ఇంకెన్నాళ్లీ గోస

ABN , First Publish Date - 2021-07-30T06:00:08+05:30 IST

వర్షాకాలం మొదలైందంటే కొన్ని మారుమూల గ్రామాల ప్రజలకు గోస తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు వరద ఉధృతితో రాకపోకలు నిలిచి పోయే పరిస్థితే కనిపిస్తోంది. సాహసం చేసి లో లెవల్‌ వంతెన దాటే ప్రయత్నంలో ఏటా పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.

ఇంకెన్నాళ్లీ గోస

జిల్లాలో ప్రమాదకరంగా లో లెవల్‌ వంతెనలు

చిన్నపాటి వర్షానికే నిలిచిపోతున్న రాకపోకలు

ఈ యేడు ప్రమాదం బారిన పడి ఇద్దరు గల్లంతు

వరద ఉధృతి అంచనాపై అధికారులు విఫలం

ఆపద సమయంలో అవస్థలు పడుతున్న జనం

ఆదిలాబాద్‌, జూలై29 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం మొదలైందంటే కొన్ని మారుమూల గ్రామాల ప్రజలకు గోస తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటికీ వందలాది గ్రామాలకు వరద ఉధృతితో రాకపోకలు నిలిచి పోయే పరిస్థితే కనిపిస్తోంది. సాహసం చేసి లో లెవల్‌ వంతెన దాటే ప్రయత్నంలో ఏటా పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ ఏడు లోలెవల్‌ వంతెనలు దాటుతూ ఇద్దరు వ్యక్తులు వరద నీటిలో గల్లంతై మృతి చెందారు. జిల్లాలో 468 గ్రామ పంచాయతీలకు గాను వందకు పైగా గ్రామాలకు ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. చిన్నపాటి వర్షాలకే వాగులు, వంకలు పొంగిపారడంతో లోలెవల్‌ కల్వర్టులు నీటమునిగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 34 గ్రామాల కు అధికారికంగా రాకపోకలను నిలిపి వేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తూనే ఉంది. ము ఖ్యంగా అత్యవసరం, ఆపద సమయంలో ఊరిదాటి బయటకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోం ది. అత్యవసరమైన చోట హైలెవల్‌ బ్రిడ్జిలను నిర్మించక పోవడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు నేతల ప్రతిపాదనలకే తలొగ్గడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు పడరాని కష్టాలు పడుతున్నారు. 

   ఇద్దరు గల్లంతు..

ఈ ఏడు వానాకాల సీజన్‌లో లోలెవల్‌ వంతెనలు దాటుతూ ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. బోథ్‌ మండలం కుచ్లాపూర్‌ గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడు కుప్టి-కుమారి గ్రామాల మధ్యలో ఉన్న లోలెవల్‌ వంతెనను దాటే క్రమంలో వరద నీటిలో చిక్కుకొని గల్లంతై శవమై కనిపించాడు. అలాగే భీం పూర్‌ మండలం నిపాని గ్రామానికి చెందిన వెంకటిగౌడ్‌ వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వరద ఉధృతిలో గల్లంతై మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందక బాధిత కుటుంబాలకు ఎదురు చూపులు తప్పడం లేదు. కనీసం అధికారులు పలుకరించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలా అధికారుల తప్పిదాలకు అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తూనే ఉన్నాయి.

  అధికారుల నిర్లక్ష్యం..

ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యానికి ఏటా అపారనష్టమే జరుగుతోంది. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీటి ఉధృతిని సరిగా అంచనా వేయక పోవడంతోనే సమస్యలు ఎదురవుతున్నాయి. వరద నీటికి అనుగుణంగా హైలెవల్‌ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉండగా కల్వర్టులతోనే సరిపెడుతున్నారు. అవికూడా నాణ్యతగా లేక పోవడంతో ఒకటి రెండు వర్షాలకే కొట్టుక పోయి ప్రమాదకరంగా మారుతున్నాయి. కానీ అధికారులు మాత్రం కార్యాలయాలకే పరిమితమవుతూ బ్రిడ్జిల నిర్మాణానికి అయ్యే నిధుల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వరదల ఉధృతిని అంచనా వేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఉదాహారణకు ఏడాది క్రితమే పూర్తయిన నిర్మల్‌-ఆదిలాబాద్‌ రహదారిపై నేరడిగొండ మండలం వాంకిడి గ్రామం వద్ద నిర్మించిన హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణంలో ఎన్నో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. సరైన ఎత్తు, వెడల్పుతో బ్రిడ్జిని నిర్మించక పోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పాత నేషనల్‌ హైవే రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. అధికారులను క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండానే పోయింది. ఇలాంటి పరిస్థితులతోనే ఏటా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలు భారీ నష్టం వాటిల్లుతోంది. అత్యవసరమైన చోట కాకుండా అవసరం లేనిచోట బ్రిడ్జిలను నిర్మించడంపై ఆరోపణలు వస్తున్నాయి. కుంటాల జలపాతానికి వెళ్లే రహదారిపై హైలెవల్‌ బ్రిడ్జిని నిర్మించక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే జిల్లా కేంద్రానికి కూతవేటు దూ రంలో ఉన్న బంగారుగూడ వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టక పోవడంతో ఏటా లోలెవల్‌ వంతెనతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాగులు దాటే క్రమంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారుతోంది.


Updated Date - 2021-07-30T06:00:08+05:30 IST