Abn logo
Sep 26 2021 @ 17:26PM

అపరిచితుడితో మాట్లాడిందని.. కోడలిని చెట్టుకు కట్టేసి చావబాదిన అత్తమామలు

రాంపూర్ (ఉత్తరప్రదేశ్): కోడలు అపరిచితుడితో మాట్లాడడాన్ని చూసి సహించలేకపోయిన అత్తింటివారు ఆమెను చెట్టుకు కట్టేసి చావబాదారు. వారి చిత్రహింసలు భరించలేక రోదిస్తూ కనికరించమని వేడుకుంటున్నా వారి మనసు కరగలేదు. ఇంటిల్లిపాదీ విచక్షణ రహితంగా దాడిచేస్తూ చిత్రహింసలకు గురిచేశారు. రాంపూర్‌లోని  బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను చెట్టుకు కట్టేసి చావబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది చూసిన అపరిచితుడు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


చెట్టుకు వేలాడతున్న మహిళపై అత్తమామలు, కుటుంబ సభ్యులు విచక్షణ రహితంగా దాడి చేస్తుండడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. బాధతో విలవిల్లాడుతూ రోదిస్తున్న బాధిత మహిళ క్షమించి తనను విడిచిపెట్టాలని వేడుకుంటున్నా వారు దాడి ఆపకపోవడం గమనార్హం. ఆమె మాట్లాడినట్టుగా చెబుతున్న ‘అపరిచితుడి’ ఫిర్యాదుతో మొత్తం 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  


పోలీసుల కథనం ప్రకారం.. అపరిచిత వ్యక్తి బిలాస్‌పూర్‌కు వస్తుండగా దారిలో బాధితురాలిని చూసి మాటలు కలిపాడు. వీరు మాట్లాడుకుంటుండగా చూసిన స్థానికుడు ఒకరు ఆమె అత్తమామలకు ఈ విషయాన్ని చేరవేశాడు. వారు రావడంతో భయపడిన అపరిచిత వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో మహిళను లాక్కొచ్చి చెట్టుకు కట్టేశారు. 


అపరిచితుడిది ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్. రాంపూర్‌లో అతడికి ఆస్తులు ఉండడంతో వాటిని చూసి వెళ్లేందుకు వచ్చాడు. దారిలో కనిపించిన మహిళ తనకు తెలిసిన వ్యక్తి కావడంతో మాటలు కలిపాడు. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా చూసిన అత్తమామలు, కుటుంబ సభ్యులు ఆమెను లాక్కొచ్చి చెట్టుకు కట్టేసి ఇష్టానుసారం దాడిచేశారు. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...