుకు చెందిన ఓ వ్యక్తి కీలక భూమిక పోషిస్తున్నాడు. ఇతను ఇంకొల్లుతోపాటు కారం చేడు మండలంలో కూడా రేషన్‌ బియాన్ని డీలర్ల నుంచి సేకరిస్తున్నాడు. తర్వాత పర్చూరు మండలంలో నూతలపాడుకు చెందిన ఓ వ్యక్తి, అతని భాగస్వామిగా చీరాలకు చెందిన మరోవ్యక్తి ఉన్నారు. అడుసుమల్లికి చెం దిన ఓ మహిళ కూడా ఈ వ్యవహారం నడుపుతోంది. వీరు కాక చిల్లర మల్లరగా రేషన్‌ బియ్యంను సేకరించిన వారు కూడా వీరికే విక్రయి స్తుంటారు. ఆయా మండలాల పరిధిలోని నాయకులు, రెవెన్యూ అధికారు లు, పోలీసులకు వారు చేసే వ్యాపారం గురించి తెలుసని అక్కడివారు బహిరంగంగానే చెబుతున్నారు. 


చిలకలూరిపేటకు తరలింపు

డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని టర్బో లారీల ద్వారా చిలకలూరి పేటకు తరలిస్తున్నారు. అక్కడ సాయినామంతో ఉన్న ఓ వ్యక్తి వీటిని కొనుగోలు చేస్తున్నాడు. ఇక్కడ నుంచి సరుకు తరలించేవారు రెండు, మూడు మార్గాలను మాత్రమే ఎంచుకుంటున్నారు. ఆ దారుల్లో ఉండే పోలీస్‌స్టేషన్లు తక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు. అధికారులు, సి బ్బంది తమ వాహనాలను అడ్డగించకుండా ముందస్తుగా ప్రసన్నం చేసుకొని లోబర్చుకొంటున్నారు. 


సందట్లో సడేమియా.. 

ఇంకొల్లు సీఐగా అల్తాఫ్‌ హుస్సేన్‌ బాధ్యతలు స్వీకరించాక ఒకటి అర తప్పించి అక్రమ రవాణా పెద్దగా జరగలేదు.  నాలుగు రోజుల నుంచి ఆయన అసెంబ్లీ ససమావేశాల బందోబస్తుకు వెళ్లారు. దీన్ని గుర్తించిన అక్రమార్కులు తాము సరుకు తీసుకెళ్లేదారుల్లోని పోలీస్‌స్టేషన్ల వారిని ప్రసన్నం చేసుకునేందుకు రాయబేరాలు నడపగా అవి ఫలప్రదం అయ్యాయని, ఆ తర్వాతే రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఆ వర్గాల్లో ప్రచారం.


ముందస్తుగా రెక్కీ ... తర్వాత తరలింపు...

ఇంకొల్లు మండలం ఇడుపులపాడు, సూదివారిపాలెం, కోలలపూడి మీదుగా ఎన్‌హెచ్‌ 16... ఇంకొల్లు, నాగండ్ల, కోలలపూడి మీదుగా జాతీయరహదారి ఈ రెండు మార్గాల్లో చిలకలూరిపేటలోపు ఒక్క మార్టూరు స్టేషన్‌ మాత్రమే తగులుతుంది. ఇంకొల్లు, దుద్దుకూరు, రాచపూడి, నాగులుప్పలపాడు మీదుగా తిమ్మనపాలెం వద్ద జాతీయరహదారికి చేరి అక్కడ నుంచి కూడా చిలకలూరిపేటకు రేషన్‌ బియ్యం లారీలను తరలిస్తున్నారు. మొదటి రెండు మార్గాల్లోనే ఎక్కువ సరుకు రవాణా సాగుతోంది. అప్పుడప్పుడూ పోలీస్‌ నిఘా ఎక్కువగా ఉన్నపుడు వారి దృష్టి మరల్చేందుకు ఎన్‌జీపాడు రూటును ఉపయోగిస్తున్నారు. లారీలు బయలుదేరే ముందు వాటిలో సరుకు ఎక్కించిన వ్యక్తులు 10 నిమిషాల ముందు బైక్‌పై రోడ్డు వెంట రెక్కీ నిర్వహిస్తారు. వారి వెనుక లారీ వస్తుంది. ఎక్కడన్నా అనుమానపు పరిస్థితులు ఉంటే వెంటనే లారీ డ్రైవర్‌కు సమాచారమిచ్చి రూటు మారుస్తారు. 


అక్రమ రవాణాను సహించం: అల్తాఫ్‌ హుస్సేన్‌, సీఐ, ఇంకొల్లు 

ప్రస్తుతం అసెంబ్లీ బందోబస్తులో ఉన్నాను. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏ మాత్రం సహించం. అందుకు సంబంఽధించి ఎలాంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తావులేదు. నిరాధార ఆరోపణలు సరికాదు. మా ఎస్సైలతో కూడా మాట్లాడతాను. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించం. 



Updated Date - 2020-12-02T05:57:17+05:30 IST